Breaking News

19/02/2019

అసలే తక్కువ.. ఆపై దోపిడీ (కరీంనగర్)

కరీంనగర్, ఫిబ్రవరి 19(way2newstv.in):జిల్లా భూ భాగంలో అడవుల విస్తీర్ణం అతి తక్కువ.. రాష్ట్రంలోనే అత్యల్ప విస్తీర్ణమున్న జిల్లా కరీంనగర్‌.. జిల్లా విభజనతో అడవే లేకుండాపోగా అక్రమాలకు కొదవే లేదు.. జిల్లాకేంద్రమే అక్రమాలకు అడ్డాగా సాగుతుండగా నియంత్రించాల్సిన విభాగం మామూళ్ల మత్తులో తూగుతోందని ఇటీవలి ఘటనలు స్పష్టమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అటవీ సంరక్షణకు కఠినచర్యలు చేపడుతుండగా తదనుగుణంగా జిల్లాలోనూ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది..
కరీంనగర్‌ జిల్లా కేంద్రమే అటవీ అక్రమాలకు అడ్డాగా నిలుస్తోంది.. ఇక్కడ సుమారు 50 వరకు సామిల్లులున్నాయి. ఇక్కడికి ఆదిలాబాద్‌, మంథని, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి జోరుగా కలప రవాణా జరుగుతోంది.


అసలే తక్కువ.. ఆపై దోపిడీ (కరీంనగర్)

అటవీ అధికారులే పర్మిట్లను జారీచేసి జీరో దందాకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు పుష్కలం.. ఇబ్బడిముబ్బడిగా కర్ర వస్తుండగా అందులో జీరో ఎంత, సక్రమమెంత.. నన్నది ఏనాడూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇటీవల ఏసీబీకి పట్టుబడిన ఘటనలో పర్మిట్లు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ విభాగం వద్ద లభించడం అనుమానాలకు తావిస్తోంది. ఎంత యథేచ్ఛగా పక్కదారి పడుతుందో స్పష్టమవుతోంది. పలువురు సామిల్లుల యజమానులు ఇతర జిల్లాల కలప పేరుతో అక్రమాలకు తెగబడుతున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ పర్మిట్‌ పేరుతో వనమేధానికి సహకరిస్తున్నారు. అయితే సామిల్లుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. సూక్ష్మంగా పరిశీలించేలా సీసీ కెమెరాలను అమర్చేలా పర్యవేక్షణ ఉండాలన్నది పర్యావరణవేత్తల అభిప్రాయం. మొక్కుబడిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండకపోగా.. విద్యుత్తు సరఫరా అంతరాయం పేరుతో అక్రమాలు కొనసాగే ప్రమాదం ఉంది.
వడగాలులు, వడదెబ్బ, అతివృష్టి, అనావృష్టి వంటి అనుభవాలు ఎదురైనప్పుడే పర్యావరణమంటూ నిట్టూర్చేవారుండగా తదుపరి అంతే.. మళ్లీ ఆ పరిస్థితి వస్తేనే.. స్పందించే బదులు పౌరస్పృహ తప్పనిసరి ఉండాల్సిందే. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మన జిల్లా అడవుల వాటా 0.30 శాతమంటే మనమెక్కడున్నాం.. మనమెంత పురోగమించాలి. జిల్లాలో కరీంనగర్‌, హుజూరాబాద్‌ రేంజీలుండగా 60 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్‌ రేంజిలో 101.75 హెక్టార్లు, హుజూరాబాద్‌ రేంజిలో 692.5 హెక్టార్ల అడవి ఉన్నట్లు అధికారిక లెక్కలు చాటుతున్నాయి. హుజూరాబాద్‌ పరిధిలో సైదాపూర్‌ మండలం ఆకునూరులో మాత్రమే అడవి ఉండగా కరీంనగర్‌ పరిధిలో గంగాధర మండలం వెంకటాయపల్లి శివారులో అడవి ఉంది. సదరు ప్రాంతంలోనైనా పచ్చదనం పెంపొందేలా చర్యలతో పాటు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. దీంతో పాటు రహదారులు, వీధులు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కళాశాలలు, గ్రామ పంచాయతీలు, కుల సంఘాల భవనాలు, పొలాలు, నివాస ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లో హరితహారాన్ని పక్కాగా నిర్వహించాలి. వాటి రక్షణకు ప్రత్యేక సిబ్బందిని కేటాయిస్తే సస్యరక్షణ చర్యలతో పాటు వాటిని కాపాడే వీలుంది.
జిల్లా కేంద్రంతో పాటు కరీంనగర్‌, హుజూరాబాద్‌ రేంజిలో పలువురు అధికారులు పాతుకుపోయారు. అటూఇటూగా బదిలీలు చేయించుకుంటుండగా అక్రమార్కులతో అంటకాగుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ కఠినచర్యల్లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీలు చేసి అక్కడి వారిని ఇక్కడ నియమిస్తేనే సగం దందాకు చెక్‌పడినట్లే. ఇటీవల అసిస్టెంట్‌ బీట్‌ అధికారి నుంచి డీఎఫ్‌ఓ వరకు బదిలీలుంటాయని ప్రచారం జరగ్గా.. ఉమ్మడి జిల్లాస్థాయిలో కేవలం 21 మందిని మాత్రమే బదిలీ చేశారు. తదుపరి మరో జాబితా ఉందని ప్రచారం జరిగినప్పటికీ ఉండదనే ప్రచారం తాజాగా నెలకొంది.
వన్యప్రాణుల మరణాలు ఏదో ఓచోట వెలుగుచూస్తున్నాయి. ఇటీవల కాలంలో నెమళ్లు, ఎలుగుబంట్లు, అడవి పందులు, ఏదులు, దుప్పుల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఆహారం, నీటి కోసం జనావాసాలకు చేరి మరణిస్తున్నాయి. వేటగాళ్ల వికృత చేష్టలకు వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడానికి ప్రధాన కారణం తాగునీరు, ఆహారం కొరతే.. దీన్ని అవకాశంగా మల్చుకున్న అక్రమార్కులు ఉచ్చులు, విద్యుత్‌షాక్‌లు పెడుతూ వాటి ప్రాణాలనే తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వేటగాళ్లను పట్టుకోవడం ఎంతో కొంత జరిమానా వేసి వదిలేస్తుండటంతో భయం లేకుండా పోయింది. దీంతో మళ్లీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. ఏ వన్యప్రాణిని వేటాడినా కారాగార శిక్ష పడేలా చర్యలుండాలి.
నాలుగేళ్లుగా హరితహారం కార్యక్రమం కొనసాగుతుండగా కాగిత లెక్కలకు కార్యక్షేత్ర మదింపునకు పొంతనే ఉండటం లేదు. ఏదో మొక్కుబడిగా సాగుతుందనే విమర్శలు వ్యక్తమవుతుండగా కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. ఆరేళ్లుగా వానరాలు జనావాసాల్లోకి చేరిపోయాయి. నివాసాలపై దాడిచేస్తుండగా పలు ప్రాంతాల్లో పలువురు ఆసుపత్రులపాలయ్యారు. ఈ నేపథ్యంలో వీధులు, ప్రధాన రహదారుల వెంట పండ్ల మొక్కలకు ప్రాధాన్యతనిస్తే వాటిని కొంతలో కొంత అరికట్టినట్లవుతుంది. అలాగే వాతావరణానికి అనుకూలమైన ఔషధ మొక్కలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి.

No comments:

Post a Comment