Breaking News

04/05/2019

అడుగులు పడని అందరికీ ఇళ్ల పథకం

ఏలూరు, మే 4, (way2newstv.in)
అందరికీ ఇళ్లు’ ఇది ప్రభుత్వ నినాదం అయితే కొందరికి కూడా దక్కని పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఇటుక వేయడానికి నెలలు, కాగితాల మీద ఆర్డర్లు కార్యరూపం దాల్చడానికి మరికొన్ని నెలలు గడిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు గడుస్తున్నా జిల్లాలో ఒక్క గృహప్రవేశం కూడా జరగలేదు. 2018 జనవరిలో గృహప్రవేశాలు చేయిస్తామన్న నేతలు అంకెను మార్చి 2019 జనవరిలో చేయించడానికి కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. సామాజిక సర్వే పేరుతో ఉన్న వివరాలను సరిపోల్చుకుని జాబితాలోని కొన్ని పేర్లు ఎత్తేశారు. పాన్‌ కార్డు వివరాల ఆధారంగా కొన్ని పేర్లు తీసేశారు. ఐటీ అసెస్సీ జాబితా పేరుతో మరికొందరికి నామం పెట్టారు. భార్య పేరిట లేదంటే కుటుంబ సభ్యుల పేరిట ఇళ్లు ఉన్నాయనే సాకుతో మరి కొందరిని బ్లాక్‌ లిస్టులో పెట్టేశారు. ఆధార్‌ మిస్‌ మ్యాచింగ్‌ పేరుతో ఒక్కో పట్టణంలో 500 మంది వంతున పక్కకు లాగేశారు. 


అడుగులు పడని అందరికీ ఇళ్ల పథకం

గతంలో హౌసింగ్‌ స్కీమ్‌లను ఉపయోగించుకున్నారనే సాకుతో ఒక్క తాడేపల్లిగూడెంలోనే 680 మందిని అనర్హులుగా తేల్చారు. ఇళ్ల కోసం తొలి విడత సొమ్ము నిమిత్తం చెల్లించిన డీడీలు కాలం చెల్లిపోతున్నాయి. వీటిని రెన్యువల్‌ చేయించుకోవాలంటే ఎంతోకొంత చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి.జిల్లాలో అందరికీ ఇళ్లు పథకం కాకుండా అర్బన్‌ లోకల్‌ బాడీలకు ఇళ్ల కేటాయింపులు (యూఎల్‌బీ) చేశారు.  ఏలూరులో ఇంతవరకు ఈ ప్రక్రియకు అంకురార్పణ జరగలేదు. తాడేపల్లిగూడెంలో 5,376 ఇళ్ల కోసం 4,500 డీడీలను అర్హులుగా చెప్పిన వారు సమర్పించారు. పలు వడపోతల అనంతరం ఇక్కడ డీడీలు చెల్లించిన వారిలో 2,927 మందిని మాత్రమే అర్హులుగా  తేల్చారు. వీరికి సరిపడా ఎల్‌.అగ్రహారం వద్ద ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. కేవలం 600 ఫ్లాట్లు మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి.భీమవరంలో 9,500 ఇళ్లకు గాను 8,352 మంది డీడీలు చెల్లించారు. వీరిలో 5,900 మందిని అర్హులుగా గుర్తించారు.పాలకొల్లులో 7,159 ఇళ్లకు గాను 6,784 మంది డీడీలు సమర్పించారు. వీరిలో 4,400 మందిని అర్హులుగా గుర్తించారు.జంగారెడ్డిగూడెంకు 2,883, కొవ్వూరుకు 2,450, నరసాపురానికి 2,467, నిడదవోలుకు 2,571, తణుకులో 3,539 ఇళ్లను జిల్లా మొత్తంగా 13,910 ఇళ్లు కేటాయించారు. వీటి నిర్మాణాలు ఇదే రీతిలో ఉన్నాయిజిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు పట్టణాలకు 34,211 ఇళ్లను అందరికీ ఇళ్లు పథకంలో కేటాయించారు. ఏలూరుకు 12,176, పాలకొల్లుకు 7,159, తాడేపల్లిగూడెంకు 5,376, భీమవరంకు 9,500 ఇళ్లకు అనుమతులు ఇచ్చారు.

No comments:

Post a Comment