Breaking News

08/01/2020

ఈ ఏడాది మరింత పెరగనున్న టెంపరేచర్

హైద్రాబాద్,జనవరి 8, (way2newstv.in)
మూడుదశాబ్దాల్లో తెలంగాణలో సగటు ఉష్ణోగ్రతలు మరో 1.5 డిగ్రీల వరకు పెరుగవచ్చని ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్, ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్  తాజాగా రూపొందించిన నివేదికలో వెల్లడించింది. సమీప భవిష్యత్‌లో నల్లగొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న క్ర మంలో తెలంగాణలో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు, మెరుపు వరదలు పెరిగే ప్రమాదముందని పేర్కొన్నది. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే నైరుతి, ఈ శాన్య రుతుపవనాలు క్రమం గా గతి తప్పుతున్నాయని.. వానకాలంలో నాలుగునెలల పాటు కురవాల్సిన వర్షాలు నాలుగు రోజుల్లోనే పడే ఆస్కారముంటుందని వెల్లడించింది. 1980వ సంవత్సరం నుంచి ఉష్ణోగ్రతలను, కాలాలను పరిగణలోకి తీసుకున్నది. రాష్ట్రంలో మొత్తంగా 0.4 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరిగిందని తెలిపింది. 
ఈ ఏడాది మరింత పెరగనున్న టెంపరేచర్

మార్పు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఈపీటీఆర్‌ఐ విశదీకరించింది. మెదక్ జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 31.9 నుంచి 34.1 డిగ్రీల సెల్సియస్‌కు, హైదరాబాద్‌లో 32.2 నుంచి 33.2 డిగ్రీలకు, మహబూబ్‌నగర్‌లో 33 నుంచి 33.9 డిగ్రీలకు, హన్మకొండలో 33.6 నుంచి 34.6 డిగ్రీలకు, నిజామాబాద్‌లో 33.4 నుంచి 34.6 డిగ్రీలకు పెరిగినట్టు తెలిపింది. నల్లగొండ, రామగుండంలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగత్రలు పెరిగాయని ఈపీటీఆర్‌ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎండాకాలంలో హన్మకొండ, రామగుండం, నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 డిగ్రీల వరకు పెరుగవచ్చని చెప్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో థర్మల్ పవర్‌ప్లాంట్ల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. సమీప భవిష్యత్‌లో నల్లగొండ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని తెలిపారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన తెలంగాణకు హరితహారం, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలను ఒక ఆశాకిరణంగా ఈపీటీఆర్‌ఐ పేర్కొన్నది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్యలతోపాటు సోలార్, విండ్‌పవర్ పూర్తిగా వినియోగంలోకి వచ్చి రవాణారంగంలో వాహన కాలుష్యాన్ని తగ్గించగలిగితే పగటి ఉష్ణోగ్రతలు పెరుగకపోవచ్చని అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2015 నుంచి 2016 మార్చి వరకు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై ఈపీటీఆర్‌ఐ అధ్యయనం చేసి ఈ మేరకు వివరాలు వెల్లడించింది. వాతావరణంలో వస్తున్న పెనుమార్పులను తట్టుకోవడానికి ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలి? పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి? పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా స్థిరమైన అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే అంశాలపై ఈపీటీఆర్‌ఐ తన నివేదికలో కొన్ని నిర్దిష్టమైన సూచనలను చేసింది. ప్రస్తుతం తెలంగాణలో వాతావరణ పరిస్థితుల్లో ప్రతికూల మార్పులు పెద్దగాలేవని, పర్యావరణ పరిస్థితులు క్షీణించి ఉన్న రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉన్నదని చెప్పింది. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ సూచన మేరకు ఈపీటీఆర్‌ఐ నాలుగేండ్లకు ఒకసారి నివేదికను రూపొందిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999, 2003, 2009లో అధ్యయనం చేసింది. తెలంగాణలో జరిపి మొదటి నివేదిక ఇది. రాష్ట్రంలోని పూర్వ నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అడవులు, పర్యావరణం, జీవవైవిధ్యం, నీటి వనరులు, సాగునీటి రంగం, వ్యవసాయరంగం దాని అనుబంధ రంగాలు, విద్యుత్, ఖనిజ వనరులు, పర్యావరణ కాలుష్యం, వేస్ట్ మేనేజ్‌మెంట్, పరిశ్రమలు ఇలా మొత్తం 17 రంగాల అభివృద్ధి, పర్యావరణంపై ప్రభావం అనే అంశాలను స్టేట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ రిపోర్ట్-2017లో గణాంకాలతోసహా పొందుపరిచారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని రాష్ట్రంలో కుండపోత వర్షాలు, మెరుపు వరదలు పెరిగే అవకాశమున్నది. గత కొన్నేండ్లుగా హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, రామగుండం, హన్మకొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఒకేరోజు 200 నుంచి 355 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసిందని శాస్త్రవేత్తలు ఉదాహరణగా పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కోయిడలో ఒకేరోజు అత్యధికంగా 675 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. నష్ట నివారణకు కొన్ని నిర్దిష్టమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. కుండపోత వర్షాలను తట్టుకునేలా వరద నీటి కాల్వలను నిర్మించడం, ఉన్న కాల్వల నిడివిని పెంచడం, చెరువులను తవ్వడంతోపాటు చెట్లను విరివిగా పెంచాలని చెప్పారు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను తవ్వడం, హరితహారం కింద కోట్ల సంఖ్యలో మొక్కలను నాటడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఈపీటీఆర్‌ఐ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

No comments:

Post a Comment