లక్నో, ఫిబ్రవరి 27, (way2newstv.in)
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మహాకూటమిని అస్సలు పట్టించుకోనట్లే కన్పిస్తోంది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలసి అనేక పార్టీలు కూటమిగా ఏర్పడాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. తనకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన శత్రువని తెలిసినా… ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మోదీని గద్దె దింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ తో కలసి పనిచేసేందుకు సిద్ధమయిపోతున్నారు. కానీ మాయావతి మాత్రం తన దారి రహదారి అని చెప్పకనే చెబుతున్నారు.మాయావతి కాంగ్రెస్ ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆమె మాటల్లో కూడా కాంగ్రెస్, బీజేపీని ఒక గాటన కట్టేసేలా ఉంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు 70కి పైగా స్థానాలను దక్కించుకోగలిగితే ప్రధాని పీఠం తనదే నన్న ధీమాతో మాయావతి ఉన్నారు.
మహాకూటమిని పట్టించుకోని మాయావతి
అందుకే కుదేలైపోయిన కాంగ్రెస్ ను ఏమాత్రం కేర్ చేయడం లేదు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ను పక్కనపెట్టి బీఎస్పీ, ఎస్పీలు పొత్తులు కుదుర్చుకున్నాయి. ముష్టి విదిల్చినట్లు రెండు సీట్లు మాత్రం కాంగ్రెస్ కు వదిలేసింది.ఇక తాజాగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ లోనూ మాయావతి తనదైన శైలిలో కాంగ్రెస్ ను పక్కన పెట్టేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో కాకుండా ఎస్పీ, బీఎస్పీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్, టికమ్ గర్హ్, ఖజరహో స్థానాలు, ఉత్తరాఖండ్ లోని గద్వాల్ స్థానాలను సమాజ్ వాదీ పార్టీకి కేటాయించారు. మిగిలిన అన్ని స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉండనున్నట్లు మాయావతి స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ కంగుతినాల్సి వచ్చింది.మధ్యప్రదేశ్ లో బీజేపీ బలంగా ఉంది. అక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బొటాబొటీగా గట్టెక్కింది. మధ్యప్రదేశ్ లోని 29 స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉండటం కమలం పార్టీకి కలసి వస్తుందన్న అంచనాలు వినపడుతున్నాయి. ఇక బీహార్ లోనూ మాయావతి ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. బీహార్ లో 40 స్థానాల్లోనూ బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయనుండటంతో కాంగ్రెస్ కూటమికి ఇబ్బందులు తప్పవంటున్నారు. మాయావతి మొత్తం మీద కాంగ్రెస్ ను ఏమాత్రం ఖాతరు చేయకుండా తన దారిన తాను వెళుతున్నారు
No comments:
Post a Comment