Breaking News

08/05/2019

ఢిల్లీలో ఎవరు గెలిస్తే...వారిదే పీఠం...

న్యూఢిల్లీ,  మే 8, (way2newstv.in
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో  చివరి రెండు విడుతల పోలింగ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈనెల 12న ఆరో విడుతలో పోలింగ్ జరిగే ఢిల్లీ రాష్ట్రం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత 20 ఏండ్లలో ఢిల్లీవాసులు ఎవరికి మద్దతునిస్తే ఆ పార్టీయే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఢిల్లీ ఓటర్లు ఈ నెల 12న ఎటువైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికలు కేంద్రంలోని నరేంద్రమోదీకే కాకుండా రాష్ట్రంలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్‌కు కూడా రెఫరెండం వంటివని పరిశీలకులు భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ విశ్వజనీన నగరం. ఇక్కడ దేశంలోని అన్ని మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, భాషలకు చెందిన ప్రజలు కనిపిస్తారు. కానీ రాజకీయాల విషయంలో మాత్రం వీరందరిదీ ఒకేతీరు. అనూహ్యమైన ఫలితాలనిస్తూ పరిశీలకుల అంచనాలను తారుమారు చేస్తుంటారు. 1999 నుంచి ఢిల్లీ వాసులు ఏకపక్షంగా ఒకే పార్టీ వైపు మొగ్గుతున్నారు. రాష్ట్రంలో ఏడు లోక్‌సభ స్థానాలుండగా, 1999లో అన్నింటిలో వారు బీజేపీని గెలిపించారు. దీంతో కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత వరుసగా రెండుసార్లు రాజధాని పౌరులు కాంగ్రెస్‌కు అండగా నిలిచారు.


ఢిల్లీలో ఎవరు గెలిస్తే...వారిదే పీఠం...

2004లో ఆరు సీట్లను, 2009లో ఏడు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ రెండు సందర్భాలలో వరుసగా మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. 2014లో ఢిల్లీవాసులు మరోసారి ఏకపక్షంగా బీజేపీకి మద్దతునిచ్చారు. మొత్తం ఏడుసీట్లను కమలం పార్టీ గెలుచుకోవడంతో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఏడు నెలలకే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించారు. 70 సీట్లకుగానూ 67 సీట్ల ను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు కట్టబెట్టారు. బీజేపీ మూడు సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌కు ఢిల్లీ ఒకప్పుడు కంచుకోట. 1998, 2003, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందింది. షీలాదీక్షిత్ వరుసగా 15 ఏండ్లు ఢిల్లీకి సీఎంగా పనిచేశారు. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్.. కాంగ్రెస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేశాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీవాసులు ఎవరికి పట్టం కడుతారన్నది ఆసక్తిదాయకంగా మారింది. నాలుగేండ్ల పైచిలుకు తన పాలన కాలంలో ఆప్ సర్కార్‌స్థానిక సమస్యల పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసింది. ముఖ్యంగా విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనలో విజయం సాధించింది. కానీ అనధికార కాలనీల క్రమబద్ధీకరణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మాదిరిగానే విఫలమైంది. దేశంలో చట్టాలను తాము మాత్రమే అమలు చేయగలమని, న్యాయం కోసం పోరాడగలమని చెప్పుకున్నా.. ఆ రెండు విభాగాలు కేంద్రం చేతిలో ఉండటంతో చేష్టలుడిగి చతికిలబడింది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో స్థానికులకు 80 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఈ ఎన్నికల్లో ఆప్ వాగ్దానం చేసింది. దీనిపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ వాసులు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఆప్‌కు ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చని అంటున్నారు.కేంద్రంలో నరేంద్రమోదీ సాధించిన విజయాలనే బీజేపీ తన ప్రచారాస్ర్తాలుగా మలుచుకున్నది. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పనిచేయకుం డా అడుగడుగునా అడ్డుకున్నదన్న విమర్శను బీజేపీ ఎదుర్కొంటున్నది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదరకపోవడంతో తిరిగి తామే అన్ని సీట్లను గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కీలకమనుకున్న స్థానాల్లో క్రీడాకారులను బరిలోకి దింపింది. దక్షిణ ఢిల్లీ నుంచి బాక్సర్ విజేందర్ సింగ్, తూర్పు ఢిల్లీ నుంచి క్రికెటర్ గౌతం గంభీర్ పోటీ చేస్తున్నారు. చాందినీచౌక్ నుంచి కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఈశాన్య ఢిల్లీఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు.  లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఊసులో లేకుండా పోయిన కాంగ్రెస్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఉనికిని చాటింది. మాజీ సీఎంకు షీలాదీక్షిత్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడమే కాకుండా, ఆమెను ఒక స్థానం నుంచి పోటీకి దించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగాయి. అయితే ఆప్‌తో పొత్తు విషయంలో నాయకుల మధ్య విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగింది. 

No comments:

Post a Comment