Breaking News

27/02/2019

ఎంపీ పోటీకి దూరమంటున్న కాంగ్రెస్ సీనియర్లు

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 27, (way2newstv.in)
అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ కు త్వరలో మరో పరీక్ష ముంచుకోస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యం పెట్టుకున్న పార్టీకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ పార్టీ తరపున పోటీ చేసుందుకు పలు స్థానాల్లో అభ్యర్థులు దొరకడం లేదు. హేమాహేమీలుగా చెప్పుకునే నేతలు సైతం పోటీకి వెనుకంజ వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా చూసిన వారు ఎంపీగా పోటీ చేస్తే ఉన్న ఇజ్జత్ పోతుందని భావిస్తున్నారు. గెలిచే అవకాశాలు లేని చోట పోటీ చేయమని చెప్పేస్తున్నారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. అయితే, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ సీట్ల విషయంలో ఆసక్తికర చర్చ జరిగింది. అదును చూసి డీకే అరుణ సీనియర్ నేతలను, పార్టీ పెద్దల వైఖరిని తూర్పారబట్టారు. మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని పార్టీ పెద్దలు డీకే అరుణను కోరారు. 


ఎంపీ పోటీకి దూరమంటున్న కాంగ్రెస్ సీనియర్లు


అయితే, జైపాల్ రెడ్డి వంటి సీనియర్ ఉన్నాక తాను పోటీచేయడం ఏంటని, ఆయనే పోటీ చేయాలని ఆయన పేరు ప్రతిపాదించారు. అయితే, జైపాల్ రెడ్డి పోటీకి ఆసక్తిగా లేరని, మీరే పోటీ చేయాలని ఉత్తమ్ చెప్పారు. దీనికి డీకే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు పోటీ చేసి పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు పోటీ చేయనంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు. ఎంపీగా పోటీ చేయని వారు అనుచరులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఎందుకు ఇప్పించుకున్నారని ఆమె ప్రశ్నించారు. ఇక, నాగర్ కర్నూల్ సీటును ఓ జూనియర్ నేతకు ఇవ్వాలని డీకే అరుణ ప్రతిపాదించారు. అర్హతలు, గెలుపు అవకాశాలు ఉన్న వారి పేర్లు చెప్పాలని ఉత్తమ్ బదులిచ్చారు. అయితే, కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు, కొత్త ఎమ్మెల్యేకు పార్టీలో పెద్ద పదవులు ఇవ్వలేదా అని ఆమె పరోక్షంగా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయనను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించేందుకు ప్రతిపాదించిన వారికి కూడా ఆమె చురకలంటించారు.ఎంపీ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ నుంచి పోటీకి కూడా ఎవరూ మొగ్గు చూపడం లేదు. మాజీ ఎంపీ మధు యాష్కి ఇక్కడి నుంచి పోటీ చేయాల్సి ఉన్నా ఆయన భువనగిరి నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. నిజామాబాద్ లో గెలుపు అవకాశాలు లేనందున భువనగిరి అయితే గెలిచే ఛాన్స్ ఉన్నందున ఆయన ఈ సీటును ఎంచుకున్నారని తెలుస్తోంది. కానీ, కొందరు నేతలు ఆయనను నిజామాబాద్ నుంచే పోటీ చేయాలని కోరుతున్నారు. ఇలా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, నిజామాబాద్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక, కొద్దిగా కష్టపడితే గెలవవచ్చు అనుకున్న స్థానాల్లో మాత్రం పోటీ ఎక్కువగా ఉంది.

No comments:

Post a Comment