Breaking News

24/01/2020

పడిపోతున్న జీడీపీ...

బడ్జెట్ ముందున్న సవాళ్లు  
న్యూఢిల్లీ, జనవరి 24  (way2newstv.in)
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారుకు ఈ పద్దు కూడా రెండోదే కానుండగా, నిర్మలా సీతారామన్‌కు ప్రధానంగా ఏడు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాల మధ్య వస్తున్న బడ్జెట్‌లో ఈ సవాళ్లను అధిగమించే చర్యలు చేపడితేగానీ దేశ జీడీపీ మళ్లీ పరుగులు పెట్టే వీల్లేదని నిపుణులు అంటున్నారు. దీంతో పన్ను ప్రోత్సాహకాలు, ఉద్దీపనలు, వివిధ రంగాల సంస్థలకు ఆర్థిక సాయం, కేటాయింపులపై సందిగ్ధత ఏర్పడుతున్నది.నిధుల కొరతతో సతమతమవుతున్న నిర్మాణ రంగాన్ని ఆదుకోవడంలో భాగంగా గృహ కొనుగోలుదారులకు రాబోయే బడ్జెట్‌లో పన్ను ప్రోత్సాహకాలను ఇవ్వాలని గురువారం వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ కోరింది. 
పడిపోతున్న జీడీపీ...

గృహ రుణం వడ్డీ చెల్లింపులపై ఉన్న గరిష్ఠ పన్ను రాయితీని రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేసింది. అలాగే పీఎంఏవై పథకం కింద ఎంఐజీ 1, 2 కేటగిరీల్లో రూ.12, 18 లక్షలుగా ఉన్న ప్రస్తుత ఆదాయ పరిమితిని.. రూ.18, 25 లక్షలకు పెంచాలన్నది. దీనివల్ల మరింత మంది ఈ పథకానికి అర్హులై.. ఇందులోని ప్రయోజనాలను పొందేందుకు ఇండ్ల కొనుగోళ్లకు దిగే వీలుందని తెలిపింది.దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 5 శాతానికి పడిపోగా, రెండో త్రైమాసికంలో 4.5 శాతానికి దిగజారింది. మొత్తం ఏడాదికి జీడీపీ అంచనాలను 5 శాతానికే కేంద్రం పరిమితం చేసిన విషయం తెలిసిందే. ఇది 11 ఏండ్ల కనిష్ఠం కావడం గమనార్హం. నిరుద్యోగులూ 45 ఏండ్ల గరిష్ఠానికి పెరిగారని లెక్కలు చెబుతున్నాయి. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నా.. ప్రైవేట్‌ రంగ పెట్టుబడుల్లో పురోగతి లేదు. వరుసగా ఐదో నెల ఎగుమతులు క్షీణించాయి. పారిశ్రామికోత్పత్తి  పడకేయగా, కీలక రంగాల్లో తయారీ అడుగంటిపోయింది.వినియోగదారుల కొనుగోళ్ల శక్తి బలహీనపడటంతో మార్కెట్‌లో స్తబ్ధత నెలకొన్నది. ఆటోమొబైల్‌, నిర్మాణ రంగాలు అమ్మకాలు లేక కుదేలైపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ఈ రంగాల్లో ఉద్యోగ కోతలూ ఆందోళనకరంగా ఉండటం ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నది. ముఖ్యంగా ఆటో రంగం ఉత్పత్తి విరామం తీసుకుంటున్నది. రెండు దశాబ్దాల కనిష్ఠానికి దిగజారిన అమ్మకాలు.. వాహన తయారీకి బ్రేకులు వేశాయి. నిర్మాణ రంగంలో చోటుచేసుకున్న మందగమనం దాని అనుబంధ రంగాలనూ దెబ్బతీస్తున్నది. ఆర్థిక ప్రతికూలతల మధ్య కస్టమర్లు కొనుగోళ్లకు దూరమైయ్యారు.ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నది. గత నెల డిసెంబర్‌లో 65 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 7.35 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం గణాంకాలు పెరుగడం వరుసగా ఇది మూడో నెల. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పెట్టుకున్న 4 శాతం లక్ష్యం దాటి ధరాఘాతం ప్రమాదకర స్థాయికి చేరడంతో వరుస వడ్డీరేట్ల కోతలకూ బ్రేకులు పడిన విషయం తెలిసిందే. టోకు ద్రవ్యోల్బణం సైతం పరుగులు పెడుతుండగా, కూరగాయల ధరలు ముఖ్యంగా ఉల్లి ధరలు ద్రవ్యోల్బణానికి రెక్కలు తొడిగాయి. ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, పడిపోయిన వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం, మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత.. పన్ను వసూళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం నవంబర్‌దాకా బడ్జెట్‌ అంచనాలో 45.5 శాతం మాత్రమే వచ్చింది. ముఖ్యంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఆ దాయం నిరాశాజనకంగా ఉంటున్నది. ఇక స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయమూ నెమ్మదించింది. పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం, పెరుగుతున్న ఖర్చులు.. ద్రవ్యలోటు లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీలో 3.3 శాతానికి ద్రవ్యలోటును కట్టడి చేయాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో ఈ లక్ష్యాన్ని 3.8 శాతానికి సవరించిన సంగతీ విదితమే. దీంతో వ్యయ నియంత్రణ చర్యలను చేపట్టాలని, అనవసరమైన ఖర్చుల్ని తగ్గించి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అయితే ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోవడంలో భాగంగా సర్కారు ప్రకటిస్తున్న ఉద్దీపనలూ ద్రవ్యలోటును ఎగదోస్తున్నాయి.ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహం నింపడానికి పన్నులను తగ్గించాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్‌ పన్నును 10 శాతం తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకూ ఊరటనివ్వాలని సామాన్య, వేతన జీవుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పన్ను శ్లాబులను తగ్గించాలని, ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని కోరుతున్నారు. దీనివల్ల వినియోగ సామర్థ్యం పెరిగి, ఆర్థిక వ్యవస్థ తిరిగి బలోపేతం కాగలదన్న అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ)ను తొలగించాలని దేశీయ పరిశ్రమ కేంద్రాన్ని కోరుతున్నది. ప్రస్తుతం ఆయా సంస్థలు ప్రకటిస్తున్న డివిడెండ్లపై 20 శాతం డీడీటీని చెల్లించాల్సి వస్తున్నది. అయితే ఈ డివిడెండ్‌ ఆదాయాన్ని అందుకుంటున్న వాటాదారులకు మాత్రం పన్నుల నుంచి మినహాయింపు లభిస్తున్నది. దీంతో తమకూ ఆ వెసులుబాటును కల్పించాలని పరిశ్రమ ఇప్పుడు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నది. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న విపత్కర పరిస్థితులు.. వ్యాపార, పారిశ్రామిక రంగాల వృద్ధికి విఘాతం కలిగిస్తున్న విషయం తెలిసిందే.

No comments:

Post a Comment