విజయవాడ, జూలై 14 (way2newstv.in)
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్త్తుడు. అయితే ఆయన తనయుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి శత్రువనే చెప్పాలి. జగన్ కాంగ్రెస్ పార్టీ ని వీడేంత వరకూ కిరణ్ నిద్రపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి రావడమే అప్పట్లో అందరికీ ఆశ్చర్యం కల్గించింది. కిరణ్ కు టెన్ జన్ పథ్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. అప్పటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పక్కా లాబీయింగ్ తో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించగలిగారు. జగన్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికైనా తనకు ప్రధాన ప్రత్యర్థిగా మారతారని భావించిన కిరణ్ తెలివిగా ఢిల్లీలో చక్రం తిప్పి జగన్ ఓదార్పు యాత్రలకు అడ్డుకట్ట వేయగలిగారు. దీంతో జగన్ సొంత పార్టీ పెట్టుకుని వెళ్లిపోయారు.ఇప్పుడు తాజాగా మరోసారి జగన్ ను దెబ్బతీసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నది పార్టీ వర్గాల్లో విన్పిస్తున్న మాట.
నల్లారి కిరణ్ దెబ్బ ఎవరికి....?
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ కు, కిరణ్ కు మధ్య పొరపొచ్చాలు తలెత్తాయని, అదీ చిత్తూరు జిల్లా నేత పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి విషయంలోనే విభేదాలు తలెత్తాయని పార్టీలో అందరూ అంగీకరిస్తున్న విషయమే. తనకు, తన కుటుంబానికి ప్రధాన ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రిని చేయాలని జగన్ సిఫార్సు చేశారని కిరణ్ మనస్సులో పెట్టుకున్నారన్నది వాస్తవం. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవిశ్వాసం పెడితే…తెలుగుదేశం మద్దతివ్వడాన్ని కూడా ఈ సందర్భంగా కొందరు ఉదహరిస్తున్నారు.అయితే కాంగ్రెస్ లో కిరణ్ చేరిందీ జగన్ ఓటు బ్యాంకును చీల్చడానికేనన్నది ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ప్రస్తుతం ఓటు బ్యాంకు అంటూ ఏమీ లేదు. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి తరలి పోయింది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనీస స్థానాలను కూడా సాధించలేదన్నది అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నేటికీ దోషిగానే చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించి ఒక సామాజిక వర్గం ఓట్లను చీల్చడమే వ్యూహంగా కన్పిస్తుందంటున్నారు.ఇది ఒకరకంగా తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహకరించడమేనన్నది పార్టీలోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. విభజన జరగకుండా అడ్డుకోలేక, విఫలమైన నాయకులు ఇప్పుడు పార్టీలో చేరినా పెద్దగా ప్రయోజనం లేదన్నది అందరికీ తెలిసినా కొద్ది ఓట్లను చీల్చైనా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడాలన్నది నల్లారి ప్లాన్ గా కొందరు చెబుతున్నారు. జగన్ పై కసి తీర్చుకోవడానికే నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారని వైసీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాని కిరణ్ మాటలను ప్రజలు పెద్దగా పట్టించుకోరన్న విషయం ఢిల్లీ పెద్దలకు తెలియకపోవడం విచారకరమని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద జగన్ ఓటు బ్యాంకుకు గండికొట్టాలన్న ఏకైక లక్ష్యంతోనే కిరణ్ కాంగ్రెస్ లో చేరినట్లు చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.
No comments:
Post a Comment