విజయవాడ, మార్చి (way2newstv.in)
సార్వత్రిక ఎన్నికల బరిలో ఆంధ్రప్రదేశ్‌లో శతకోటీశ్వరులు బరిలోదిగారు. గతంలో వందకోట్ల ఆస్తి అని చెబితే నోరెళ్లబెట్టే స్థితి నుండి రూ.400 కోట్లేగా అనే ఆలోచనలోకి ఓటర్లను తీసుకెళ్లారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులు వందల కోట్ల ఆస్తులను చూపిస్తున్నారు. వారికి ఓట్లేసి గెలిపిస్తున్న వారు ఐదేళ్లకోసారి మాకేమైనా చేస్తారేమోనని ఏదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాదు ఎన్నికల ప్రచారాన్ని కూడా డబ్బు మయం చేసేశారు. ప్రజలకు మేం ఈ పని చేశామని చెప్పి ఓట్లడగటం మానేసి ఎంత డబ్బు కావాలో చెప్పు అనేస్థితికి చేరుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల నామినేషన్లు దాఖలు చేసిన వారి అఫిడవిట్లలో ఎక్కువమంది వందకోట్లకుపైబడినవారే ఉన్నారు. వారిలో రాష్ట్ర మంత్రి నారాయణ ఆస్తులు సుమారు రూ.660 కోట్లకుపైబడి ఉన్నట్లు చూపారు.
ఎన్నికల బరిలో శతకోటీశ్వరులు
లోకేష్ రూ.300 కోట్లు, వైసిపి అభ్యర్థులు పొట్లూరి వరప్రసాద్ రూ.400 కోట్లు, రఘురామకృష్ణంరాజు రూ.220 కోట్లు, మేకపాటి గౌతమ్ సుమారు రూ.200 కోట్లు ఆస్తులు ఉన్నట్లు చూపించారు. అయితే ఎక్కువమంది అభ్యర్థులు వారికంటే వారి భార్య పేరుమీద ఉన్న ఆస్తులను ఎక్కువ చూపించారు. అలా చూపించిన వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన భార్య భువనేశ్వరి పేరుమీద రూ.600 కోట్లపైబడి, నారా లోకేష్ తన భార్య బ్రహ్మణి పేరుమీద సుమారు రూ.40 కోట్లకు పైబడి ఆస్తులున్నట్లు చూపించారు. ఈసారి ఎన్నికల బరిలో ఎక్కువమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్దపెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు. రెండు పార్టీలకు సంబంధించి ఎక్కువమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికీ హైదరాబాద్ కేంద్రంగానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మంత్రుల్లో ఒకరిద్దరైతే బిజెపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలతో కలిసి హైదరాబాద్‌లో ఉమ్మడి వ్యాపారాలు చేస్తున్నారు. నిర్మాణరంగం కంపెనీలు, పరిశ్రమల్లోనూ వాటాలు ఉమ్మడిగానే నిర్వహిస్తున్నారు. పైకి మాత్రం పెద్దఎత్తున రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఓ మంత్రి, బిజెపిలో చేరిన కావూరి సాంబశివరావుకు కలిపి ఉమ్మడిగా వ్యాపారం సాగుతోంది. ఎక్కువమంది ఎమ్మెల్యేల అఫిడవిట్లలో తమ కంపెనీలుగా చూపించిన ఆస్తులన్నీ హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయి. పలువురికి హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయపొలాలూ ఉన్నాయి. రెండు పార్టీల్లో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువమందిది ఇదే పరిస్థితి. రాజకీయంగా కీలకమైన ఎన్నికలు కావడంతో రెండు పార్టీల నాయకులు ఎద్దఎత్తున కోటీశ్వరులను బరిలో దింపారు. ఎన్నికలను పూర్తిగా డబ్బు మయంగా మార్చేశారు.
No comments:
Post a Comment