Breaking News

26/02/2019

మూసేయాల్సిందేనా..? (ఆదిలాబాద్)

నిర్మల్, ఫిబ్రవరి 26 (way2newstv.in): 
విద్యార్థులతో కళకళలాడాల్సిన కళాశాల అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్వీర్యమవుతోంది. బోధకులు, అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే కళాశాల నిర్వహణ ఏటికేడు దుర్భరంగా మారుతోందన్న పరిస్థితులను కల్పించారు. దీనికితోడు విద్యార్థుల ప్రవేశాల్లేక ప్రస్తుతం ఖాళీగా ఉన్న కళాశాల భవనాన్ని  అద్దెకిస్తామని ప్రకటిస్తున్నారు. ఇదీ ఘనమైన చరిత్ర ఉన్న నిర్మల్‌ విశ్వవిద్యాలయ పీజీ కళాశాల దుస్థితి.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ఏకైక విశ్వవిద్యాలయ పీజీ కళాశాల నిర్మల్‌ జిల్లాకేంద్రంలో ఉంది. 1991 సంవత్సరంలో ప్రారంభమైన ఈ కళాశాల ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతవిద్యను అందించింది. ఓ దశలో విశ్వవిద్యాలయంగా ఉన్నతీకరిస్తే బాగుంటుందనే ప్రతిపాదనలు సైతం రూపొందించారు. అవసరమైన నిధులను సైతం కేటాయించారు. ఇదే జరిగితే విశ్వవిద్యాలయంగా విరాజిల్లేది. కానీ, రాజకీయ జోక్యంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. మరోవైపు బోధకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, పాలకుల పట్టింపులేనితనం ప్రస్తుతం ఒక్క విద్యార్థి కూడా కళాశాలలో ప్రవేశం పొందని దుస్థితి దాపురించింది. 


మూసేయాల్సిందేనా..? (ఆదిలాబాద్)

ఒకప్పుడు పలు కోర్సులు, పెద్దసంఖ్యలో విద్యార్థులతో కళకళలాడింది. కానీ, ప్రస్తుతం ఒక్కరైనా ప్రవేశం పొందకపోతారా అన్న ఆశతో వెలవెలబోతోంది. రెండంతస్తుల్లో ఉన్న ఈ భవనంలో విశాలమైన తరగతి గదులు, మూత్రశాలలు, గ్రంథాలయం, గిరిజన మ్యూజియం, కంప్యూటర్‌ ల్యాబ్‌, పరిపాలనాగదులు, సరిపడా ఫర్నీచర్‌.. ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ, విద్యార్థుల ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు చొరవ చూపకపోవడం, గతంలో మాదిరిగా తక్షణ ప్రవేశాలకు అవకాశం కల్పించకపోవడం వారి నిర్లక్ష్యనికి అద్దం పడుతోంది. అదే సమయంలో కళాశాల పరిధి మారుతుందన్న ప్రకటనల నడుమ విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి నిధులను కేటాయించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న కళాశాలను సంరక్షించే చర్యలు చేపట్టడం మాని ఇతర విద్యార్థుల ప్రయోజనం కోసం భవనాన్ని అద్దెకు కేటాయించేందుకు ప్రయత్నిస్తుండటం విడ్డూరం.
ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతున్న ఈ భవనం గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించింది. అంటే.. ఈ భవనంపై సర్వహక్కులు కేంద్రానివే. తమ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గాని, అవసరాల కోసం భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే అధికారం విశ్వవిద్యాలయానికి గాని స్వతహాగా లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడితే కేంద్రప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగానే.. కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో నిర్మల్‌ జిల్లా కేంద్రంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అసవరమైన భవనాలను పరిశీలిస్తున్న క్రమంలో, పీజీ కళాశాల పై అంతస్తును ఆర్డీఓ కార్యాలయంగా వినియోగించుకునేందుకు నిర్ణయించారు. భవనానికి రంగులు సైతం వేశారు. అయితే, కార్యాలయ ఏర్పాటుకు వీల్లేదని కరాఖండిగా చెప్పడంతో ప్రభుత్వం తమ ఆలోచనను విరమించుకుంది. కానీ, ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర గురుకులాల సంఘం (టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల డిగ్రీ కళాశాల కోసం ప్రస్తుతమున్న పీజీ కళాశాల భవనాన్ని కేటాయించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో సంఘ సభ్యులు ఇప్పటికే కళాశాలను సందర్శించారు. వసతులను పరిశీలించారు. విద్యాసంస్థల నిర్వహణకు ప్రభుత్వం భవనాలను సమకూర్చలేకపోతే తాత్కాలికంగా ప్రైవేటు అద్దెభవనాల్లో నిర్వహించడం మనకు తెలిసిందే. కానీ, ప్రత్యేకంగా విశ్వవిద్యాలయ పీజీ కళాశాలను నిర్వీర్యం చేసి అందులో డిగ్రీ కళాశాలను నిర్వహించాలనుకోవడంలో ఆంతర్యమేంటో మరి..!
భవన అప్పగింతపై అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం పీజీ కళాశాలలో ప్రవేశాలు లేకపోవడంతో, బాలికల గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం తాత్కాలికంగా ఏడాది పాటు దీన్ని లీజు కింద అప్పగిస్తామని కళాశాల ప్రిన్సిపల్‌ స్వర్ణలత పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ నిర్ణయం మేరకే ఈ చర్యలు తీసుకున్నారని, తనకెలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. అదే సమయంలో, వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలు జరిగితే డిగ్రీ కళాశాలను తరలిస్తారని, ప్రవేశం పొందిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. అయితే.. విద్యాసంవత్సరం మొదలవడానికి ఇంకా నాలుగునెలల సమయం మాత్రమే ఉంది. ఈలోపు పీజీ ప్రవేశపరీక్షలు, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. గతంలో మాదిరిగా విశ్వవిద్యాలయ పరిధిలో కాకుండా, ఈ సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటికే పీజీ కళాశాలలో ఏర్పాటుచేసిన గురుకుల డిగ్రీ కళాశాలను ఎలా తరలిస్తారు, విద్యార్థుల పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై గురుకులాల సంఘం సంయుక్త కార్యదర్శి మామిడాల ప్రవీణ్‌ మరోరకంగా సమాధానమిచ్చారు. తాము కేవలం కళాశాలను పరిశీలించేందుకే వచ్చామని, అది కూడా ఆరునెలల కాలానికే లీజు కోసం ప్రయత్నిస్తున్నామని, లీజు విషయమై ఎలాంటి నిర్ణయం ఇంకా ఖరారు కాలేదని పేర్కొనడం గమనార్హం. ఒకే సమయంలో ఇద్దరు అధికారులు వేర్వేరు సమాధానాలు చెప్పడం సందేహాస్పదంగా మారింది.

No comments:

Post a Comment