చెన్నై, ఆగస్గు 9, (way2newstv.in)
డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో తమిళనాడు రాజకీయాలు, ముఖ్యంగా ఆ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడే అవకాశముంది. కరుణానిధి జీవించి ఉన్నంత వరకూ ఆయనే పార్టీ అధ్యక్షుడు. ఆయన మాటే శిలాశాసనం. ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. కొన్నేళ్లుగా వీల్ ఛైర్ కే పరిమితమయినా, కరుణానిధి మాత్రం రాజకీయాలను తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు. డీఎంకే లో కూడా ఎలాంటి వర్గ పోరు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకునే వారు. అయితే గత రెండేళ్లుగా అస్వస్థతతో ఉన్నకరుణానిధి డీఎంకే పగ్గాలు ఒకరకంగా తన ముద్దుల తనయుడు స్టాలిన్ కు అప్పగించారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశారు. అయితే ఈ రెండేళ్ల నుంచి కూడా పెద్దాయనకు చెప్పకుండా స్టాలిన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.అయితే కరుణ శకం ముగియడంతో డీఎంకే అధ్యక్షుడు ఎవరు? అన్నది చర్చనీయాంశంగా మారింది. పెద్దకుమారుడు ఆళగిరి కరుణ ఎదుటే కాలెరగరేయడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం ఆళగిరి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
డీఎంకే పార్టీలో సన్ స్ట్రోక్
కరుణ మరణంతో ఆళగిరి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ముందుకు వచ్చే వీలుంది. ఆళగిరి కొంత దూకుడు స్వభావి. మంచి వక్త. అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి. స్టాలిన్ గతంలో తీసుకున్న నిర్ణయాలు కొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయంటున్నారు. స్టాలిన్ కు పార్టీని నడపగల సమర్థత లేదన్నది డీఎంకేలోని కొందరి వాదనగా విన్పిస్తోంది. కరుణానిధి జీవించి ఉన్నప్పుడే స్టాలిన్ ను తన వారసుడిగా ప్రకటించారు. దీంతో స్టాలిన్ కే పార్టీ పగ్గాలు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలు, కార్యవర్గంతో స్టాలిన్ సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ను ప్రకటించడానికి ఆయన వర్గం అన్నీ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఆళగిరి కూడా పార్టీని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారంటున్నారు. కరుణ జీవించి ఉన్నప్పుడే పార్టీలో కొందరు ఆళగిరికి మద్దతును పరోక్షంగా పలికారు. ఇప్పుడు వారంతా ఆళగిరిని అధ్యక్షుడిగా చేయాలన్న వాదనను తెరపైకి తెస్తారంటున్నారు.తమిళనాడులో జయలలిత మరణం తర్వాత కూడా అన్నాడీఎంకే చీలికలు, పీలికలైనసంగతి తెలిసిందే. అధికారంకోసం శశికళ, పన్నీర్ సెల్వం రెండు గ్రూపులుగా విడిపోయారు. చివరకు పళనిస్వామి కూడా శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి గెంటేశారు. ఇప్పుడు కరుణానిధిలేని డీఎంకేలో సయితం వారసత్వ పోరు ఖచ్చితంగా తలెత్తుతుందని చెబుతున్నారు. స్టాలిన్ కు కుటుంబ సభ్యుల మద్దతు ఎక్కువగా ఉంది. సోదరి కనిమొళితో పాటు మారన్ సోదరులు కూడా స్టాలిన్ కు అండగా ఉన్నారు. త్వరలో జరగనున్న డీఎంకే కార్యవర్గ సమావేశం డీఎంకే అధ్యక్షుడెవరో నిర్ణయించనుంది.కరుణ బతికున్న సమయంలోనే డీఎంకే చీలింది. తొలుత ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి విడిపోయి అన్నాడీఎంకే పార్టీని స్థాపిస్తే, 1994లో డీఎంకేలో సీనియర్ నేతగా ఉన్న వైగో కరుణానిధితో విభేదించి ఎండీఎంకే పార్టీని స్థాపించారు. కరుణ బతికున్న సమయంలోనే పార్టీ రెండుగా చీలిన విషయాలను ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. కరుణ మరణించిన తర్వాత ఆళగిరి రూపంలో ఆ పార్టీకి ప్రమాదముందన్న సంకేతాలు స్టాలిన్ కు కూడా లేకపోలేదు. మరిపార్టీలో చీలిక ఏర్పడకుండా, సోదరుడికి స్టాలిన్ ఎలా నచ్చచెబుతారో చూడాలి.
No comments:
Post a Comment