Breaking News

24/05/2019

ఏపీ పాలిటిక్స్ లో స్టార్

విజయవాడ, మే 24, (way2newstv.in)

ఎవరూ ఊహించలేదు. బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతటి ఘన విజయాన్ని ఊహించి ఉండరు. గెలిస్తే వందనుంచి నూట పది స్థానాలవరకూ రావచ్చని వైసీపీ అగ్రనేతలే నిన్నటి వరకూ అంచనాలు వేశారు. ప్రశాంత్ కిషోర్ టీం కూడా 120 స్థానాల వరకూ వచ్చే అవకాశముందని తేల్చింది. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే వైసీపీనేతలకే కళ్లు తిరిగినంత పనయింది. దాదాపు 150 స్థానాల్లో గెలవడమంటే మాటలు కాదు. అంతేకాకుండా మూడు దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయిలో పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో పెకలించడం సామాన్య విషయం కాదు.అయితే ఇది జగన్ కు సాధ్యమయింది. దాదాపు తొమ్మిదేళ్లుగా పడిన జగన్ కష్టానికి ఫలితం దక్కింది. జగన్ తొమ్మిదేళ్ల నుంచి పార్టీని నడపడమంటే మాటలు కాదు. ఖర్చుతో కూడుకున్న విషయం. ఒకవైపు అక్రమ కేసులు.. మరొక వైపు ఐటీ దాడులు జరిగినా జగన్ ఏమాత్రం చలించలేదు. నిబ్బరం కోల్పోలేదు. ఆత్మస్థయిర్యాన్ని వీడలేదు. 


ఏపీ పాలిటిక్స్ లో స్టార్
దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. అప్పటి నుంచి మానసికంగా మరింత బలోపేతం అయ్యారంటారు.23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాదు సీనియర్ నేతలు కూడాపార్టీని విడిచి వెళ్లారు. అయినా జగన్ ఉన్న వారితోనే పార్టీని నడిపారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతానని మూడేళ్ల ముందే చెప్పారు. ప్రతి జిల్లాను గత ఐదేళ్లలో ఆరేడుసార్లు వివిధ సందర్భాల్లో పర్యటించారు. ఇక పాదయాత్ర గురించి చెప్పాల్సిన పనిలేదు. జగన్ కు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యేనని చెప్పాలి. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ముందు జగన్ వ్యూహాలు ఏం పనిచేస్తాయని సీనియర్ నేతలు సయితం అభిప్రాయపడిన రోజులున్నాయి జగన్ ఎవరు విడిచిపెట్టి వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. వారిని పిలిచి మాట్లాడేందుకు కూడా ఆయన ప్రయత్నించలేదు. తన గోల్ ఒక్కటే. ప్రజల్లోనే ఉండి పోయిన చోటే వెతుక్కోవాలన్నది. అందుకే ఐదేళ్లుగా ఆయన జనంలోనే ఉన్నారు. జనం సమస్యలపై నిరంతరం స్పందిస్తూనే ఉన్నారు. అధికార పార్టీ తనను క్రిమినల్ గా అభివర్ణించినా, అవినీతి పరుడిగా చిత్రీకరించినా పెద్దగా పట్టించుకోలేదు. చివరకు తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా చంద్రబాబు రాజకీయం చేసినా లైట్ గా తీసుకున్నారు. ఇలా జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇన్ని తక్కువ స్థానాలకు పరిమితమవ్వడం ఇదే ప్రధమం. ఇలా జగన్ ఏపీ పాలిటిక్స్ లో రాక్ స్టార్ గా నిలిచారు. ఏపీకి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

No comments:

Post a Comment