లక్నో, జనవరి 20 (way2newstv.in)
ఇప్పుడేమీ ఎన్నికలు లేవు. అయినా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం ఒంటరిగా వెళ్లేందుకే సుముఖత చూపుతున్నారు. ఇప్పటికే పొత్తులతో క్యాడర్ ను చిత్తుచేసుకున్న మాయావతి ఇకపై ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతి పార్టీ బలంగా ఉన్నప్పటికీ మిగిలిన రాష్ట్రాల్లో సయితం అక్కడకక్కడా తన ఉనికిని కాపాడుకుంటోంది.రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక వంటి రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసిన మాయావతి పార్టీ అక్కడ శాసనసభలో తన పార్టీ ఎమ్మెల్యేలను పంపగలిగారు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రం పూర్తిగా నిలదొక్కుకోలేక పోతున్నారు.
మాయవతి ఒంటరే...
కాన్షీరామ్ పార్టీకి ఇచ్చిన ఓటు బ్యాంకును చెక్కు చెదరకుండా కాపాడుకోవాల్సిన మాయావతి మధ్యతో పొత్తులతో వెళ్లిన కారణంగా క్యాడర్ చెల్లా చెదురయిందన్న విషయాన్ని పార్టీ వర్గాలు సయితం అంగీకరిస్తున్నాయి.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బద్ధ శత్రువైన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం పార్టీ నేతలు చారిత్రాత్మక తప్పిదంగా ఇప్పటికీ చెబుతున్నారు. మరోవైపు కేంద్రంలో సయితం మాయావతి గతంలో తీసుకున్న స్టాండ్ ను తప్పుపడుతున్నారు. గతంలో మాయావతి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేవారు. బీజేపీని తూర్పార పట్టేవారు. కానీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతి పార్టీ ఓట్లకు కాంగ్రెస్ గండి కొట్టే పరిస్థితి ఏర్పడింది.దీంతో కాంగ్రెస్ ను కూడా ఈ మధ్య కాలంలో మాయావతి ప్రధాన శత్రువుగా చూస్తున్నారు. ప్రియాంక గాంధీ యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయని, దీనివల్ల దళిత, ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు మారిపోయే అవకాశముందని మాయావతి ఆందోళన చెందుతున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీలపై మాయావతి తరచూ విరుచుకుపడుతున్నారు. ఇటీవల జరిగిన ఆమె పుట్టినరోజు వేడుకల్లో కూడా ఇకపై ఒంటరిపోరాటమేనని ఆమె స్పష్టం చేసి క్యాడర్ లో జోష్ నింపారు మాయావతి.
No comments:
Post a Comment