Breaking News

12/03/2019

తమిళనాడులో బిగ్ ఫైట్

చెన్నై, మార్చి 12, (way2newstv.in)
అనుకున్నట్లే జరిగింది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా తమిళనాడును ముంచెత్తనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలుపోటములో రాష్ట్రంలో పవర్ ఎవరిదన్నది డిసైడ్ చేస్తాయి. దీంతో పార్లమెంటు ఎన్నికల కంటే ఉప ఎన్నికల మీదనే ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. అయితే 21 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ కేవలం 18 స్థానాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న పరిణామాలే ఉప ఎన్నికలకు కారణమయ్యాయి. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేసి అక్రమాస్తుల కేసులో జైలు కెళ్లిన శశికళ అక్కడి నుంచే చక్రం తిప్పటం ప్రారంభించారు. తనను బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు నుంచి చెన్నై జైలుకు మార్చాలంటూ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు. అంతేకాకుండా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 


తమిళనాడులో బిగ్ ఫైట్ 

ఆయన పెత్తనం ఎక్కువకావడం, పన్నీర్ సెల్వం తిరుగుబాటు వంటి అంశాలు పళనిస్వామిని పునరాలోచనలో పడేశాయి.భారతీయ జనతా పార్టీ అండ లేకుంటే ప్రభుత్వం కూలిపోతుందని భావించిన పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో చేతులు కలిపేశారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పళనిస్వామికి వ్యతిరేకంగా తమ సంతకాలతో గవర్నర్ కు లేఖ ఇచ్చారు. దీంతో తమిళనాడు స్పీకర్ వీరిపై అనర్హత వేటు వేశారు. మద్రాస్ హైకోర్టు అనర్హత వేటుపై సానుకూలంగా తీర్పు నివ్వడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.ఇప్పుడు ఈ 18 నియోజకవర్గాల్లో తన పార్టీకి చెందిన నేతలను గెలిపించుకోవడం దినకరన్ కు కత్తిమీద సామే. అలాగే పళని, పన్నీర్ సెల్వంలకు కూడా అగ్ని పరీక్షే. కనీసం వీటిలో 11 స్థానాలను దక్కించుకోకుంటే ఇంటి దారి పట్టక తప్పని పరిస్థితి. రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న డీఎంకే సయితం అధికారం కోసం నిరీక్షిస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను చేజిక్కించుకుని అధికారంలోకి రావాలన్న ఉద్దేశ్యంతో ఉంది. తమిళనాడు శాసనసభకు 2021వరకూ కాలపరిమితి ఉండటంతో రెండు పార్టీలూ అధికారం కోసం ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీటికి ఏప్రిల్ 18న పోలింగ్ జరగనుంది.

No comments:

Post a Comment