Breaking News

19/02/2019

రాజకీయ అండతో దోపిడీ (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, ఫిబ్రవరి 19 (way2newstv.in): ప్రస్తుతం అడవుల పరిరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. స్మగ్లర్లతో కలిసిపోయిన అటవీశాఖ అధికారులపై బదిలీ వేటు వేసింది. పలువురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది. స్మగ్లర్లకు, అధికారులకు మధ్య కీలకమైన సమన్వయపాత్ర పోషించేది రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలకు చెందిన మండల స్థాయి నేతల నుంచి జిల్లా స్థాయివరకు, సర్పంచి నుంచి శాసనసభ్యులు, ఆఖరికి మంత్రులు కూడా అడవుల నరికివేతను అరికట్టలేకపోయారు. కలప స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించే అధికారులను బెదిరించడం, బదిలీలతో భయ భ్రాంతులకు గురిచేసేవాళ్లు. ఈ అక్రమ కలప దందా వెనుక అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరిపోవడం ప్రభుత్వ యంత్రాంగంలో అలజడి రేగింది. కలప అక్రమ రవాణలో తెరాస నేతలున్నా.. వాళ్లనే ముందు అరెస్టు చేయండనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన వెనుక ఆంతర్యం ఇదే.


రాజకీయ అండతో దోపిడీ (ఆదిలాబాద్)

అక్రమ కలప దందా వెనుక నేతలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి నేతల నుంచి కొందరు శాసన సభ్యులు, మండల నేతల ప్రత్యక్ష పరోక్ష సంబంధాలపై నిఘా వర్గాలు లోతైన ధర్యాప్తు సాగించాయి. ఉమ్మడిజిల్లాలో సుమారు 25మంది నేతలు కలప స్మగ్లింగ్‌లో నేతలకు సంబంధం ఉన్నట్లు తేల్చారు. ఎవరెవరు ఎలా సహకరిస్తున్నారనే విషయాలపైన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని  తీవ్రంగా పరిగణించిన సీఎం నేతలపై కేసులు నమోదు చేయాలని హుకుం జారీ చేశారు. మరోవైపు స్మగ్లర్లతో చేతులు కలుపుతున్న అధికారులపై బదిలీ వేటు వేసి ఇతర ప్రాధాన్యంలేని పోస్టుంగులిచ్చారు. పోలీసుల పాత్రపైన కూడా సీఎం ఆరా తీస్తున్నారు. అయితే.. అధికారులతోపాటు స్మగ్లర్లకు సహకరిస్తున్న అధికార, ప్రతిపక్ష అనే తేడా లేకుండా రాజకీయ నేతలపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండు వ్యక్తమవుతోంది. నేతలను అదుపులో పెడితే.. అడవుల నరికివేతకు కళ్లెం వేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రూ.కోట్ల విలువైన కలప అడ్డదారిన రవాణ సాగుతుంటే ఇంతకాలం గుడ్లప్పగించిన అటవీ, పోలీసులు ఆలస్యంగానైనా మేల్కొంటున్నారు. జిల్లాలో ఇచ్చోడ, సిరికొండ, సిరిచెల్మ, కేశవ పట్నం, గుండాల, నేరేడిగొండ మండలంలోని వాగ్ధారి, మల్యాల, పెంబీ, ఖానాపూర్‌ అటవీ ప్రాంతాల్లో సుమారు రూ.3వేల హెక్టార్ల విస్తీర్ణంలో టేకు చెట్లను స్మగ్లర్లు నరికివేసి వందలాది వాహనాల ద్వారా తరలించినట్లు ఇటీవల జరిపిన ప్రాథమిక విచారణలో బయటపడింది. తూర్పు జిల్లాలోని తిర్యాణి, వేమనపల్లి, నీల్వాయి, కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతాల నుంచి జోరుగా కలప స్మగ్లింగ్‌ వ్యవహారం ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. కవ్వాల్‌ అభయారణ్యంతో పాటు ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో దట్టమైన అడవిలో స్మగ్లర్లు తమ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. ఓవైపు హరిత హారం పేరిట ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తూ మొక్కలు నాటుతుండగా.. మరో వైపు అడవులను నరికివేయడం ప్రభుత్వ పెద్దలను కలచివేసింది. దీనిపైన దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అటవీశాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.
ఇన్నాళ్లు రాజకీయ పార్టీ నేతలు, పాలకుల కనుసన్నల్లోనే కలప అక్రమ రవాణ సాగింది. కలప వ్యాపారులనుంచి మామూళ్లతోపాటు కలప అవసరాలను తీర్చుకునేవాళ్లు. కొందరు స్మగ్లర్లే రాజకీయ నాయకుల అవతారం ఎత్తి.. సామిల్లులు, టింబర్‌ డిపోల యజమానులుగా మారారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువాలు కప్పుకొంటూ వారి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నారు. నిర్మల్‌ జిల్లా మామడ మండలంలోని ఓ సామిల్లు నుంచి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతకు ఇటీవలే ఎటువంటి అనుమతులు లేకుండా రూ.20కోట్ల విలువైన కలపను వివిధ సైజుల్లో తయారు చేసి పంపినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కినా.. ఇక్కడి నేతలే చర్యల్లేకుండా చేసినట్లు ప్రచారం సాగింది. ఆదిలాబాద్‌లో సీసీఐ సమీపంలో పట్టుబడిన రూ.50లక్షల కలప వ్యవహారంలో అధికార పార్టీ నేతలే కీలక సూత్రధారులుగా ఉండటంతో ఈ కేసును పక్కదారి పట్టించడానికి నేతలు, అటవీ, పోలీసు అధికారులు శాయశక్తులా ప్రయత్నించారు. నేతల ఒత్తిళ్లతో  పోలీసులు నిందితులను అరెస్టు చేయడానికి వెనుకంజ వేశారు. బోథ్‌ నియోజకవర్గంలో ఓ ప్రతిపక్ష పార్టీ నేత ఇంట్లో అక్రమ కలప పట్టుబడినా ఆయన్ను తప్పించి సోదరుడిపై కేసు నమోదు చేశారు. ఖానాపూర్‌ సమీపంలో అడవిలో చెట్లను నాశనం చేస్తుండగా వాహనాలను సీజ్‌ చేసిన అటవీ అధికారులపై ఓ ప్రజాప్రతినిధి భర్త చేసిన హడావుడి అంతాఇంతా కాదు. సీజ్‌ చేసిన వాహనాలను బయటకు పంపించేశారు. బోథ్‌ నియోజకవర్గంలో అడవుల నరికివేతపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఓ సామాజిక వర్గం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువాలు కప్పుకొంటూ తమ పనికి ఆటంకం లేకుండా కొనసాగిస్తున్నారు. ఆదిలాబాద్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, చెన్నూరు ప్రాంతాల నుంచి అక్రమంగా కలప తరలింపు వెనుక నేతలు, ప్రజాప్రతినిధులకు వాటాలున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో కలప వ్యాపారులకు ఎటువంటి  ఇబ్బందులు రాకుండా అండగా ఉంటారు.  నేతల ప్రమేయంతోనే అడవుల నరికివేతకు గురవుతున్నాయని తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ ఆలస్యంగానైనా తీసుకున్న విధాన నిర్ణయాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

No comments:

Post a Comment