Breaking News

26/02/2019

ఇంత నిర్లక్ష్యమా..? (శ్రీకాకుళం)

కాశీబుగ్గ, ఫిబ్రవరి 26 (way2newstv.in): 
ప్రజా సంక్షేమం ఆశించి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొందరి నిర్లక్ష్యంతో ప్రయోజనం లేకుండా పోతున్నాయి. రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా జనానికి లబ్ధి చేకూరే పరిస్థితి కనిపించడం లేదు. పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘంలో ఇంగిలిగాం రెవెన్యూ పరిధిలో నిర్మించిన హుద్‌హుద్‌ ఇళ్ల పరిస్థితి ఇదే విధంగా మారింది. ఇంకా లబ్ధిదారులకు కేటాయించకుండానే ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. మరో వైపు మౌలిక సదుపాయాలు సైతం ప్రశ్నార్థకంగా మారాయి. రూ. 9.17 కోట్లతో 192 ఇళ్లు... ఎన్టీఆర్‌ ప్రత్యేక పట్టణ గృహనిర్మాణ పథకంలో రూ. 9.17 కోట్లతో 192 ఇళ్ల నిర్మాణానికి 2016 ఆగస్టు 27న శంకుస్థాపన చేశారు.


ఇంత నిర్లక్ష్యమా..? (శ్రీకాకుళం)

 4.50 ఎకరాల్లో ఒక్కో బ్లాకులో 16 ఇళ్లు చొప్పున, 12 బ్లాకుల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఇంటికి నిర్మాణ వ్యయం రూ. 4 లక్షలు. జీ+1 విధానంలో నిర్మాణం చేపట్టారు. ఈ గృహాలకు నీరు, విద్యుత్తు, రహదారులు, మురుగు కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది.
అవి ప్రశ్నార్థకం
ఇళ్ల నిర్మాణం పూర్తయినా మౌలిక సదుపాయాల కల్పన ప్రశ్నార్థకంగా మారింది. కాలువ నిర్మాణం కొన్ని చోట్లే పూర్తి చేశారు. రహదారుల పనులు ఇంతవరకు ప్రారంభించలేదు. నీటి పథకం ట్యాంకు పనులు సగం చేపట్టి వదిలేశారు. ఈ పథకానికి సామగ్రి సైతం అక్కడ నుంచి తొలగించే పరిస్థితి లేదు. తిత్లీ తుపానుతో పాడైన విద్యుత్తు స్తంభాలు బాగు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికీ అవి అడ్డంగా పడి ఉన్నాయి. హుద్‌హుద్‌ ఇళ్లను ఇటీవల ప్రారంభించారు. నెలాఖరుకు మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేస్తే లాటరీ విధానంలో లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. అయితే ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండానే గోడలు బీటలు వారుతున్నాయి. వాటి మధ్య చెదలు పడుతున్నాయి. చిన్న పాటి వర్షానికే నీరు లోపలికి చేరే పరిస్థితి ఉంది. తలుపులు, కిటికీలు ఊడిపోతున్నాయి. నీటి కోసం ఏర్పాటు చేసిన పైపులు పాడై వేలాడుతున్నాయి. ఇళ్ల లోపల పనులు సైతం అంతంత మాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

No comments:

Post a Comment