Breaking News

02/05/2019

వనంలో దాహం.. దాహం (కర్నూలు)

కర్నూలు, మే 2 (way2newstv.in):  
ఎన్నో విశిష్టతలకు నెలవైన నల్లమల అడవుల్లో ప్రస్తుతం వన్యప్రాణులు ప్రమాదం అంచున కాలం వెళ్లదీస్తున్నాయి. ఒకవైపు వేటగాళ్ల ఉచ్చుకు కొన్ని బలవుతుంటే, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో దాహం తీరే మార్గం లేక గొంతెండి ప్రాణాలు వదులుతున్నాయి. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు పరిష్కరించే వాటిల్లోనే అధికారులు కాసులు నొక్కేస్తున్నారు. ఇక మాటరాని అడవి జంతువులకు కోసం వచ్చిన నిధుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్ఛు జంతువుల దాహార్తి తీర్చడానికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.వేలు విడుదల చేస్తోంది. కానీ ఆ నిధులు పక్కదారి పడుతున్నాయని వాటి కోసం ఏర్పాటు చేసిన సాసర్‌పిట్‌లను చూస్తే తెలిసిపోతుంది. వాటికి నీరందించి ఉంటే గ్రామాల్లోకి, పొలాల్లోకి వచ్చి వన్యప్రాణులు ప్రాణాలు ఎందుకు కోల్పోతాయి. అధికారుల నిర్లక్ష్యంతో జాతీయ జంతువైన పెద్ద పులులు కూడా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నాయి. వీటికి కారణాలు ఏమైనా మూగ జీవాలకు మాత్రం విలువ లేకుండా పోయింది.


వనంలో దాహం.. దాహం (కర్నూలు)

నంద్యాల అటవీ డివిజన్‌ పరిధిలో ఐదు రేంజ్‌లున్నాయి. మొత్తం డివిజన్‌ విస్తీర్ణం 350.23 చదరపు కి.మీ. ఉంటుంది. 5 రేంజ్‌ల్లో జంతువుల కోసం గతంలో 68 గుంతలను (సాసర్‌పిట్స్‌), నూతనంగా మరో 60 గుంతలను ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు రేంజ్‌లల్లో 128 గుంతలు ఉన్నాయి. కానీ రుద్రవరం రేంజ్‌లో పరిశీలిస్తే పాత గుంతతోపాటు నూతనంగా ఏర్పాటు చేసిన గుంతలో కూడా కనీసం నీరు కాదు కదా, నీటి తడి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల వల్లనే జంతువులు దాహంతో పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నాయి.వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి ప్రత్యేకంగా నీటి గుంతలు ఏర్పాటు చేశారు. ఆ గుంతల్లో నీటిని నింపేందుకు నెలకు ఒక్కో రేంజ్‌కు రూ.25 వేలను కూడా ప్రభుత్వం అందజేస్తోంది. ఈ లెక్కన నంద్యాల డివిజన్‌ పరిధిలోని ఐదు రేంజ్‌లకు కలిపి నెలకు రూ.1.25 లక్షలు వస్తున్నాయి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆ నీటి గుంతలను పరిశీలించి నీరు ఉందా లేదా అని తనిఖీ చేసి నీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే ఎక్కడా గుంతల్లో నీరు లేక ఎండిపోయి కనిపిస్తున్నాయి. దీంతో జంతువులు రోడ్లపైకి వస్తున్నాయని అడవి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment