Breaking News

25/03/2019

విజయవాడ వెస్ట్ లో గెలుపు ఎవరిది

విజయవాడ, మార్చి 25 (way2newstv.in)
ఇక్కడ ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం కష్టమే. వరుసగా రెండుసార్లు గెలిచిన వారు ఈ నియోజకవర్గంలో లేరు. అందుకే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే తన ప్లాన్ మార్చుకున్నారు. అదే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జలీల్ ఖాన్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. జలీల్ ఖాన్ కు పార్టీ మారడం కొత్త కాకపోయినా, ఈసారి మాత్రం ఆయన కొత్త ఎత్తుగడకు తెరతీశారు.1953 నుంచి ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఒకసారి నెగ్గిన ఎమ్మెల్యే మరోసారి గెలవరు. జలీల్ ఖాన్ ఇప్పటికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలుపొందారు. అయితే ఈసారి ఆయన ఆ సెంటిమెంట్ కు తావివ్వకూడదనుకున్నట్లుంది. అందుకే తాను స్వచ్ఛందంగా బరిలో నుంచి వైదొలిగారు. 


విజయవాడ వెస్ట్ లో గెలుపు ఎవరిది

తన స్థానంలో కూతురు షబానా ఖాతూన్ కు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. అభ్యర్థి మారడంతో గెలుపు తమదేనన్న ధీమాతో జలీల్ ఖాన్ ఉన్నారు.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవలేదు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కొన్ని మార్లు ఈసీటును మిత్రపక్షాలకు వదిలిపెడుతూ వస్తుండటంతో ఒక కారణమని అనుకోవచ్చు కూడా. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలేమీ లేకపోవడంతో తప్పనిసరిగా పోటీ చేయాల్సి వస్తోంది. జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూన్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అయితే షబానా ప్రచారానికి పెద్దగా ఆదరణ లభించడం లేదంటున్నారు. ఈ నియోజకవర్గం తొలి నుంచి కమ్యునిస్టులకు కంచుకోటగా ఉండేది. ఐదు సార్లు ఇక్కడ వామపక్ష పార్టీ అభ్యర్థులు గెలవడం గమనార్హం.ఇక ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. గత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని ఇంకా ఆ పార్టీ నిర్ణయించకపోయినా ఇప్పటికే ఆశావహులు పాదయాత్రతో జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ ఛార్జి, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎండను సయితం లెక్క చేయకుండా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అలాగే మరోనేత కోరాడ విజయకుమార్ కూడా వైసీపీ అభ్యర్థిని తానేనంటూ ప్రజల చెంతకు వెళుతున్నారు. మొత్తం మీద విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేతల ఫీట్లు చూస్తుంటే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తెలియదు కాని నేతలకు మాత్రం మండుటెండలో చుక్కలు కన్పిస్తున్నాయి.

No comments:

Post a Comment