హైదరాబాద్ ఫిబ్రవరి 19 (way2newstv.in)
రాష్ట్రంలో పర్యటిస్తున్న నందకిషోర్ సింగ్ అధ్యక్షతలోని 15వ ఆర్థిక సంఘం ప్రతినిధి బృందం నేడు ఉదయం సుప్రసిద్ధ చార్మినార్‌ను సందర్శించింది. ఈ 15వ ఆర్థిక సంఘం ప్రతినిధి బృందానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ఘన స్వాగతం పలికారు. చార్మినార్‌కు చేరుకున్న 15 వ ఆర్థిక సంఘం ప్రతినిధి బృందంలో చైర్మన్ నందకిషోర్ సింగ్, సభ్యులు డా. అనూప్ సింగ్, డాక్టర్.రమేష్ చంద్, జాయింట్ సెక్రటరీ ముక్ మిత్ సింగ్ భాటియా, మీడియా అడ్వైజర్ మౌసమీ చక్రవర్తి, డైరెక్టర్లు గోపాల్ ప్రసాద్, భరత్ భూషణ్ గార్గ్, జాయింట్ డైరెక్టర్ ఆనంద్ సింగ్ పర్మార్, డిప్యూటి డైరెక్టర్ నితీష్ షైనీ, అస్టిస్టెంట్ డైరెక్టర్ సందీప్ కుమార్, డి.డి.ఓ. డి.కె.శర్మ, పిఎస్ త్యాగరాజన్‌లు ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం చార్మినార్ నిర్మాణం, హైదరాబాద్ చరిత్ర, చార్మినార్ పెడిస్టీరియన్ ప్రాజెక్టు, మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ లపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.
చార్మినార్, ఫలక్‌నూమాలను సందర్శించిన 15వ ఆర్థిక సంఘ బృందం
కుత్బుషాహిల నిర్మాణ శైలీలో నిర్మించిన చార్మినార్‌ను చూసి మంత్రముగ్దులయ్యారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద హైదరాబాద్ ఇరానీ చాయ్‌ను ఆర్థిక సంఘం బృంద సభ్యులు ఆస్వాధించారు. చార్మినార్ వద్ద జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఇతర అధికారులతో కలిసి గ్రూఫ్ ఫోటోను దిగారు. దాదాపు 36 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనుల పురోగతి, ప్రణాళికలపై కమిషనర్ వారికి వివరించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 12 పురాతన క్లాక్‌టవర్లను పునరుద్దరించే పనులను చేపట్టామని తెలియజేశారు. అనంతరం ఈ బృందం ఫలక్‌నూమా ప్యాలెస్‌ను సందర్శించింది. ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటైన ఫలక్‌నూమా ప్యాలెస్‌ను 1884 లో వికార్ ఉల్ ఉమ్రా నిర్మించారని, ఫలక్‌నూమా అంటే ఆకాశ స్వర్గం అనే అర్థం వస్తుందని వారికి పర్యాటక శాఖ అధికారులు వివరించారు. 32 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్యాలెస్‌ను వికార్ ఉల్ ఉమ్రా 1897 లో 6వ నిజాంకు బహూకరించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఫలక్‌నుమా లో ఆర్థిక సంఘం ప్రతినిధి బృందానికి జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. 15వ ఆర్థిక సంఘం ఛైర్మెన్ ఎన్.కే. సింగ్ కు చార్మినార్ మెమెంటోను కమిషనర్ దానకిషోర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్, జీహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ శృతిఓజా, చార్మినార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, భారత పురాతత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment