Breaking News

03/01/2020

క్యాపిటల్ అసెంబ్లీపై గురి

న్యూఢిల్లీ, జనవరి 3 (way2newstv.in)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకనేతగా ఉన్న గుగన్ సింగ్ బీజేపీలో చేరిపోయారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ పెద్ద ఆశలే పెట్టుకుంది. జార్ఖండ్ లో ఓటమి పాలయినా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అందుకే ఇటీవల కాలంలో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఉన్న కాలనీలను క్రమబద్ధీకరణ చేసి అక్కడి ప్రజల మనసును గెలచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆమ్ ఆద్మీని గట్టిగా దెబ్బతీస్తే విజయం ఢిల్లీ ఎన్నికల్లో సులువేనని బీజేపీ భావిస్తుంది. అందుకే గతంలో పార్టీని వీడిన నేతలను సయితం తిరిగి పార్టీలో చేర్చుకునే కార్యక్రమం ఘర్ వాపసీని మొదలు పెట్టింది.2013లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన గుగన్ సింగ్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోయారు. 
క్యాపిటల్ అసెంబ్లీపై గురి

ఈయనకు ఈ ప్రాంతంలో దళితనేతగా గుర్తింపు ఉంది. తిరిగి గుగన్ సింగ్ ను పార్టీలోకి రప్పించడంలో బీజేపీ ఢిల్లీ నాయకత్వం సఫలమయిందనే చెప్పాలి. ఢిల్లీ ఎన్నికల ఇన్ ఛార్జిగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యవహరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా బీజేపీకి అనుకూలించే అంశమేనని చెప్పక తప్పదు.ఇక ఢిల్లీ ప్రాంతంలో అనధికార కాలనీలను బీజేపీ క్రమబద్ధీకరించింది. గత ఐదేళ్లలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అన్నింటా విఫలమయిందని బీజేపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు ఇక కేజ్రీవాల్ అక్కరలేదు అంటూ బీజేపీ నినాదాన్ని రూపొందించింది. కేజ్రీవాల్ హయాంలో అన్ని రంగాల్లో విఫలమయిందన్నారు. ముఖ్యంగా విద్యారంగం కోసం కేటాయించిన నిధులను కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని ఢిల్లీ బీజేపీ ఆరోపిస్తుంది.మరోవైపు కాంగ్రెస్ ను పక్కన పెట్టి కేజ్రీవాల్ ను మాత్రమే బీజేపీ టార్గెట్ చేసింది. కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ఉచిత వైఫై, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి వాటిపై సెటైర్లతో కూడిన ప్రచారానికి బీజేపీ దిగడం విశేషం. కేజ్రీవాల్ కు వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ నియమితులు కావడంతో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతలను చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కాయి.

No comments:

Post a Comment