Breaking News

09/04/2019

పల్లెకు అడ్డొస్తున్నఅసమ్మతి

అనంతపురం, ఏప్రిల్ 9, (way2newstv.in)
సీమ నాలుగు జిల్లాల్లో అనంతపురంలో మాత్రం గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేదు ఫలితాలు ఎదురయ్యారు. కడప, కర్నూలు, చిత్తూరు జల్లాల్లో తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించినా అనంతపురం జిల్లాలో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ హవాతో వైసీపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. దీంతో ఈ ఎన్నికల్లో అయినా అనంతపురం జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో వైసీపీకి ఆశలు చిగురిస్తున్న స్థానంగా పుట్టపర్తి కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పల్లె రఘునాథరెడ్డి విజయం సాధించారు. ఈ క్యాబినెట్ లో ఆయన కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. నాలుగుసార్లు పోటీ చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లె ఐదోసారి పోటీకి దిగారు. ఈసారి కూడా తన విజయం ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు.గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సోమశేఖరరెడ్డిపై పల్లె రఘునాథరెడ్డి 7 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 


పల్లెకు అడ్డొస్తున్నఅసమ్మతి

ఈ ఐదేళ్ల కాలంలో మంత్రిగా కొంతకాలం పనిచేసిన పల్లె నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారనే పేరుంది. ప్రజలకు కూడా అందుబాటులోనే ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తనకు కలిసివస్తాయని ఆయన నమ్మకంగా ఉన్నారు. అయితే, పార్టీలోనే అసంతృప్తులు ఆయనకు ప్రతికూలంగా మారాయి. పల్లెకు ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ ఇవ్వవద్దని కొంతమంది అసమ్మతి నేతలు చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా కూడా చేశారు. అయినా మళ్లీ పల్లెకే టిక్కెట్ దక్కింది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆయన బాగానే ప్రయత్నిస్తున్నా పూర్తిస్థాయిలో ఫలించడం లేదు. ప్రధానంగా ఓ సామాజకవర్గం వారు ఈసారి పల్లెకు దూరమవుతున్నారనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఆయనకు నష్టం కలిగే అవకాశం ఉంది.ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గత ఎన్నికల కంటే బలోపేతమైంది. సోమశేఖరరెడ్డిని కాకుండా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి ఈసారి జగన్ టిక్కెట్ కేటాయించారు. టిక్కెట్ పై ఆయనకు ముందే హామీ ఉండటంతో చాలా నెలలుగా ఆయన నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. ప్రజల్లో ఉంటున్నారు. ఆర్థికంగానూ ఆయన బలంగా ఉన్నారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే డా.కడపల మోహన్ రెడ్డి చేరడం, పార్టీ విజయానికి ఆయన చురుగ్గా పనిచేస్తుండటంతో ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన సోమశేఖరరెడ్డి కూడా శ్రీధర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తున్నారు. అసమ్మతులు, అసంతృప్తులు లేకపోవడం శ్రీధర్ రెడ్డికి ప్లస్ కానుంది. అయితే, వ్యాపారవేత్త అయిన శ్రీధర్ రెడ్డి బెంగుళూరులో ఎక్కువ ఉంటారని, నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనే ప్రచారం జరుగుతుంది. ఇది ఆయనకు మైనస్ గా మారవచ్చు అంటున్నారు. మొత్తానికి గత పదేళ్లుగా ఆమ్మెల్యేగా ఉన్న పల్లె రఘునాథరెడ్డికి ఈసారి శ్రీధర్ రెడ్డి రూపంలో గట్టి సవాల్ ఎదురవుతోంది. ఇద్దరిలో ఎవరూ గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలిచే అవకాశం ఉంది

No comments:

Post a Comment