Breaking News

09/04/2019

రాజమండ్రిలో మోగా ఫ్యాన్స్ అభిమానులు రింగ్ మాస్టర్లు

రాజమండ్రి, ఏప్రిల్ 9, (way2newstv.in)
గోదావరి జిల్లాల్లోని రాజమండ్రి కి రాష్ట్రం లో ఒక ప్రత్యేకత వుంది. ఇక్కడ ఎమ్యెల్యే, ఎంపి గా గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుంది. గతం నుంచి ఈ సంప్రదాయ రికార్డ్ చెక్కు చెదరలేదు. తాజాగా కూడా అన్ని ప్రధాన పక్షాలు రాజమండ్రి విజయం కోసం పెట్టిన ఫోకస్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మూడు ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థుల సెలక్షన్ నుంచి అన్నింటా అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని గెలుపు గుర్రాలనే ఎంపిక చేశాయి.రెండు సార్లు రాజమండ్రి నుంచి ఎమ్యెల్యే గా గెలుపొందిన రౌతు సూర్య ప్రకాశ రావు వైసిపి తరుపున బరిలోకి దిగేనాటికి బలహీనంగానే వున్నారు. తన రాజకీయ అనుభవంతో ఆయన తనకు దూరంగా వెళ్లిన మిత్రులందరిని దగ్గరకు చేర్చుకున్నారు. రౌతు కి దూరంగా వున్న వారంతా ఇప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా అభ్యర్థి విజయాన్ని ప్రతిష్టగా తీసుకున్నారు. ఏపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం, రాజమండ్రి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించే సిసిసి ఛానెల్ ఎండి పంతం కొండలరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రసాదుల హరనాధ్, మాజీ ఛాంబర్ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, పొలాసనపల్లి హనుమంత రావు వంటి రాజకీయ హేమా హేమీలంతా రౌతు విజయం కోసం వ్యూహాత్మకంగా పనిచేయడం వైసిపి ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తుంది.


రాజమండ్రిలో మోగా ఫ్యాన్స్ అభిమానులు రింగ్ మాస్టర్లు

మాజీ ఎమ్యెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం నుంచి ఆయన కోడలు ఆదిరెడ్డి భవాని టిడిపి నుంచి టికెట్ దక్కించుకుంది. దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె కావడం ఆమెకు ప్లస్ పాయింట్ గా మారింది. ఒక పక్క ఆత్త మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, మామ ఆదిరెడ్డి అప్పారావు ఉదృతం గా ప్రచారం సాగిస్తూ దూసుకుపోతున్నారు. రాజమండ్రి వ్యాప్తంగా వున్న బంధుత్వాలు ఆదిరెడ్డి భవానికి కలిసి వచ్చే అంశాలు. అయితే ఆదిరెడ్డి కుటుంబం వడ్డీ వ్యాపారం, చిట్ ఫండ్ వ్యాపారాలు ఫలితంగా భవానికి కొన్ని చిక్కులు తప్పవన్న టాక్ నడుస్తుంది. భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ కి యువత లో వున్న ఫాలోయింగ్ వినాయకచవితి ఇతర పండుగలకు వాసు చేసే ఛారిటీ కార్యక్రమాలు తమను గట్టెక్కిస్తాయని ఆదిరెడ్డి కుటుంబం నమ్ముతుంది. రాజకీయాలకు భవానీ కొత్త కావడంతో కుటుంబ సభ్యులే అన్ని తామై వ్యవహరిస్తూ వుండటం చర్చనీయం అవుతుంది. టికెట్ ఆశించిన అభ్యర్థులు అరకొర అందిస్తున్న సహకారం ఏ మేరకు ఫలితంపై ప్రభావం చూపుతుంది అన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు.రాజమండ్రిలో అన్ని వర్గాల్లో సుపరిచితుడైన అనుశ్రీ సత్యనారాయణ జనసేన నుంచి టికెట్ దక్కించుకుని ప్రధాన రాజకీయ పక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పార్టీలకు అతీతంగా మిత్రులు వున్న సత్యనారాయణకు ఎగ్జిబిటర్ గా, సినిమా పంపిణీదారుడిగా వున్న పరిచయాలు ప్రస్తుత ఎన్నికల్లో కలిసి వస్తున్నాయి. వీటికి తోడు మెగా కుటుంబం అభిమానులు అంతా అనుశ్రీ వెంట నడుస్తున్నారు. అయితే కింది స్థాయి వరకు పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోవడంతో సత్యనారాయణ పవర్ స్టార్ కు వీచే గాలిపైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు. చాపకింద నీరులా తమ పార్టీ గెలుపు తీరాలకు చేరుతుందని జనసేన అంచనాలు వేసుకుంటుంది. గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓటమి పాలైనా గెలుపు గుమ్మం ముంగిట వరకు వచ్చిన విషయాన్నీ గుర్తించి ప్రచారంలో ఏ మాత్రం తగ్గకుండా సాగిపోతున్నారు సత్యనారాయణ.ముగ్గురు బలమైన అభ్యర్థులు రంగంలో నిలవడంతో ఇక్కడ ఫలితాన్ని ఎవ్వరు స్ఫష్టంగా అంచనా వేయలేకపోతున్నారు. ఎవరు గెలిచినా మెజారిటీ తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైసిపి అభ్యర్థి వ్యూహాత్మకంగా సాగుతుంటే, టిడిపి అభ్యర్థి తమ వీక్ పాయింట్లను సరిచేసుకుంటూ వార్ వన్ సైడ్ కాదని హెచ్చరిస్తూ సాగుతుంటే ఇక జనసేన అభ్యర్థి పవన్ ఇమేజ్ తనకు శ్రీరామ రక్షగా కత్తి దుస్తున్నారు. మరి చారిత్రక రాజమహేంద్రి ఎవరి సొంతం అవుతుందో చూడాలి.

No comments:

Post a Comment