Breaking News

08/05/2019

ఏపీలో వైఎస్ మంత్రం పలించేనా

తిరుపతి, మే 8, (way2newstv.in)
రెండు సార్లు వరుసగా విజయాలు సాధించడం అంటే ఆషామాషీ కాదు. ఈ విషయంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫార్ములా ప్రాంతీయ పార్టీలైన టిఆర్ఎస్, టిడిపిలకు మొన్నటి ఎన్నికల్లో బాగా పనికొచ్చింది. ఈ ఫార్ములా అటు ఇటు మార్చి సొంత రూట్ లో వెళ్లినట్లు ఈ రెండు పార్టీల అధినేతలు బిల్డప్ ఇచ్చారంటున్నారు విశ్లేషకులు. వైఎస్ ఫార్ములా తోనే గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు టిడిపి సైతం ఈ ఫార్ములా తోనే గట్టెక్కిస్తామని బలంగా నమ్ముతుంది. 2009 ఎన్నికల్లో వైఎస్సాఆర్ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు భిన్నమైన వ్యూహాలు అనుసరించారు. తన సంక్షేమ పథకాలనే నమ్ముకుని తెలంగాణాలో ఓట్లు అడిగారు. తెలంగాణ లో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఆయన ఆంధ్ర ప్రాంతంలో సెంటిమెంట్ రాజేశారు. మహాకూటమిగా రంగంలోకి దిగిన టిడిపి కి ఓటేస్తే టిఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాలని హెచ్చరించారు. వలస పక్షుల్లా జీవించాలని ఓటర్లలోకి సెంటిమెంట్ బలంగా దింపారు. ఆయన వ్యూహం ఫలించింది. దాంతో రెండోసారి సునాయాసంగా అయన అధికారం దక్కించుకున్నారు.



ఏపీలో వైఎస్ మంత్రం పలించేనా

ఇదే వ్యూహాన్ని గులాబీ చీఫ్ కెసిఆర్ పక్కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేశారు. విభజన తరువాత 2014 లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా జనం పోరాటం చేసిన పార్టీకే పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో ఆంధ్ర బాబు పాలనకు తెలంగాణ అప్పగిద్దామా అంటూ సెంటిమెంట్ తిరిగి రాజేసి విజయ తీరానికి పార్టీని చేర్చారు. మరోసారి సక్సెస్ అయిన ఈ వ్యూహమే చంద్రబాబు అందిపుచ్చుకున్నారు.చంద్రబాబు ఎన్నికల ముందు నుంచి సెంటిమెంట్ నే రెచ్చగొడుతూ వచ్చారు. కెసిఆర్, జగన్ లు కలిసిపోయారని ఆంధ్రుల ఆత్మగౌరవం గులాబీ పార్టీకి వైసిపి అధినేత తాకట్టు పెడుతున్నారంటూ ఒక వేవ్ క్రియేట్ చేశారు. దాంతో ఎన్నికల ముందు వరకు వున్న ప్రత్యేక హోదా అంశం మరుగున పడింది. విభజన హామీలు అటకెక్కేలా ఆ ఆలోచనే ఓటర్లకు లేకుండా పసుపు కుంకుమ, వృద్ధాప్య పెన్షన్లు వంటి వాటితో టిడిపి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల శాతాన్ని గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నం విజయవంతం గా చేసింది.ఎప్పటి మంత్రం అప్పుడే చెప్పాలి. ఒక చోట పనికొచ్చింది అని మరోచోట అదే మంత్రం పఠిస్తే ఏమేరకు ఫలితం ఉంటుందన్నది అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. కెసిఆర్ చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ చంద్రబాబు తెలంగాణాలో సాగించిన ప్రచారం టిడిపి కి మైనస్ గులాబీ పార్టీకి ప్లస్ గా మారాయంటున్నారు. అదే టిడిపి ఆంధ్ర లో గులాబీ పార్టీపై చేసిన నెగిటివ్ ప్రచారం లో ముందుగానే కేసీఆర్ మేల్కొని ఆంధ్రాలో అడుగు పెట్టకుండా జాగ్రత్త పడటంతో వైసిపి పై తెలుగుదేశం అనవసర ప్రచారం చేస్తున్నట్లు గా ఓటర్లు గుర్తించారు. ఈ ప్రచారం అవసరానికి మించి బాబు చేయడం వల్ల టిడిపి కి కలిసి వచ్చింది తక్కువ నష్టం ఎక్కువ తెచ్చిపెట్టిందనే వాదన పెరుగుతుంది. ఏది ఏమైనా వైఎస్ ఫార్ములా దశాబ్దం పాటు మాత్రం ఇంకా ప్రధాన రాజకీయ పక్షాలు అమల్లో పెట్టడం విశేషమే అంటున్నారు విశ్లేషకులు.

No comments:

Post a Comment