Breaking News

17/05/2019

జూలై నుంచి కాళేశ్వరం నీళ్లు

కరీంనగర్, మే 17, (way2newstv.in)
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చే లక్ష్యంతో మూడేళ్ల క్రితం ‘ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌'కు అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నట్లుగానే 2016 మే 2న ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం సమీపాన పునాదిరాయి వేశారు. కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం పంప్‌హౌస్‌ పనులకు భూమిపూజ చేశారు. అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు. బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, అండర్‌టన్నెళ్లు, భారీ రిజర్వాయర్లతోపాటు ఎస్సారెస్పీ పునర్జీవం పోసే పంప్‌హౌస్‌లను శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు. అలాగే నందిమేడారం, లక్ష్మీపూర్‌ వద్ద భూగర్భంలో అందరూ అబ్బుర పడేలా భారీ పంప్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పనులను కాలంతోపాటే పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల పనులు తుది దశకు చేరుకోగా, నీటి తరలింపు పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే నందిమేడారం పంప్‌హౌస్‌లో నాలుగు మోటర్లకు వెట్న్‌ నిర్వహించి, మేడారం జలాశయంలోకి నీటిని ఎత్తిపోశారు. ఇటు లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌లో మోటర్ల వెట్న్‌, రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌ల్లో డ్రైరన్‌కు అంతా సిద్ధం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే జూలై నుంచి కాళేశ్వరం నీటిని కొంతమేరకైనా ఇవ్వాలన్న లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. ఈ ఏడాది జూలై చివరి నుంచే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 


జూలై నుంచి కాళేశ్వరం నీళ్లు

ఈ ఏడాది నుంచి రోజుకు 2 టీఎంసీలు, వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీళ్లను గోదావరి నుంచి ఎత్తిపోయాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి 3800 మెగావాట్లు, 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి మొత్తం 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరమని సీఎం చెప్పారు. కావాల్సినంత విద్యుత్‌ను సమకూర్చుకుని, గోదావరిలో నీటి ప్రవాహం ఉండే ఆరు నెలల పాటు నిర్విరామంగా 24 గంటల పాటు సరఫరా చేయాలన్నారు. ఏటా దాదాపు 540 నుంచి 600 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వివరించారు. ఎత్తిపోతల పథకాల విద్యుత్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎత్తిపోతల పథకాల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు పరిశీలించాలని సీఎం సూచించారు. జూన్ 10లోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ పంపుహౌజుల నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. పంపుల ట్రయల్ రన్లు కూడా సక్సెస్ అయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచే నీరు లిఫ్టు చేయాలి. ఇందుకు 3,800 మెగావాట్ల విద్యుత్ అవసరం. గోదావరిలో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వాడుకోవాలి. నీటి లభ్యత కూడా మేడిగడ్డ వద్దే ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మరో టిఎంసిని కూడా లిఫ్టు చేయాలి. వచ్చే ఏడాది నుంచి మేడిగడ్డ నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేస్తాం. ఇందుకోసం 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరం. గోదావరిలో నీటి ప్రవాహం ఉండే జూన్ నుంచి డిసెంబర్ వరకు నీటిని లిఫ్టు చేయొచ్చు. జూన్, నవంబర్ మాసాల్లో రోజుకు 2 టీఎంసిల చొప్పున.. జూలై నుంచి అక్టోబర్ వరకు నెలకు మూడు టీఎంసీల చొప్పున నీటిని తోడొచ్చు. డిసెంబర్‌లోనూ ఒక లిఫ్టు నడిపి కొంత నీరు తీసుకోవచ్చు. ఏ నెలలో ఎంత నీరు తీసుకోవచ్చు, ఎంత కరెంటు అవసరమో శాస్త్రీయంగా అంచనా వేయాలి. సరిపడినంత విద్యుత్తు సరఫరా కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని అధికారులకు సీఎం సూచించారు.‘‘గోదావరిలో తెలంగాణకు 954 టిఎంసిల నీటి వాటా ఉంది. ఈ నీటిని వాడుకోవడానికి అన్ని రకాల అనుమతులున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకున్నాం. 44 ఏండ్ల సి.డబ్ల్యు.సి. లెక్కల ప్రకారం మేడిగడ్డ వద్ద పుష్కలమైన నీటి లభ్యత ఉంది. కాబట్టి గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో నీటిని లిఫ్టు చేయాల’’ని కేసీఆర్ సూచించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించిన 22 లక్షల ఎకరాలకు మాత్రమే కాకుండా, శ్రీరాం సాగర్ ఆయకట్టు సహా మొత్తంగా 45 లక్షల ఎకరాలకు ఏడాదికి రెండు పంటలకు నీరందించాలి. ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంటలు పండించాలి. కేవలం సాగునీరే కాకుండా మంచినీటికి, పరిశ్రమలకు కూడా కాళేశ్వరం ద్వారా నీరందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, నిర్వహణ భారంపై కొందరు వెలిబుచ్చే అభిప్రాయాలు పూర్తిగా అవగాహన రాహిత్యంతో కూడుకున్నవి. ఒక్కో ప్రాంతానికి అక్కడున్న పరిస్థితులను బట్టి వేర్వేరు ప్రాధాన్యతలుంటాయి. గల్ఫ్ దేశాల్లో మంచినీళ్లు దొరకవు. అక్కడి ప్రభుత్వాలు ఎక్కువ వ్యయం మంచినీళ్ల కోసమే చేస్తాయి. లాస్ వెగాస్ ప్రాంతానికి మంచినీళ్లు అందివ్వడానికి అమెరికా ప్రభుత్వం 600 కిలోమీటర్ల దూరం నీళ్లను పంప్ చేస్తున్నది. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు ఇవ్వడం ప్రాధాన్యతాంశం. రైతులను బతికించడానికి, వ్యవసాయం సాగడానికి సాగునీటి కోసం ఖర్చు చేస్తాం. ఒక్కసారి కాళేశ్వరం పూర్తయితే జనం బతికిపోతారు. ఏడాదికి 90 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. ఏడాది రెండేళ్ళలోనే ప్రాజెక్టు నిర్మాణానికి పెట్టిన ఖర్చుకు సమానమైన పంట పండుతుంది. రైతుల జీవితాలు మారుతాయి. తెలంగాణ వాతావరణం మారుతుంది’’ అని ముఖ్యమంత్రి వివరించారు. కేసీఆర్ ఈ నెల 19న కాళేశ్వరంలో పర్యటిస్తారు. 

No comments:

Post a Comment