Breaking News

08/04/2019

బందరు పోర్టు నిర్మిస్తాం. 4800 ఎకరాలే సేకరిస్తాం

పోతెపల్లి ఇమిటేషన్ పార్కుకు నీళ్లిస్తాం ..
మచిలీపట్నం, ఏప్రిల్ 08 (way2newstv.in)  
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే తప్పనిసరిగా బందరు పోర్టు నిర్మిస్తామని, అందు కోసం 4800 ఎకరాల భూమి మాత్రమే సేకరిస్తామని, రైతులకూ తగిన న్యాయం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రోల్డ్గోల్డ్ నగల తయారీ కోసం మచిలీపట్నం సమీపంలో ఏర్పాటు చేసిన పోతెపల్లి ఇమిటేషన్ పార్కుకు నీరు సరఫరా చేస్తామని, అక్కడి యూనిట్లకు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి, యూనిట్ విద్యుత్ రూ.3.75కే అందిస్తామని ఆయన వెల్లడించారు.   ఏటా చేపలవేటపై నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల సహాయం చేస్తామని, గ్రామ వాలంటీర్ల ద్వారా ఆ సేవ డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు. పసుపు–కుంకుమ పథకం పేరుతో చంద్రబాబు మరోసారి పొదుపు సంఘాల మహిళలను మోసం చేస్తున్నారని, నిజానికి ఆ పథకం వల్ల వారికి ఒక్క రూపాయి లాభం లేదని, సున్నా వడ్డీ రుణాల రద్దుతో పొదుపు సంఘాల మహిళలు చాలా నష్టపోయారని చెప్పారు. మరోవైపు రైతులదీ అదే పరిస్థితి అని, నిరుద్యోగులకు కూడా చంద్రబాబు అన్యాయం చేశారని, ఇదీ చంద్రబాబనాయుడు 5 ఏళ్ల పరిపాలన అని జననేత అభివర్ణించారు.   కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం   వైయస్ జగన్  ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. 


బందరు పోర్టు నిర్మిస్తాం. 4800 ఎకరాలే సేకరిస్తాం


తన సుదీర్ఘ 3648 కిమీ పాదయాత్ర మచిలీపట్నం నుంచి కూడా సాగిందని, ఆరోజు ఇక్కడి వారు చెప్పిన ప్రతి సమస్య తనకు గుర్తుందని, ఇక్కడ పోర్టు వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని అందరూ కల గంటున్న విషయం కూడా చెప్పారని  జగన్ తెలిపారు.  ఇక్కడ (మచిలీపట్నం) పోర్టు కోసం దివంగత మహానేత వైయస్సార్ నాడు శంకుస్థాపన చేసి, 4800 ఎకరాల భూసేకరణకు ప్రయత్నించారని, కానీ ఆయన మరణం తర్వాత ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. కాగా, అప్పుడు 4800 ఎకరాల భూసేకరణను విభేదించిన చంద్రబాబు నాయుడు, పోర్టు నిర్మాణానికి 1800 ఎకరాలు చాలని వాదించారని, కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక, అన్నీ మర్చిపోయి ఏకంగా 33 వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారని, రాత్రికి రాత్రి జీఓ ఇచ్చారని ఆక్షేపించారు. ‘2013 భూసేకరణ చట్టం సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ గడువు మరొక్క రోజులో ముగుస్తుందనగా (గడువు ముగియడానికి ఒక రోజు ముందు) నోటిఫికేషన్ జారీ చేసిన చంద్రబాబు, రైతులకు చాలా నష్టం చేశారని, భూసేకరణలో వారికి చాలా తక్కువ పరిహారం ఇచ్చేలా చంద్రబాబు కుట్ర చేశారని ఆక్షేపించారు. ఆ పరిహారం రైతులకు ఏ రకంగానూ ఉపయోగపడదని స్పష్టం చేసిన జననేత, అప్పుడు కూడా తాను రైతులకు అండగా నిల్చానని గుర్తు చేశారు. 
ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు బందరు వరకు రావడం లేదని, రెండో పంటకు అస్సలు నీరందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని జననేత గుర్తు చేశారు. మహానేత వైయస్సార్ నాడు కృష్ణా డెల్టా ఆధునీకరణపై శ్రధ్ధ చూపి, పనులు కూడా మొదలు పెట్టారని, కానీ ఆ తర్వాత దాన్ని అందరూ గాలికొదిలేశారని ఆరోపించారు

No comments:

Post a Comment