Breaking News

01/05/2019

సుజనాచౌదరీ వర్సెస్ బూచేపల్లి

ఒంగోలు, మే 1,  (way2newstv.in)
ఇక్కడ ఫైట్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి… వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మాత్రమే. పేరుకు అభ్యర్థులు బరిలో ఉన్నా వీరిద్దరూ ఈ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తులా కృషి చేశారు. వీరిద్దరూ పోటీ చేయకపోయినా ఆ నియోజకవర్గాన్ని మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదే ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం రిజర్వ్ డ్ కావడంతో ఇక్కడ అభ్యర్థులు డమ్మీలనే చెప్పాలి. ఎమ్మల్యేలను కూడా అగ్రవర్ణాల పెద్దలే ఆడిస్తారు. సంతనూతలపాడు నియోజకవర్గంపై మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి పట్టుంది. అలాగే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డికి ఇక్కడ పెద్దయెత్తున బలగం ఉంది.దీంతో సంతనూతలపాడు నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారింది. సంతనూతలపాడు నియోజకవర్గం తొలినుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఈ నియోజకవర్గం వైసీపీకి అనుకూలంగా మారింది. 


సుజనాచౌదరీ వర్సెస్ బూచేపల్లి

గత ఎన్నికల్లోనూ ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఇక్కడ గెలిచిన ఆదిమూలం సురేష్ ను యర్రగొండపాలెంకు పంపిన జగన్, ఇక్కడకు సుధాకర్ బాబును తీసుకువచ్చారు. నాన్ లోకల్ లీడర్స్ కు ఇక్కడ అవకాశాలు ఉండటంతో సుధాకర్ బాబును జగన్ పార్టీ బరిలోకి దించింది.తెలుగుదేశం పార్టీ తరుపున బీఎస్ విజయ్ కుమార్ పోటీ చేశారు. ఆయన గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ గత ఐదేళ్ల నుంచి ఇన్ ఛార్జిగా ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోని ప్రధాన సామాజిక వర్గాన్ని డోన్ట్ కేర్ అన్నారు. దీంతో విజయ్ కుమార్ కు టిక్కెట్ ఇవ్వవద్దంటూ చివర వరకూ టీడీపీ నేతలు పోరాడారు. అయినా సుజనా చౌదరి సహకారంతో విజయ్ కుమార్ కే టిక్కెట్ దక్కింది. సుజనా చౌదరి స్వయంగా ఇక్కడ అసంతృప్త నేతలను బుజ్జగించారు. అసంతృప్త నేతలు చేసిన కాంట్రాక్టు పనుల బిల్లులను అప్పటికప్పుడు ఇప్పించి వారిని శాంతింప చేశారు. దీంతో విజయ్ కుమార్ కు ఎన్నికలకు ముందు కొంత తలనొప్పులు తగ్గాయనే చెప్పాలి.ఇక సంతనూతలపాడు నియోజకవర్గంలో మాదిగల ఓటర్లు ఎక్కవుగా ఉంటారు. సుధాకర్ బాబు కూడా అదే సామాజికవర్గం కావడంతో ఆయన గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు. మాదిగలతో పాటుగా ఇక్కడ బీసీలు, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. మద్దిపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల్లో దర్శి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి పట్టుంది. దీంతో జగన్ ఎన్నికల చివరి రోజుల్లో బూచేపల్లిని సంతనూతలపాడుకు పంపడంతో సుధాకర్ బాబుకు కొంత అడ్వాంటేజీ వచ్చిందని చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే బయటపడతారు. కానీ ఇక్కడ వైసీపీ, టీడీపీ పోటీ అనే కన్నా సుజనా చౌదరి, శివప్రసాద్ రెడ్డిల మధ్యనే ఉందన్నది వాస్తవం. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

No comments:

Post a Comment