Breaking News

22/04/2019

దివాళా తీస్తున్న ఏపీ ఖజానా

గుంటూరు, ఏప్రిల్ 22, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరి మూడు నెలలు చేసిన హామీలతో ఇప్పుడు రాష్ట్ర ఖజానా డొల్ల బోయింది. బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. ఖజానా దాదాపు ఖాళీ అయింది. వచ్చే కొత్త ప్రభుత్వం ఎవరిదైనా అప్పుల కోసం పరుగులు తీయక తప్పని పరిస్థితి. చివర్లో ప్రకటించిన సంక్షేమ పథకాలే కొంప ముంచాయంటున్నారు ఆర్థిక శాఖ అధికారులు. అప్పులు తెచ్చుకునేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలు అడ్డుపడుతుండటంతో ఏమి చేయలేని స్థితిలో అధికారులున్నారు.మే నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడానికి కనీసం వార రోజులు సమయం తీసుకుంటుంది. ప్రభుత్వం కుదరుకోవడానికి మరో నెల సమయం పడుతుంది. అప్పటి వరకూ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ఎలా నెట్టుకురావాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.


దివాళా తీస్తున్న ఏపీ ఖజానా

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సయితం ఆర్థిక శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ ను ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 94 లక్షల మంది లబ్దదారులు ఈ పథకానికి ఎంపికయ్యారు. వీరికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ నాలుగోవిడత ఎన్నికలకు ముందు చెల్లించారు. దీనికింద 3,300 కోట్ల రూపాయలు ఆవిరయి పోయాయి. మరో పథకం అన్నదాతా సుఖీభవ పథకం. రైతులకు పెట్టుబడి ముందే ఇచ్చే పథకం కింద ఒక్కొక్క రైతుకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించారు.ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ భృతి, పింఛను పెంపుతో రాష్ట్ర ఖజానాపై మరింత ఆర్థికభారం పడింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను 2.26 లక్షల కోట్లగా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగునెలల వ్యయం 77 వేల కోట్లు ఉంటుందని అంచనావేశారు. కానీ అంచనాకు మించి ఖర్చవ్వడంతో ఆర్థికశాఖ అధికారులు చేతులెత్తేశారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 2,358 కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వీరి బిల్లులను పరిశీలిస్తామంటున్నారు అధికారులు. మొత్తం మీద చంద్రబాబు చివర్లో ప్రకటించిన తాయిలాలు రాష్ట్ర ఖాజానాను భారీగా దెబ్బతీశాయని చెబుతున్నారు ఉన్నతాధికారులు. ఇప్పటికే రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ లోకి వెళ్లింది. జీతాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు.

No comments:

Post a Comment