Breaking News

19/02/2019

వేతనాల వెతలు (తూర్పుగోదావరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 19(way2newstv.in): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించి.. కూలీల వలసలు తగ్గించడానికి పథక రూపంలో తీసుకువచ్చిన చట్టం. ఈ పథకంలో పనిచేసిన కూలీలకు 15 రోజుల్లోగా వేతనాలు అందించాలి. ఈ నిబంధన చట్టంలోనే పొందుపరిచారు. కానీ కూలీలు పనులు చేసి నెలలు అవుతున్నా వేతనాలు అందని దుస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకంలో నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో కూలీలకు వెతలు తప్పడం లేదు. జిల్లాలో 62 మండలాల్లోని 1,069 గ్రామ పంచాయతీల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలవుతోంది. 8,36,857 మందికి  జాబ్‌కార్డులు ఉండగా.. 46,406 ఎస్‌ఎస్‌ఎస్‌ గ్రూపుల్లో 7,86,236 మంది కూలీలు నమోదై ఉన్నారు. ఈ పథకంలో పనిచేసిన కూలీలకు రెండు నెలలుగా కూలీల వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 

వేతనాల వెతలు (తూర్పుగోదావరి)

గత ఏడాది డిసెంబరు ఏడో తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.20 కోట్లు కూలీల వేతనాలు బకాయిలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారం కూలీలు పనిచేసిన 15 రోజుల్లోగా వారికి వేతనాలు అందించాలి. గ్రామాల్లో రోజువారీ చేపట్టిన పనులు ఎప్పటికపుడు మండల కంప్యూటర్‌ కేంద్రాల్లో నమోదు చేయడం ద్వారా సెంట్రల్‌ సర్వర్‌కు చేరతాయి. రెండు నెలలుగా కూలీలు చేసిన పనులను నమోదు చేస్తున్నా.. కేంద్రం నుంచి నిధుల విడుదలలో మాత్రం జాప్యమవుతోంది. ఈ పరిస్థితుల్లో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. చేసిన పనులకు కూలీ సొమ్ములు రాకపోగా.. పథకంలో పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. వరినాట్లు సీజన్‌ ముగిసి నెల అవుతున్నా, కొత్తగా పనులు కల్పించకపోవడంతో తాము ఖాళీగా ఉండాల్సివస్తోందని కూలీలు వాపోతున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధులు.. ఆర్థిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ తదితర నిధుల టైఅప్‌తో వివిధ శాఖల ద్వారా భారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పుంత రోడ్లకు గ్రావెల్‌తో అభివృద్ధి చేయడం.. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్లాట్‌ఫాంల నిర్మాణం, ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, శ్మశానవాటికల అభివృద్ధి.. ఇలా చాలా పనులు ఈ పథకం టైఅప్‌తో పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో బిల్లుల చెల్లింపులో జాప్యమవుతోంది. ఈ విధంగా చేపట్టిన పనులకు జిల్లాలో భారీగా బకాయిలున్నాయి. ఈ నేపథ్యంలో పనులు చేపట్టడానికి ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మెటీరియల్‌ కాపొనెంట్‌లో పనుల లక్ష్యాలను చేరడం.. వంటి పరిస్థితుల్లో కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపొద్దని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున సిమెంటు రహదార్లు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి అభివృద్ధి పనులు చేపట్టాలనే యోచనకు గండిపడింది.

No comments:

Post a Comment