Breaking News

10/04/2019

పోల్ మేనేజ్ మెంట్ పైనే దృష్టి

కాకినాడ, ఏప్రిల్ 10  (way2newstv.in)
దేశవ్యాప్తంగా ఆసక్తిరేకెత్తిస్తున్న తొలి విడత ఎన్నికల ప్రచారపర్వం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఎత్తులు పైఎత్తులు, వ్యూహ-ప్రతివ్యూహాలు, ఆసక్తికరమైన సంఘటనలతో సాగిన ప్రచారం ఈ సారి ఉద్రిక్తతలను సృష్టించింది. ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాల పర్వానికి తెర లేవనుంది. ఇప్పటికే ప్రలోభాల పర్వానికి తెరతీసిన ప్రధానపక్షాల అభ్యర్థులు.. దానిని పోలింగ్ తేదీ ఉదయం వరకు కొనసాగించనున్నారు. అన్నిరకాల ప్రలోభాలను ఉపయోగిస్తున్నారు. నామినేషన్లకు ముందే అభ్యర్థుల్ని బెదిరించటం, హైదరాబాద్ లోని ఉన్న వారి ఆస్తులపై కన్నేసిన తెలంగాణ నేతలు బెదిరింపులతో రాజకీయాన్ని ఉద్రిక్తం చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేస్తే ఆస్తులు మిగలవని హెచ్చరికలు కూడా జారీచేశారు. నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి తొలిజాబితాలో సీఎం చంద్రబాబు ప్రకటించినా ఆయన వైసీపీ ఒత్తిడికి తలొగ్గి అటువైపుకు వెళ్లిపోయారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీ, బీజేపీ నేతల వత్తిడికి తలొగ్గి ఆ పార్టీలో చేరిపోయారు. కొంతమంది నేతలు ఒత్తిళ్లను తట్టుకొని నిలబడగలిగారు. కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన వల్లభనేని వంశీమోహన్, కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి తెలంగాణ నేతల నుంచి ఒత్తిడి వస్తున్నా తట్టుకొని నిలబడ్డారు. 


పోల్ మేనేజ్ మెంట్ పైనే దృష్టి

సీఎం చంద్రబాబు ఈసారి ఎన్నికల ప్రచార సమయంలో రోజుకు 5 నుంచి 7 నియోజకవర్గాల్లో రోడ్ షోలు, ప్రచార సభలు నిర్వహించారు. 109 నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారసభలు నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, మాజీ ప్రధానమంత్రి దేవగౌడ ప్రచారం నిర్వహించారు. హీరో నందమూరి బాలకృష్ణ ఆయన నియోజకవర్గంతోపాటు ఆయన చిన్నల్లుడు పోటీచేస్తున్న విశాఖపట్నంలో కూడా ప్రచారం చేశారు. ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రల్లో తాను తిరగని నియోజకవర్గాల్లో దృష్టిసారిస్తానని చెప్పినప్పటికీ ఆయన పాదయాత్ర చేసిన నియోజకవర్గాల్లోనే ఎక్కువగా పర్యటించారు. చంద్రబాబును విమర్శించటానికే ఎక్కువ ప్రాధాన్యతను తన ప్రసంగాలలో ఇచ్చారు. తానొస్తే ఏం చేస్తాననే అనే అంశాన్ని సమర్థవంతంగా చెప్పలేకపోయారు. జగన్ తోపాటు ఆయన సోదరి షర్మల, ఆయన తల్లి విజయలక్ష్మి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చివరి నాలుగైదు రోజుల్లో తెలుగుదేశం ప్రచారం, సానుకూల పవనాలు ఎక్కువగా వీయడంతో వైసీపీ ప్రచారంలో వెనకబడిపోయింది. జనసేన, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ కూటమి తరపున మాయవతి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డిలు ప్రచారం చేశారు. బీజేపీ తరపున ఆ పార్టీ అధినేత అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ లు ఏపీలో పర్యటించారు. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా పర్యటనలకు ప్రజల స్పందన లేకపోవడంతో బీజేపీ నేతలు డీలాపడ్డారు. కేఏ పాల్ ప్రచారంలో రిలీఫ్ ఇచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టనున్నాయి. 

No comments:

Post a Comment