Breaking News

08/01/2020

హైద్రాబాద్ లో భారీగా కేన్సర్ కేసులు

హైద్రాబాద్, జనవరి 8, (way2newstv.in)
హైటెక్‌ నగరం రోగాల మయంగా మారుతోంది. నగరంలో చక్కెర వ్యాధితో పాటు గుండె జబ్బులు, బీపీ సహా వివిధ రకాల కేన్సర్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ నగరంలో తాజాగా నిర్వహించిన అధ్యయనంలోఈ విషయం తెలిసింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కేన్సర్‌ వ్యాధిగ్రస్తుల్లో మూడోవంతు రోగులు హైదరాబాద్‌ నగరంలోనే ఉండడం గమనార్హం. పెరుగుతున్న భూ, జల, వాయు కాలుష్యం, మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల కేన్సర్లు ప్రబలుతున్నాయి. మహిళల్లో బ్రెస్ట్‌ కేన్సర్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరో వైపు పాత నగరంలో టీబీ వ్యాధిగ్రస్తులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. 
హైద్రాబాద్ లో భారీగా కేన్సర్ కేసులు

ప్రతి నెలా ఆరు వందల నుంచి 700 వరకు టీబీ కేసులు నూతనంగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనంవెల్లడించింది. పాత నగరంలో జీవనశైలి జబ్బులు తో పాటు  తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారు 25 శాతంగా ఉన్నట్లు ఈ సంస్థ అధ్యయనం తెలిపింది. వీరిలో చాలామంది  వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. తీవ్రమైన జబ్బులు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలను మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీస్తున్నాయి. ఆయా వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చులు వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్నాయి. కాగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో రక్త కేన్సర్లు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.జీవనశైలి జబ్బులు, తీవ్రమైన రోగాలపై ప్రధానంగా నిరుపేదలు, అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాలకు అవగాహన లేకపోవడం, ఆయా వ్యాధులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులపై కనీసఅవగాహన లోపించడం శాపంగాపరిణమిస్తోంది. తరచూ వైద్య పరీక్షలు, వైద్యుల సలహాలు తీసుకునే విషయంలోనూ పలువురు వెనుకంజ వేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌ ఆసుపత్రులు నిర్వహించే ఉచిత వైద్య పరీక్షలునిర్వహించినప్పుడు ఆయా టెస్టులుచేసుకునేందుకు కొందరు ముందుకురావడం గుడ్డిలో మెల్ల. నగరంలో 30 ఏళ్లు ఆపై వయసున్న వారిలో 20 శాతం మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. 35 ఏళ్ల పైబడిన వారిలో 12 శాతం మందికి చక్కెర వ్యాధి ముప్పు పొంచి ఉంది. 25 నుంచి యాభయ్యేళ్ల లోపు వయసున్న వారిలో 11 శాతం మంది నోటి కేన్సర్‌తో బాధపడుతున్నారు. 35 ఏళ్లు పైబడిన మహిళల్లో 8 శాతం మంది బ్రెస్ట్‌ కేన్సర్‌ బారిన పడుతున్నారు. ఇక 40 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలు, పురుషుల్లో ఐదు శాతం మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. పదిహేనేళ్ల లోపు చిన్నారుల్లో ఐదు శాతం మందికి రక్త కేన్సర్ల ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన శైలి వ్యాధులు, తీవ్రమైన జబ్బులు రావడానికి గల కారణాలు, చికిత్స, నివారణ పద్ధతులపై ఇటు ప్రభుత్వం, అటు వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛంద సంస్థలు  ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఈ అధ్యయనం స్పష్టం చేయడం విశేషం.

No comments:

Post a Comment