Breaking News

03/01/2020

మురిగిపోతున్న ఎస్సీ స్వయం ఉపాధి నిధులు

వరంగల్, జనవరి 3, (way2newstv.in)
నిరుద్యోగులైన ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందించే రాయితీ రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆర్థిక సంవత్సరం  ముగిసినా గతేడాది మంజూరుచేసిన రుణాలకు సంబంధించిన రాయితీలను ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదు.రుణం మంజూరైందని సంతోషపడ్డ లబ్దిదారులు రాయితీ విడుదలలో  జరుగుతున్న జాప్యంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రాయితీ కోసం ఎస్సీ కార్పోరేషన్ చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే గతేడాది సబ్సీడీలే ఇప్పటివరకు విడుదల కాకపోగా 2019 సంవత్సరానికి సంబంధించి రుణాలను అందించేందుకోసం కూడా అధికారులు దరఖాస్తుల స్వీకరించారు. 
మురిగిపోతున్న ఎస్సీ స్వయం ఉపాధి నిధులు

అయితే ఈ ఆర్థిక సంవత్సరం కూడా మరో మూడు నెలల్లో ముగియనుండగా ఇప్పటివరకు లబ్దిదారుల ఎంపిక కూడా ప్రారంభం కాలేదు. దీంతో వాటి పరిస్థితేంటన్నదీ ప్రశ్నార్థకంగా మారింది.   అర్హులైన నిరుద్యోగ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాయితీ రుణాలను అందజేస్తోంది. వందశాతం రాయితీతో 50వేల రూపాయలను అందిస్తుండగా లక్షలోపు 80శాతం, రూ.2లక్షల నుంచి రూ.12లక్షల వరకు 70శాతం, రూ.12లక్షల నుంచి రూ.50లక్షల వరకు 35శాతం రాయితీతో కూడిన రుణాలను అందజేస్తోంది.2017 సంవత్సరానికి గాను అర్హులైన ఎస్సీయువత నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు జిల్లావ్యాప్తంగా 434మంది లబ్దిదారులను ఎంపికచేసి వారికి రూ.5కోట్ల 79లక్షల రూపాయల రుణాలను మంజూరు చేసారు. ఇందులో  కేవలం 64మంది లబ్దిదారులకు గాను రూ.80.93లక్షల రాయితీని విడుదల చేసిన ప్రభుత్వం మరో 370మంది లబ్దిదారులకు సంబంధించి రూ.4కోట్ల 99లక్షల రాయితీలను పెండింగ్‌లో ఉంచింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసి, మరో ఆర్థిక సంవత్సరం ముగింపుదశకు చేరుకుంటున్నప్పటికి రాయితీ విడుదలతో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. వాటికోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్దిదారులు ప్రభుత్వతీరుతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.రాయితీ ఎప్పుడు వస్తుందోనని ఎస్సీ కార్పోరేషన్ చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం రాయితీ విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు రుణాలను మంజూరు చేయడంలేదు. రుణమస్తే ఎదైనా యూనిట్‌ను పెట్టి ఉపాధి పొందుతామని ఆశపడ్డ లబ్దిదారులకు నిరాశ తప్పడంలేదు. దీనిపై కార్పోరేషన్ అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉంది తామేమి చేయగలమని చెబుతుండటంతో లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రాయితీలు పెండింగ్‌లో ఉండగా 2018 సంవత్సరానికి సంబంధించి 624మందికి రుణమందించేలా  ఎస్సీ కార్పోరేషన్ అధికారులు కార్యచరణ ప్రణాళికను సిద్దం చేసారు. ఇందులో రూ.50వేల చొప్పున 276మందికి కోటి 38లక్షలు, లక్ష రూపాయల్లోపు 117మందికి కోటి 17లక్షలు, రూ2లక్షల వరకు 86మందికి కోటి 72లక్షలు, 7లక్షలు 34మందికి రూ.2కోట్ల 38లక్షలు, రూ.12లక్షల వరకు 13మందికి కోటి 56లక్షలు,  9మందికి రూ.25లక్షల చొప్పున రూ.2కోట్ల 25లక్షలు, రూ.50లక్షల చొప్పున ఐదుగురికి రూ.2కోట్ల 50లక్షల రుణాలను అందిచేలా కార్యచరణ సిద్దం చేసిన అధికారులు వాటికోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు.యూనిట్ల సంఖ్య వందల్లో ఉండగా దరఖాస్తులు మాత్రం వెల్లువెత్తాయి. జిల్లావ్యాప్తంగా 6590 మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. లబ్దిదారుల ఎంపిక జరుగాల్సిన సమయంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అది అలాగే నిలిచిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనుండటంతో ఆలోగా దరఖాస్తుదారులకు రుణాలు అందుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది  ఎంపికైన లబ్దిదారులకు రాయితీ విడుదల కాకపోగా, ఈ యేడు లబ్దిదారుల ఎంపికనే ఇప్పటివరకు ప్రారంభం కాకపోవడంతో  అటు లబ్దిదారులు, ఇటు దరఖాస్తుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

No comments:

Post a Comment