Breaking News

03/04/2019

అసమ్మతి నేతల ఐక్యతారాగం

తిరుపతి, ఏప్రిల్ 3 (way2newstv.in)
నగరి నియోజకవర్గంలో అలకలు వీడిన అసమ్మతి నేతలు ఐక్యతా రాగం ఆలపిస్తూ ప్రచారంలోకి దిగడంతో తెలుగుదేశం పార్టీ తిన్నగా బలపడుతోంది. టికెట్ల ఖరారు ఆలస్యం కావడంతో ప్రచారం కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే పరిచయం అక్కర లేని దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌కు గ్రామాల్లో ఆదరణ క్రమంగా పెరుగుతోంది. తొలుత టికెట్‌ కోసం ప్రధానంగా విద్యాసంస్థల నేత అశోకరాజు, బీసీ నేత పాకారాజలు తీవ్రంగా ప్రయత్నం చేశారు. వీరికి మద్దతుగా సీనియర్‌ నాయకులు గంధమనేని రమేష్‌ చంద్రప్రసాద్‌, ఏఎం రాధాకృష్ణ, పోతుగుంట విజయబాబు, కొరపాటి నరేంద్రలు నిలిచారు. చివరికి గాలి భానుప్రకాష్‌ను టికెట్‌ వరించింది. ఈ ఎంపిక అనేక వడపోతల వల్ల ఎంపిక ఆలస్యం అయింది. ప్రస్తుతం వీరిలో ఓ ఇద్దరు మినహా మిగిలిన నేతలు బహిరంగ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.అశోకరాజు విజయపురం, నగరి, వడమాలపేటలలో ప్రచారాన్ని నిర్వహించారు. పాకారాజ కూడా తన వంతుగా నగరిలోని తన మొదలియార్‌ వర్గాన్ని టీడీపీకి అనుకూలంగా సమాయత్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. 


అసమ్మతి నేతల ఐక్యతారాగం

ఇక టికెట్‌ కోసం తటస్తురాలుగా ప్రయత్నించిన డా. సుభాషిణి కూడా తన క్షత్రియ బంధువర్గంతో అంతర్గత సమావేశాలు నిర్వహించి టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా పని చేయాలని కోరుతున్నారు. రేపటి నుంచి ప్రచారం రంగంలోకి దిగుతున్నారు. గాలి భానుప్రకాష్‌ మాత్రం ఐదు మండలాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరో పక్క అసమ్మతి నేతలతో చర్చలు జరిపి ప్రచారంలోకి దింపుతున్నారు. ఆయన భార్య శిరీష, పెదనాన్న గాలి ధనంజయలునాయుడు కూడా ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు.మండలాలలో పుత్తూరు ఎంపీపీ గంజిమాధవయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ యుగంధర్‌, జయప్రకాష్‌, రవీంద్ర, డి.ఎస్.గణేష్‌, వడమాలపేట తుడా డైరెక్టర్‌ ధనంజయలునాయుడు, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అబ్బరాజు, దాముయాదవ్‌, నగరి పార్టీ అధ్యక్షుడు బి.డి.భాస్కర్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు సురేష్‌, బాలాజీలు, విజయపురం పార్టీ అధ్యక్షుడు దశరథరాజు, బాలసుబ్రహ్మణ్యంరాజు, ధనంజయలునాయుడు, నిండ్ర పార్టీ అధ్యక్షుడు దశరథవాసు, రవినాయుడు, ధనంజయలునాయుడు, తన వంతుగా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇలా వరుసగా అసమ్మతి నేతలు అలకలు మాని ప్రచారంలో పాల్గొనడంతో పాటు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు అన్నీతానై నడిపించిన మాజీమంత్రి రెడ్డివారి చెంగారెడ్డి, టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్‌కు మద్దతుగా ప్రచారానికి దిగడం శుభపరిణామం. ఏప్రిల్‌ 2వ తేదీ చంద్రబాబు పుత్తూరు పర్యటనలో చెంగారెడ్డి కూడా వేదిక పంచుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే టీడీపీకి మరింత ఊపు వస్తుంది. మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే లేట్‌గా ప్రచారం ప్రారంభించినా లేటెస్ట్‌గా భానుప్రకాష్‌ దూసుకుపోతున్నారు.

No comments:

Post a Comment