Breaking News

06/05/2019

గాంధీ ఆసుపత్రి రోగులపై ఆర్థిక భారం

హైద్రాబాద్, మే 6, (way2newstv.in)
 గాంధీ ఆసుపత్రి రోగులపై ఆర్థిక భారం పడుతోంది. ఆరు నెలలుగా ఎంఆర్‌ఐ యంత్రం మూలనపడింది. మరమ్మతు చేయాలంటే ఏకంగా రూ.కోటి అవసరం కావడంతో అధికారులు వెనకడుగు వేసారు.  దీంతో రోగులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యం గాంధీ ఆసుపత్రికి 140 వరకు అత్యవసర కేసులు వస్తుంటాయి. ఎక్కువగా తలకు, వెన్నెముక, ఇతర గాయాలతో ఆసుపత్రిలో చేరుతుంటారు. ఇలాంటి వారికి అత్యవసరంగా ఎంఆర్‌ఐ లేదా సీటీస్కాన్ చేయాలి. కొత్త పరికరాల విషయంలో నిర్వహణను కాంట్రాక్టు సంస్థ చేపట్టాలి. అధికారుల నుంచి సమాచారం అందినా ఇంతవరకు సదరు సంస్థ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఏడాది రెండేళ్ల కిందట కొన్న కొన్ని పరికరాలను కూడా వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. గాంధీలో నిత్యం 25 నుంచి 30 వరకు  వరకు ఎంఆర్‌ఐ పరీక్షలు చేస్తుంటారు.


గాంధీ ఆసుపత్రి రోగులపై ఆర్థిక భారం

ప్రస్తుతం ఈ యంత్రం పనిచేయక పోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో ఎంఆర్‌ఐ కోసం బయట రూ.4 నుంచి 6  వేల వరకు వసూలు చేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితిలో అప్పుచేసి పరీక్షలు చేయించుకుంటున్నారు. కొన్నిసార్లు డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో రోగులు సహాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాంధీలో 12 ఏళ్ల కిందట ఎంఆర్‌ఐ యంత్రం అందుబాటులోకి తెచ్చారు. బాగా పాతబడిపోవడంతో ఏడాదిగా తరచూ మొరాయిస్తూ వస్తోంది. ప్రతిసారి కొంత నిధులు పెట్టి మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఆసుపత్రికి విపరీతంగా రద్దీ పెరిగింది. తరచూ రోడ్డు ప్రమాద బాధితులు చేరుతున్నారు. గతంలో రోజుకు 15- నుంచి 20 ఎంఆర్‌ఐలు చేయడమే గొప్ప విషయం. ప్రస్తుతం ఆ సంఖ్య రెండింతలు, మూడింతలకు చేరింది. దీంతో యంత్రంపై కూడా భారీగా భారం పడుతోంది. ఫలితంగా పూర్తిగా మొరాయించింది. ఈసారి మరమ్మతులకు కూడా లొంగని పరిస్థితి ఏర్పడింది. యంత్రంలోని పరికరాలు మార్చి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలంటే దాదాపు రూ.కోటి వరకు ఖర్చు అవుతుందని నిపుణులు తేల్చారు. కొత్త ఎంఆర్‌ఐ యంత్రం రూ.5కోట్లు. పాత దానికి మరమ్మతులకు ఏకంగా రూ.కోటి అవసరం కావడంతో అధికారులు కూడా దానిని పక్కన పెట్టేశారు. త్వరలో ఆధునాతన యంత్రం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అంతవరకు రోగులపై భారం తప్పడం లేదు.

No comments:

Post a Comment