బెంగళూర్, ఫిబ్రవరి 15 (way2newstv.in)
అతడు కర్ణాటకలో అధికార పార్టీ జేడీఎస్ లీడర్. స్థానిక రైతు సంఘానికి అధ్యక్షుడు కూడా. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. అయితే పేకాట వ్యసనానికి బానిసై ఆర్థికంగా చితికిపోయాడు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు చోరీల బాట పట్టాడు. అక్రమార్జన కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. వ్యసనాలు జీవితాన్ని ఎలా చిధ్రం చేస్తాయో ఓ ఉదాహరణగా మిగిలిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా అఫ్జల్‌పూర్ తాలూకా బెలుర్గికి చెందిన కాశీనాథ్ గైక్వాడ్ అలియాస్ కాశప్ప స్థానికంగా తన బంధువుతో లేడీస్ ఎంపోరియం పెట్టించి నడిపిస్తున్నాడు. పేకాటకు బానిసైన అతడు వ్యాపారంలో వచ్చిన లాభాలను కూడా అందులో నష్టపోయాడు.
తెలంగాణలో దొంగ...కర్ణాటకలో జేడీఎస్ లీడర్
గాజుల, అలంకరణ వస్తువుల కోనుగోలు కోసం తరచూ చార్మినార్ ప్రాంతానికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఇక్కడ చోరీలు చేయాలనే ఆలోచన వచ్చింది. చోరీకి వచ్చేటప్పుడు పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే పెట్టి, అఫ్జల్‌పూర్‌లో బస్సెక్కి తెల్లారేసరికి హైదరాబాద్ వచ్చేవాడు. పగటిపూట ఆటోల్లో సంచరిస్తూ కాలనీల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. దొంగతనం చేశాక అదే రోజు రాత్రి బస్సెక్కి తిరిగి అఫ్జల్‌పూర్ వెళ్లిపోయేవాడు. అలా గత ఏడాది అక్టోబర్ నుంచి అయిదు నెలల్లో మియాపూర్ పరిధిలో 6, రాజేంద్రనగర్‌లో 5, నార్సింగి, ఉప్పల్‌లలో 2 చొప్పున చోరీలకు, బాచుపల్లిలో ఒక చోరీకి పాల్పడ్డాడు. దొంగిలించిన నగలను అఫ్జల్‌పూర్‌లోని నగలవ్యాపారి కాలాసింగ్‌కు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. నగరంలోని అనేక ప్రాంతాల్లో వరుస చోరీ కేసులు నమోదైన నేపథ్యంలో సైబరాబాద్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, చంద్రబాబు, ఎస్సై మురళి, మియాపూర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్, డీఐ మహేశ్‌తో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. చోరీలు జరిగిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను సేకరించి అనుమానితుడి చిత్రాలను సేకరించాయి. గైక్వాడ్‌పై గతంలో ఎలాంటి దొంగతనం కేసులూ లేకపోవడంతో దర్యాప్తు కష్టతరంగా మారింది. ఓ పెట్టీ కేసులో గైక్వాడ్‌ను అఫ్జల్‌పూర్ పోలీసులు గుల్బర్గా జైలుకు పంపించారు. సీసీ ఫుటేజీలను చూసిన ఓ పోలీస్ ఇన్ఫార్మర్ గైక్వాడ్‌ను గుర్తించి, కీలక సమాచారం అందించడంతో దర్యాప్తు మలుపు తిరిగింది. సీసీఎస్ బృందాలు అఫ్జల్‌పూర్ వెళ్లి విచారించాయి. గైక్వాడ్ బుకాయించినా.. సాక్ష్యాలను అతడి ముందుంచడంతో నేరాల్ని అంగీకరించాడు. పరారీలో ఉన్న వ్యాపారి కాలాసింగ్ కోసం గాలిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కాశీనాథ్ 16 చోరీలు చేసినట్లు తేలింది. గురువారం అతడిని అరెస్ట్ చేసి 540 గ్రాముల బంగారు ఆభరణాల్ని, భారీగా వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
No comments:
Post a Comment