Breaking News

22/04/2019

బాబు ఇంటగెలిస్తేనే.....

విజయవాడ, ఏప్రిల్ 22, (way2newstv.in)
చంద్రబాబు నాయుడు జగమెరిగిన రాజకీయవేత్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న నేత. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్, తొలి ఎన్డీఏ ల హయాంలో చక్రం తిప్పిన సారథి. నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోగల దిట్ట. దేశంలోనే తొలి టెక్నో సీఎం. నాలుగు దశాబ్దాల పైచిలుకు రాజకీయ జీవితంలో ఎన్నో ఎగుడుదిగుళ్లు చవిచూశారు. ఎత్తుపల్లాలను అధిగమించారు. మూడు తరాల నాయకులతో కలిసి నడిచారు. అపరచాణుక్యునిగా ఎంతగా ప్రశంసలు అందుకున్నారో ..అవకాశవాద రాజకీయవేత్తగా అంతగానూ అభియోగాలు ఎదుర్కొన్నారు. తొలి పాలనకాలంలో సంస్కరణవాదిగా బ్రాండు కోసం పరుగులు పెడితే.. తాజా పాలనలో సంక్షేమ సారథిగా ముద్ర వేయించుకోవాలని తాపత్రయపడ్డారు.. ప్రశంసలు, విమర్శల సంగతి పక్కనపెడితే చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకులు అధ్యయనం చేయాల్సిన ఒక అధ్యాయం. చర్చించాల్సిన ఒక పాఠం..ఆధునిక రాజకీయ చరిత్రలో ఆయనదో పేజీ. ఒకవైపు ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ పుట్టిన రోజు చంద్రబాబు జీవితంలోనే అరుదైనది.. 


బాబు ఇంటగెలిస్తేనే.....

ఈసారి గెలుపు సాధిస్తే.. జాతీయ రాజకీయాల్లో ముఖ్యపాత్రధారిగా మారతారు.. పరాజయమే పలకరిస్తే మళ్లీ అగ్ని పరీక్షే..చంద్రబాబు నాయుడు అంతా సాఫీగా సాగిపోతున్న సమయాల్లో కంటే సంక్షోభాల్లో చక్కగా పనిచేస్తారనే పేరుంది. ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది కూడా రాజకీయ సంక్షోభాలే. కాంగ్రెసు నేతగా ఉన్న సమయంలో సొంత మామ ఎన్టీయార్ తో విభేదించారు. వ్యవస్థాపన తొలినాళ్లలో టీడీపీకి దూరంగానే ఉండిపోయారు. ఎన్టీయార్ ను రామ్ లాల్ గద్దె దించిన తర్వాత చంద్రబాబు మామకు అండగా నిలిచారు. ఉద్యమాలు నిర్మించడంలో జాతీయంగా చక్రం తిప్పడంలో సారధిగా వ్యవహరించారు. అప్పుడే ఎన్టీయార్ కు చేరువ అయ్యారు. పార్టీలో గుర్తింపు తెచ్చుకోగలిగారు. పట్టు సాధించగలిగారు. 1996లో జాతీయ పార్టీలకు దేనికీ స్పష్టమైన మెజార్టీ లేని స్థితిలో కేంద్రంలో అనిశ్చితి ఏర్పడింది. అది జాతీయంగా రాజకీయ సంక్షోభ సమయమే. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో చంద్రబాబు పాత్ర చాలా కీలకం. కన్వీనర్ గా అప్పుడే జాతీయ నేతగా ఎదిగారు. రాష్ట్ర విభజనతో 2014లో ఆంధ్రప్రదేశ్ ఒక సంక్షుభిత పరిస్థితిలో పడింది. తొలి ముఖ్యమంత్రిగా తన అనుభవంతో విశ్వాసాన్ని నింపగలిగారు. నిజానికి 1996నుంచి 2004 వరకూ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలన ఏకచ్ఛత్రాధిపత్యంగా సాగింది. ఎదురులేని నాయకత్వం. అయినా ప్రజల్లో గట్టి పట్టు తెచ్చుకోలేకపోయారు. ఫలితంగా 2004 నుంచి 2014 వరకూ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. మళ్లీ నవ్యాంధ్ర ఏర్పాటైన తర్వాతనే ఆయనకు అవకాశం లభించింది. సమస్యలను పరిష్కరిస్తూ పనిచేస్తారనే గుర్తింపు కారణంగానే ఎటువంటి కరిష్మా లేకపోయినప్పటికీ చంద్రబాబు బలమైన నాయకునిగా నిలవగలుగుతున్నారు.అపర చాణుక్యుడు అని చంద్రబాబును చాలామంది పొగుడుతుంటారు. అంతకు రెట్టింపు మంది అవకాశవాది అని నిందిస్తుంటారు. పాలిటిక్స్ లో మిత్రులు, శత్రువులు ఉండరు. ఎప్పుడు ఎవరితో కలవాల్సి వస్తుందో తెలియదన్న సామెతను తూ.చ.తప్పకుండా ఆచరించి చూపిస్తారు చంద్రబాబు. అందుకే అవసరానికి వాడుకుని వదిలేస్తారనే విమర్శనూ మూటగట్టుకున్నారు. బీజేపీ ఎదుగుదల దశలో 1998లో ఆ పార్టీతో చేతులు కలిపారు. రాజకీయ గాలిని తనకు అనుకూలంగా మలచుకోగలిగారు. 2004లో బీజేపీ పొత్తు కలిసిరాలేదు. దాంతో 2009 వామపక్షాలు, టీఆర్ఎస్ తో జతకూడారు. మళ్లీ 2014లో బీజేపీ గాలి కలిసొస్తుందని పసి గట్టారు. మళ్లీ కమలంతో కరచాలనం చేశారు. 2019 కి పెద్దగా అవసరం లేదని భావించారు. దూరం పెట్టేశారు. ఇలా ఎత్తుగడల్లో రాజకీయ అవకాశాలనే చంద్రబాబు తన ఛాయిస్ గా తీసుకుంటారు. యూ టర్న్ ..అపార్చునిస్టు వంటి పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ రాజకీయవాతావరణాన్ని అనుసరించి సేద్యం చేయడమే పొలిటీషియన్ నైపుణ్యం. ఈ సంగతిని చక్కగా వంటబట్టించుకున్న నేత చంద్రబాబు. దీనిని సమకాలీన రాజకీయాల్లో ఎవరూ తప్పు పట్టలేరు. నాయకునిగా రాణించడంలో పార్టీని విజయపథంలోకి తీసుకెళ్లడంలో ఈ ఎత్తుగడలు, వ్యూహాలూ కూడా అవసరమే. ఎన్ని ఎగుడుదిగుళ్లు ఎదురైనా తట్టుకుని నిలవగలుగుతున్నారంటే ఈ రాజకీయ చాతుర్యమే సమర్థ కారణంగా చెప్పుకోవాలి.నిజమే చంద్రబాబు నాయుడు కూడలిలో ఉన్నారు. డెబ్బై ఏళ్ల వయసులో అలుపెరుగని రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలో టీడీపీకి ప్రతికూల ఫలితమొస్తే.. రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. దాంతో తెలుగుదేశం పని అయిపోయినట్లే అని ప్రత్యర్థులు పెదవి విరుస్తున్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వ వారసుల సామర్థ్యంపై పార్టీలోనే అనుమానాలున్నాయి. అటువైపు చూస్తే జగన్ బలమైన నేతగా ముద్ర పడ్డారు. సామాజిక సమీకరణ, ఆకర్షణ కారణంగా పవన్ కల్యాణ్ కూడా భవిష్యత్తులో పుంజుకోవడానికి అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఇబ్బందులు ఎదుర్కొంటుందనే వారున్నారు. అయితే చంద్రబాబు నాయుడి మనస్తత్వం తెలిసినవారు, అతనిలోని రాజకీయ వేత్తను దగ్గర్నుంచి చూసిన వారి అభిప్రాయం మరో విధంగా ఉంది. ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పుడే ఆయనలోని ఫైటర్ నిద్రలేస్తాడు. అందువల్ల జయాపజయాలతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ లోనూ, జాతీయంగానూ భవిష్యత్తులోనూ ఆయన కీలక భూమిక ను పోషిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment