Breaking News

24/01/2020

మండలి రద్దైతే... కమలానికి దారేదీ

విజయవాడ, జనవరి 24   (way2newstv.in)
శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కార్ ముందుకు వెళుతోంది.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దీనికి సంకేతాలా.. సోమవారం రద్దు ఖాయమా.. ఏపీలో ఎక్కడ విన్నా ఇదే చర్చ. ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ నిర్ణయం రాజకీయాల్లో సంచలనంగా మారగా.. మిగిలిన పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.. రద్దు జరిగితే దాదాపు 50మందికిపైగా నేతలు ఎమ్మెల్సీ పదవులు కోల్పోతారు.మండలి రద్దు జరిగితే టీడీపీనే ఎక్కువమంది ఎమ్మెల్సీ పదవులకు దూరమవుతారు.. తర్వాత వైఎస్సార్‌సీపీ, బీజేపీ, పీడీఎఫ్‌లు ఉన్నాయి. టీడీపీ సంగతి పక్కన పెడితే బీజేపీకి కష్టాలు తప్పేలా లేవు. ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీలు (సోము వీర్రాజు, మాధవ్‌) ఉన్నారు.. రద్దు ఖాయమైతే పదవులు కోల్పోతారు. ఇది ఓ రకంగా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పాలి.
మండలి రద్దైతే... కమలానికి దారేదీ

బీజేపీ ఏపీలో బలోపేతం కావాలని చూస్తోంది. 2024నాటికి ఎలాగైనా అధికారం చేపట్టాలని పావులు కదుపుతోంది. ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకుంటోంది. ఇప్పటికే టీడీపీ నుంచి కొందరు అటు దూకేశారు. ఇక జనసేనతో కలిసి ముందుకు సాగాలని.. పొత్తు కూడా ఖాయం చేసుకున్నారు. కాబట్టి ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులు పోతే.. బీజేపీ తరపున ప్రజల వాయిస్ చట్ట సభల్లో వినిపించే అవకాశం పోతుందన్నమాట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి చట్టసభల్లో ఎలాంటి పదవులు లేకుండా పోతాయి.మండలి రద్దు నిర్ణయమూ అంత సులభం కాదనే చర్చ జరుగుతోంది. కేవలం అసెంబ్లీ మండల్ని రద్దు చేస్తూ తీర్మానం మాత్రమే చేయగలదని.. తర్వాత నిర్ణయం కేంద్రం చేతిలో ఉంటుందనేది వాదన. పార్లమెంట్‌లో ఈ తీర్మానాన్ని ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిస్తే అప్పుడు రద్దు అవుతుంది. అంటే పరోక్షంగా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ చేతుల్లో రద్దు నిర్ణయం ఉంటుంది.. దీనికి కనీసం ఏడాది సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. అంతకు మించి సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు.. కాబట్టి ఇది ఓ రకంగా బీజేపీకి ప్లస్ అవుతుందా అనే చర్చ జరుగుతుంది.

No comments:

Post a Comment