Breaking News

26/02/2019

నత్తనడక (తూర్పుగోదావరి)

రాజమండ్రి, ఫిబ్రవరి 26 (way2newstv.in): 
జిల్లాలోని నీరు-చెట్టు పథకం కింద చెరువుల అభివృద్ధి కోసం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 20 కోట్లతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జలవనరుల శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్‌లో భాగంగా ఈ పథకానికి పెద్దపీట వేసే అవకాశం ఉంది.  వ్యవసాయాధారిత జిల్లా కావడంతో సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఏటా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అయినప్పటికీ ప్రతిపాదించిన మొత్తం నిధులకు అనుమతులు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది (2018-19) నీరు-చెట్టు పథకానికి రూ.164.44 కోట్ల నిధులు మంజూరు చేయగా, అందులో రూ.84.77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగులు నిధులు ఈ ఏడాది ఖర్చుచేసే అవకాశం ఉంది. గతేడాది మిలిగిన వాటికి ఈ ఏడాది మంజూరయ్యే రూ.20కోట్ల నిధులు కలిపి మొత్తం 104.77 కోట్లతో పనులు చేపట్టే ఆస్కారం ఉన్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
నీరు-చెట్టు పథకంలో భాగంగా కేవలం చెరువుల పూడికతీత పనులే కాకుండా చెక్‌డ్యాంలు, స్లూయిస్‌లు, జంగిల్‌ క్లియరెన్స్‌, ఫీల్డ్‌ ఛానళ్ల అభివృద్ధి, డ్రైనేజీల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు.


నత్తనడక (తూర్పుగోదావరి)

గతేడాది సమయం లేకపోవడంతో 50శాతం నిధులు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఏడాది ఆ సమస్య తలెత్తకుండా ఉన్న నిధులు సక్రమంగా..సకాలంలో వినియోగించడానికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. గతేడాది ప్రారంభించి ఆపివేసిన పనులు 1,015 వరకూ ఉన్నాయి. వీటిని మార్చి రెండో వారం నుంచే ప్రారంభించి పూర్తిచేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. గతేడాది మంజూరై ఇంకా పనులు ప్రారంభించని వాటిని కూడా మార్చి లోపే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి మార్చి నుంచి పనులు ప్రారంభిందుకు కసరత్తు చేస్తున్నారు.
భూగర్భ జలాలను పెంపొందించి కరవును పారదోలాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.వందల కోట్ల నిధులు నీరు-చెట్టు పథకానికి ఖర్చు చేస్తుంది. కానీ ఆఖరి నిమిషం వరకూ కాలయాపన చేసి వర్షాకాలం మరో నెల రోజుల్లో సమీపిస్తుందన్న సమయంలో పనులు చేపట్టడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. పనులు చేసినట్లు దస్త్రాల్లో కనిపిస్తోంది తప్ప.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అంతేకాకుండా నిధులు పుష్కలంగా ఉన్నా పనులు చేపట్టడంతో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఉదాహరణకు గతేడాది నీరు చెట్టు పథకం కింద జిల్లాకు రూ.164.44కోట్లు కేటాయించగా అందులో రూ.84.77కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే దాదాపు 50శాతం పనులే పూర్తయ్యాయి. ఏ శాఖకు కేటాయించనన్ని నిధులు ఈ పథకాకి ప్రభుత్వం కేటాయిస్తుంది. కానీ ఫలితం శూన్యం. ఈసారయినా పూర్తిస్థాయిలో పనులు చేపడతారని రైతులు ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment