Breaking News

10/04/2019

శ్రీ వారి అన్న దాన పథకానికి 34 ఏళ్లు

తిరుమల, ఏప్రిల్ 10, (way2newstv.in
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నిత్యాన్నప్రసాదం ట్రస్టు దినదిన ప్రవర్ధమానమవుతూ 33 వసంతాలు పూర్తి చేసుకుంది. అప్పట్లో రోజుకు రెండు వేల మంది భక్తులతో అన్నప్రసాద వితరణను ప్రారంభించగా, ప్రస్తుతం తిరుమల, తిరుపతిలో కలిపి సరాసరి రోజుకు లక్షన్నర మంది భక్తులు అన్నప్రసాదాన్ని సంతృప్తికరంగా స్వీకరిస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు ఉన్న టీటీడీ లెక్కల ప్రకారం ఈ ట్రస్టుకు ఇప్పటికి 1000 కోట్ల డిపాజిట్లు వివిద బ్యాంకుల్లో ఉన్నాయి.తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు ఉచితంగా భోజనం అందించాలనే సత్స కల్పంతో టిటిడి 1985, ఏప్రిల్‌6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి  నందమూరి తారకరామారావు చేతుల మీదుగా ప్రారంభించింది. ఆ తరువాత 1994, ఏప్రిల్‌1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్న దానం ట్రస్టుగా ఏర్పాటైంది. ఇటీవల దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరిగేది. 2011, జులై 7 నుంచి తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. 


శ్రీ వారి అన్న దాన పథకానికి 34 ఏళ్లు

ఈ భవనాన్ని అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్‌ప్రారంభించారు.ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్లు, పిఎసి-2, కాలినడక మార్గంలోని గాలిగోపురం, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆస్పత్రి, స్విమ్స్‌, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్‌, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, 2వ సత్రం, 3వ సత్రం, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమల లోని రాంభగీచ బస్టాండు, సిఆర్‌వో, పిఏసి-1 వద్ద ఫుడ్‌కౌంటర్లు ఏర్పాటుచేసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1, 2లోని కంపార్ట్‌ మెంట్లలో వేచి ఉండే భక్తులకు ప్రతి మూడు గంటలకోసారి అన్నప్రసాదం అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1, 2లోని కంపార్ట్‌ మెంట్లు, దివ్యదర్శనం కాంప్లెక్స్‌, సర్వదర్శనం కాంప్లెక్స్‌, 300/- రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్‌ లలో ఇప్పటి వరకు అన్న ప్రసాదాలను అందిస్థున్నారు. తిరుమలలో న్యూఇయర్, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు, బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున 2 లక్షల మందికి పైగా భక్తులకు టిటిడి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది. తిరుమల లోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు చట్నితో కలిపి ఉప్మా, పొంగళి, వర్మిసెల్లి ఉప్మా అందిస్తారు. ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి 5 నుండి రాత్రి 10.30 గంటల వరకు చక్కెర పొంగలి, చట్ని, అన్నం, సాంబారు, రసం, మజ్జిగతో భక్తులకు వడ్డిస్తున్నారు. తిరుమలలో అన్న ప్రసాదాల తయారీకి రోజుకు 10 నుండి 12 టన్నుల బియ్యం, 6.5 నుండి 7.5 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు విరాళాలు సమర్పించి శ్రీవారిపై భక్తిభావాన్ని చాటు కుంటున్నారు. మార్చి నెలాఖరుకు వరకు ట్రస్టుకు సంబంధించి 937 కోట్లు వచ్చాయి. వీటిని టీటీడీ దేవస్థానం పలు జాతీయ బ్యాంకుల్లో ఫిక్స్‌ డ్‌డిపాజిట్ల రూపంలో భద్రపరిచారు. విరాళాల వివరాలు ఒకసారి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. 2013-14 నాటికి 507.05 కోట్లు, 2014-15 నాటికి 592.23 కోట్లు, 2015-16 నాటికి 693.91 కోట్లు, 2016-17 నాటికి 809.82 కోట్లు, 2017-18 మార్చి నెలాఖరు నాటికి విరాళాలు 937 కోట్లు భక్తులు విరాళాళుగా ఇచ్చారు. మరో నెలలోపే ఆ 1000 కోట్లు మార్క్ ను దాటే అవకాశం కనపడుతుందని అదికారులు భావిస్తున్నారు. వెయ్యికోట్లు అంటే అతం ఆషామాషీ కాదు... ఒక ట్రస్ట్ కు స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడం అంటే. అది అంతా స్వామి వారి దయ వల్లే సాధ్యమైందని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఏదిఏమైనా స్వామి వారికి చెందిన ఈ అన్నదాన కేంద్రం మరింత దినదినాభివృద్ది చెందడమే కాకుండా.... విరాళాల్లోనూ మరెన్ని రికార్డులు సృష్టించాలని  కోరుకుందాం.  

No comments:

Post a Comment