Breaking News

27/02/2019

అందిరి చూపు... తూర్పు వైపు

కాకినాడ, ఫిబ్రవరి 27, (way2newstv.in)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లాలపైనే ప్రత్యేక దృష్టి సారించింది. తూర్పు గోదావరి జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగలిగితే అమరావతి దక్కినట్లేనన్నది ఆ పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. వైసీపీ అధినేత జగన్మోమన్ రెడ్డి తూర్పుగోదావరిజిల్లా లో పోటీ చేసే అభ్యర్థులపై ఇప్పటికే కసరత్తులు ప్రాంరభించారు. తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస పార్టీ కేవలం ఐదు స్థానాలను మాత్రమే దక్కించుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఎవరికి మెజారిటీ వస్తే ఆ పార్టీకే సీఎం పీఠం దక్కుతుందన్నది నానుడిగా మారింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాపై పూర్తి స్థాయిలో కసరత్తులు ప్రారంభించింది.నిజానికి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో కాంగ్రెస్ కు గట్టి పట్టుండేది. వైఎస్ హయాంలో కూడా ఈ జిల్లా పార్టీని ఆదుకుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలనేపథ్యంలో తమకు ఎడ్జ్ ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. 


అందిరి చూపు... తూర్పు వైపు

కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ జిల్లాలో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఎంత ఎక్కువ ఓట్లు చీల్చ గలిగితే అది తమకు అంత లాభమన్న విశ్లేషణలు ఆ పార్టీ నేతల నుంచి విన్పిస్తున్నాయి. మిగిలిన సామాజిక వర్గాలు తమకు అండగా ఉంటాయని బలంగా విశ్వసిస్తున్నారు. కాపు సామాజిక వర్గం నేతలనే బరిలో ఉంచనుండటంతో ఆ ఓట్లు కూడా తమ ఖాతాలో పడి గెలుపు అవకాశాలు అధికమవుతాయని భావిస్తున్నారు.గత ఎన్నికల్లో గెలుపొందిన పత్తిపాడు, తుని, జగ్గంపేట స్థానాలను ఈసారి తిరిగి కైవసం చేసుకుంటామన్న ధీమాలో వైసీపీ ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో పత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచినా పార్టీ మారడంతో అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ మారిన వారే తిరిగి టీడీపీ అభ్యర్థులుగా పోటీచేస్తుండటంతో తమ అవకాశాలు మెరుగుపడతాయంటున్నారు. వారిపైన ఉన్న వ్యతిరేకతతో పాటు జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కూడా మంచి మైలేజీని తెచ్చిందంటున్నారు. ఇక తుని నియోజకవర్గం నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో విజయం సాధించిన దాడిశెట్టిరాజా తిరిగి పోటీ చేసే అవకాశాలున్నాయి.హోంమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దవులూరి దొరబాబును వైసీపీ రంగంలోకి తీసుకొచ్చింది. ఆయన రాకతో పార్టీకి నియోజకవర్గంలో ఊపు వచ్చిందనే చెప్పాలి. కాకినాడ రూరల్ లో వైసీపీ అభ్యర్థి కన్న బాబు బలంగా ఉన్నారు. పిఠాపురం టిక్కెట్ పెండెం దొరబాబుకు మరోసారి ఇస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. కాకినాడ టౌన్ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బలమైన అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అనపర్తి టిక్కెట్ ను మరోసారి గత ఎన్నికల్లో ఓటమిపాలయిన డాక్టర్ సూర్యనారాయణరెడ్డికి ఇస్తేనే సానుభూతితో గెలవవచ్చన్న అంచనాలో పార్టీ ఉంది.రాజానగరం నియోజకవర్గం నుంచి జక్కం పూడి రాజా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఆకుల వీర్రాజు పోటీ చేస్తారన్న టాక్ విన్పిస్తోంది. ఇక రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ నేత చెల్లుబోయిన వేణుకు టిక్కెట్ ఖరారయ్యే అవకాశాలున్నాియ మండపేట నుంచి ఒక ప్రముఖ వైద్యుడిని రంగంలోకి దించే ఆలోచనలో వైసీపీ ఉంది. కొత్తపేట నుంచి జగ్గిరెడ్డికే మళ్లీ టిక్కెట్. ముమ్మడివరం నియోజకవర్గంనుంచి పొన్నాడ సతీష్, అమలాపురం నుంచి పినిపి విశ్వరూప్ లే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పాత అభ్యర్థులకు టిక్కెట్ దక్కకపోవచ్చంటున్నారు. రంపచోడవరం నుంచి టీచర్ గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నాగులపల్లి ధనలక్ష్మికి టిక్కెట్ వచ్చే అవకాశాలున్నాయి. మొత్తం మీద వైసీపీ గత ఎన్నికల్లో ఐదు సీట్లు గెలిస్తే అంతకు మూడింతల సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి

No comments:

Post a Comment