Breaking News

14/07/2018

ఆగస్టు 15 నుంచి ఆట మొదలు

హైద్రాబాద్, జూలై 14 (way2newstv.in)
తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు కేసీఆర్ వ్యూహరచన సాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణను ఆగస్టు 15 నాటికి ఖరారు చేయబోతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పడనున్న అభ్యర్థుల జాబితా, ఆయా నియోజకవర్గాల్లో అమలు చేయనున్న ప్రచార ప్రణాళిక వరకూ అన్ని విషయాల్లోనూ తుది కసరత్తు సాగుతోంది. ఆ తర్వాత అన్ని విషయాల్లోనూ క్యాడర్ కు, లీడర్లకు స్పష్టతనిచ్చేందుకు అధినేత సిద్ధమవుతున్నారు. అభ్యర్థిత్వాలు మొదలు నిధుల సర్దుబాటు వరకూ అనేక సందేహాలు స్థానిక నాయకులను వెన్నాడుతున్నాయి. తమకే ఈసారి కూడా సీటు ఖాయమంటూ ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ లోలోపల అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. 2014లో పార్టీ గాలి లో అనామకులు సైతం గెలుపు బావుటా ఎగరవేశారు. అప్పట్లో టీఆర్ఎస్ అభ్యర్థిత్వాలకు అంత పోటీ లేదు. ఆగస్టు 15 నుంచి ఆట మొదలు

ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కావడానికి తోడు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా భావించడంతో ప్రతి నియోజకవర్గంలో నలుగురైదుగురు శాసనసభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. ఎన్నికలకు కనీసం ఆరునెలల ముందుగా అభ్యర్థులను ఖరారు చేయాలని కేసీఆర్ భావించారు. కానీ ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాలున్నాయి. దీంతో ఆగస్టు లో టిక్కెట్లు ఖరారు చేస్తే నాలుగు నెలలు మాత్రమే అభ్యర్థికి వ్యవధి చిక్కుతుంది.టీఆర్ఎస్ ఇప్పటికే కిక్కిరిసిన బస్సు. చోటు తక్కువగా ఉంది. అందులో ఎక్కిన ప్రతి వారూ సీటు కావాలనుకుంటున్నారు. 2014లో నెగ్గిన వారికే మొదటి ప్రాధాన్యత. అయితే పనితీరు బాగాలేక, ప్రజలకు దూరమైన వారిని పక్కకు తప్పించకతప్పదు. పార్టీ ఇమేజ్, కేసీఆర్ ఇమేజ్ చాలావరకూ నియోజకవర్గాల్లో గెలుపును ప్రభావితం చేస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చోట్ల మాత్రం గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అందులోనూ ప్రత్యర్థి కాంగ్రెసు అటువంటి చోట్ల బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే విజయం అంత సులభం కాదు.’ స్థూలంగా టీఆర్ఎస్ అధినాయకత్వం ఆలోచన ఇది. దీనికి ప్రత్యామ్నాయ ప్రణాళిక తయారు చేయాలనే యోచనలో ఉన్నారు కేసీఆర్. పార్టీ ప్రాబల్యానికి అభ్యర్థుల పరపతి తోడైతే గెలుపునకు ఢోకా ఉండదు. అందువల్ల అవసరమైతే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టి మంచి అభ్యర్థులకు టిక్కెట్లు ఇద్దామని ఇప్పటికే ఆయన తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం అటువంటి అభ్యర్థుల జాతకాలు తీసే పనిలో ఉన్నారు. ప్రజల్లో పలుకుబడి కలిగిన ఇతరపార్టీల నాయకుల వివరాలు సేకరిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్చాల్సి వస్తే ఎవరూ తోసిపుచ్చలేని ప్రజాదరణ ఉన్న నాయకులనే వారి స్థానంలో అభ్యర్థులుగా నిలుపుతామని టీఆర్ఎస్ ఢంకా బజాయిస్తోంది. కచ్చితంగా అభ్యర్థుల మార్పు ఉంటుందనే సంకేతాలు అందిస్తోంది.మూడు పార్టీలు మినహా 2019 ఎన్నికల్లో మిగిలిన పార్టీలన్నీ చాపచుట్టేస్తాయన్న అంచనాలో ఉంది టీఆర్ఎస్. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్, 12 నియోజకవర్గాల్లో కాంగ్రెసు, పాతబస్తీలో ఎంఐఎం గెలుపు సాధిస్తాయి. బీజేపీ, సహా మిగిలిన పార్టీలన్నీ ఓట్లు సాధించగలుగుతాయే తప్ప సీట్లు గెలుచుకొనేంత బలం లేదని అధికార పార్టీ అగ్రనేత ఊహిస్తున్నారు. వామపక్షాలు ఖమ్మం, నల్గొండల్లోని కొన్ని పాకెట్లకే పరిమితమవుతాయని సర్వేల్లో నిర్ధారించుకున్నారు. వాటికి ఈ దఫా ఒక్కసీటు దక్కదనేది టీఆర్ఎస్ నిశ్చితాభిప్రాయం. బీజేపీ హైదరాబాదులోనూ, చుట్టు పక్కల నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు దక్కించుకోగలుగుతుందని, ఎమ్మెల్యేలుగా గెలిచేంత బలాన్ని ఆపార్టీ సంతరించుకోలేదని కేసీఆర్ కొందరు ముఖ్యులతో ప్రస్తావించినట్లు సమాచారం. పాతబస్తీని చేర్చి ఉన్న ఒకటిరెండు నియోజకవర్గాల్లో బలమైన ప్రచారం చేసుకుంటే గట్టిపోటీని ఇవ్వగలుగుతుందంటున్నారు. ఎంఐఎం పట్టు తప్పితే, కాంగ్రెసు బలహీనపడితే ఒక నియోజకవర్గంలో మాత్రం బీజేపీకి చాన్సు ఉన్నట్లుగా అధికారపార్టీ సర్వే సారాంశం. టీడీపీ, వైసీపీ వంటి పార్టీల ఖాతా జీరో అని తేల్చేస్తున్నారు. గడచిన అసెంబ్లీలో ఎనిమిది పార్టీలు ప్రాతినిధ్యం వహించాయి. ఈసారి ఈ సంఖ్య సగానికి కుదించుకుపోతుందని టీఆర్ఎస్ బలమైన నమ్మకంతో ఉంది.రాజకీయాల నిర్వహణ, పరిపాలనలో అధికార పార్టీ ఎంతగా తనమాట నెగ్గించుకుంటున్నప్పటికీ ఇంకా కొన్ని బలహీనతలు వెన్నాడుతున్నాయి. టీఆర్ఎస్ కంటే స్ట్రాంగ్ లీడర్లు ప్రతిపక్షాల్లోనే ఉన్నారు. నియోజకవర్గాలను వారు శాసించగలస్థాయిలో ఉన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ , రేవంత్, జీవన్ రెడ్డి, మల్లుభట్టివిక్రమార్క, కోమటిరెడ్డి, డీకే అరుణ వంటి వారి బలం చెక్కు చెదరలేదని టీఆర్ఎస్ సర్వేల్లో సైతం వెల్లడైంది. వీరంతా వీలు దొరికినప్పుడల్లా అధికారపార్టీని ఎండగడుతున్నారు. వారి మాటలకు మీడియా సైతం ప్రాధాన్యమిస్తోంది. శాసనసభలోనూ అడ్డుతగులుతున్నారు. ప్రజల్లోనూ టీఆర్ఎస్ పలుకుబడిని దెబ్బతీస్తున్నారు. వీరిని కేసీఆర్ పెద్ద తలనొప్పిగానే భావిస్తున్నట్లు సమాచారం. వీరికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేయాలని హరీశ్ రావు, కేటీఆర్ లకు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. ఆయా నాయకుల వద్ద ఉన్న క్యాడర్ మొత్తాన్ని టీఆర్ఎస్ వైపు ఆకర్షించేలా ప్లాన్ వేస్తున్నారు. అవసరమైతే కాంగ్రెసు సీనియర్ నేతల వద్ద ద్వితీయశ్రేణి నాయకులుగా మిగిలిపోతున్న వారికి సర్కారీ పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా నియోజకవర్గాల్లో కాంగ్రెసు ఎమ్మెల్యేల ప్రాబల్యానికి దెబ్బ కొట్టాలనే దిశలో కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాంగ్రెసు నాయకత్వాన్ని ఎన్నికలకు ముందుగానే దెబ్బతీస్తే పార్టీ కోలుకోవడం కష్టమవుతుందని అంచనా వేస్తున్నారు

No comments:

Post a Comment