Breaking News

20/01/2020

ఏపీలో చేతులెత్తేసిన కాంగ్రెస్

విజయవాడ, జనవరి 20  (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పూర్తిగా చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నా ఆ పార్టీలో కదలిక లేకపోవడమే ఇందుకు కారణం. పైగా మూడు రాజధానుల ప్రతిపాదనపై కూడా కాంగ్రెస్ స్పందించలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు నాయకుడే లేకుండా పోవడంతో ఇక అక్కడక్కడ ఉన్న క్యాడర్ సయితం ఇతర పార్టీల వైపు చూస్తుందనే చెప్పాలి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా లేనట్లేనని చెప్పుకోవాలి.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రతిపాదన మంట రేపుతోంది. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ప్రతిపాదనకు అధికార ముద్ర వేసేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది. అయితే అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ తెలుగుదేశం, జనసేన, సీపీఐ, బీజేపీలు గట్టిగానే కోరుతున్నాయి. 
ఏపీలో చేతులెత్తేసిన కాంగ్రెస్

టీడీపీ ఈ విషయంలో ఒకడుగు ముందే ఉంది. బీజేపీ కూడా ఆందోళనకు సిద్ధమవుతుంది. అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఇంతవరకూ మూడు రాజధానుల ప్రతిపాదనపై పెదవి విప్పడం లేదు.అప్పుడప్పుడు టీవీల్లో ఆ పార్టీ నేత తులసీరెడ్డి చేస్తున్న కామెంట్స్ తప్ప కాంగ్రెస్ అధికారికంగా మూడు రాజధానుల ప్రతిపాదనపై స్పందించలేదు. రఘవీరారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా రాజీనామా చేయడం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్న ఉమెన్ చాందీ సయితం ఏపీని పట్టించుకోక పోవడంతో మూడు రాజధానుల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేదెవరు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టినా స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 70 శాతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్నట్లే లెక్క. అయితే కాంగ్రెస్ మాత్రం ఇందులో కూడా పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. నాయకుడు లేకపోవడం, క్యాడర్ కూడా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపడం లేదు. అసలు అభ్యర్థులు దొరికే అవకాశమే లేదు. అమరావతి నుంచి రాజధాని తరలింపు విషయంలో ఏదో ఒక స్టాండ్ తీసుకున్నా కాంగ్రెస్ కు కొన్ని ప్రాంతాల్లోనైనా బలం దొరికేది. కానీ కాంగ్రెస్ మౌనంతో రాష్ట్రంలో మరింత బలహీన పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ వేచిచూడాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సాకే శైలజానాధ్ ను పీసీపీ ప్రెసిడెంట్ గా నియమించడంతో పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది

No comments:

Post a Comment