Breaking News

14/02/2019

ముందుకు పడని రీజనల్ రోడ్డు వ్యవహారం

మెదక్, ఫిబ్రవరి 14, (way2newstv.in)
రీజినల్ రింగు రోడ్డుకు ఆలోచన చేసి ప్రధానికి వివరించి కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ నుంచి సూత్రప్రాయ అనుమతి పొందినప్పటికీ అధికారులు రకరకాల సందేహాల పేరుతో కొర్రీలు పెట్టడంతో ప్రారంభం కావడానికి కొంత జాప్యం జరిగే అవకాశం ఏర్పడింది. ఈ నెలాఖరుకల్లా సాధారణ ఎన్నికల షెడ్యూలు విడుదల కానుండడంతో ఇంత స్వల్ప వ్యవధిలో కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి లిఖితపూర్వక అనుమతి లభించడం కష్టంగా మారింది. ముఖ్యమంత్రి కెసిఆర్ గతేడాది డిసెంబరు చివరి వారంలో ఢిల్లీ వెళ్ళి స్వయంగా ప్రధానిని కలిసి రీజినల్ రింగు రోడ్డు గురించి వివరించి ఒక విజ్ఞాపనపత్రాన్ని సమర్పించారు. 


ముందుకు పడని రీజనల్ రోడ్డు వ్యవహారం

ఆ తర్వాత కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసి వివరించారు. అప్పుడే సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. దానికి కొనసాగింపుగా గత నెల చివరి వారంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సహా పలువురు ఇంజనీర్లు ఢిల్లీ వెళ్ళి కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి, జాతీయ రహదారుల అథారిటీ డైరెక్టర్ జనరల్‌తో భేటీ అయ్యారు.రీజినల్ రింగు రోడ్డుకు సంబంధించిన పూర్తి వివరాలను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను చూపించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 12 వేల కోట్లు అవుతున్నప్పటికీ ఇందులో సుమారు రూ. 3 వేల కోట్లు భూ సేకరణకే ఖర్చవుతుందని వివరించి ఇందులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని దాదాపు సగం ప్రాంతాన్ని కలిపేలా అరవై మీటర్ల వెడల్పులో (ఆరు లైన్లు) 362 కి.మీ. మేర రీజినల్ రింగు రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. టిఆర్‌ఎస్ ఎంపిలంతా శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా డిసెంబరు 22న కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి, జాతీయ రహదారుల అథారిటీ డైరెక్టర్ జనరల్‌తో సమావేశమై ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను సమర్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ఎక్స్‌ప్రెస్ వే తరహాలో దీన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అయితే గత నెల చివర్లో జరిగిన సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను పలు అంశాలపై నిలదీయడంతో పాటు ఎక్స్‌ప్రెస్ వే కు ఉండాల్సిన నిబంధనలను ప్రస్తావించి రీజినల్ రింగు రోడ్డు అలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు చేయాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. పైగా త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌ను బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందున నిధుల్ని విడుదల చేయడంలో సమస్యలు ఉత్పన్నం కావచ్చని సూచనప్రాయంగా తెలిపినట్లు సమాచారం.ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించిన తర్వాతనే నిధుల విడుదలపై స్పష్టత వస్తుందని సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర అవసరాలకు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో కేంద్రంలో ఒత్తిడి పెంచే తీరులో టిఆర్‌ఎస్ తెలంగాణలో ఎక్కువ స్థానాలను గెల్చుకోవడం, ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్ళి సంప్రదింపుల ద్వారా మరింత ఒత్తిడి పెంచితే తప్ప నిధుల విడుదలకు మార్గం సుగమం కాదని టిఆర్‌ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులను కలుపుతూ రీజినల్ రింగు రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేసినా అలైన్‌మెంట్‌లో మార్పులపై కేంద్ర అధికారులు వత్తిడి తీసుకురావడం వెనక అసలు ఉద్దేశం నిధుల విడుదలలో జరగనున్న జాప్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సూత్రప్రాయంగా అనుమతి లభించినందున వీలైనంత త్వరగా పనులు ప్రారంభమవుతాయని నమ్మకం పెట్టుకున్న అధికారులను గత నెల చివరి వారంలో జరిగిన సమావేశంలో కేంద్ర అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఈ ప్రక్రియలో నాలుగైదు నెలల జాప్యం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments:

Post a Comment