Breaking News

07/01/2020

గ్రామ ప్రగతి కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి: స్మిత సబర్వాల్‌

నిజామాబాద్‌ జనవరి 7(way2newstv.in)
 గ్రామ అభివృద్ధి ఆ గ్రామ ప్రజల చేతుల్లోనే ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ గ్రామ ప్రగతి కోసం పని చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి (సీఎంవో) స్మిత సబర్వాల్‌ పిలుపునిచ్చారు. ప్రజల సహకారం ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవచ్చని తెలిపారు. ప్రజా ప్రతినిధులు నిత్యం గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు. సర్పంచ్‌ల పనితీరు బాగలేక పోతే పదవులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి స్మిత సోమవారం జిల్లాలో పర్యటించారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి, ఆర్మూర్‌ మండలం గోవింద్‌పేట్, బాల్కొండ మండలం బుస్సాపూర్‌లో ‘పల్లెప్రగతి’ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో గ్రామస్తులతో మాట్లాడారు. 
గ్రామ ప్రగతి కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి: స్మిత సబర్వాల్‌

30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనుల వివరాల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో చేపట్టిన పనులు నిజమా.. కాదా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, హరితహారం, మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. చంద్రాయన్‌పల్లిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.  ప్రభుత్వం చెప్పినా, చెప్పకపోయినా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన భాధ్యత ప్రజలపై ఉందని స్మిత పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినపుడే కాకుండా ఎల్లప్పుడూ  గ్రామాలను పరిశుభ్రంగా  ఉంచుకునేలా అలవాటు చేసుకోవాలని  సూచించారు. నిధుల లభ్యత ఆధారంగా గ్రామ పంచాయతీ అధికారులు సంవత్సర ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలని, గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలను జీపీ కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. శిథిలావస్థకు చేరిన రోడ్లపై స్థానికులు అడిగిన ప్రశ్నలకు స్మిత బదులిస్తూ.. మిషన్‌ భగీరథ ద్వారారక్షిత జలాలు వంద శాతం ప్రజలకు చేరిన అనంతరం గ్రామాల్లోని అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment