Breaking News

28/01/2020

రిటైర్డ్ ఉద్యోగుల నుంచి వసూళ్లు

హైద్రాబాద్, జనవరి 28, (way2newstv.in)
సుమారు మూడు నుంచి నాలుగు దశాబ్దాలు ఒకే ఆఫీసులో పనిచేశారు. అయినా పనులు కావాలంటే వారి కుటుంబ సభ్యుల నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించేందుకు ‘కార్వాయి’ పేరిట లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వర్తించి రిటైర్డు అయిన ఉద్యోగులకు రిటైర్డు బెనిఫిట్స్ ఇప్పించేందుకు వివిధ కార్యాలయాల్లో చేసే ప్రక్రియను జీహెచ్‌ఎంసీ కార్మిక నేతలు కార్వాయిగా చెప్పుకుంటూ, అది చేసేందుకు నెలల సమయం పడుతోందని, ఇందుకు సుమారు లక్ష నుంచి మూడు లక్షల వరకు రిటైర్డు ఉద్యోగుల వద్ద వసూలు చేసుకుంటున్నారు. 
రిటైర్డ్ ఉద్యోగుల  నుంచి వసూళ్లు

ఉద్యోగులు రిటైర్డు అయిన రోజునే వారికి అన్ని రకాల బెనిఫిట్స్ అందించాలని అధికారులు ఆదేశించినా ఏ మాత్రం మార్పు రావటం లేదు. కమిషనర్ లోకేశ్‌కుమార్ రిటైర్డు ఉద్యోగుల విషయంలో మరో అడుగు ముందుకేసి రిటైర్డు అయిన రోజు ఉద్యోగి, అతని కుటుంబాన్ని జీహెచ్‌ఎంసీ వాహానంలో ఇంటి వద్ద డ్రాపు చేయాలన్న కొత్త నిబంధనను అమలు చేస్తున్నారు. కానీ రిటైర్డు బెనిఫిట్స్ చెల్లించాల్సిన విభాగాల అధికారులు, సిబ్బందిలో, కార్మిక నేతల్లో ఏ మాత్రం మార్పు రాకపోవటం శోచనీయం. తమ ఉనికిని చాటుకునేందుకు, పలు రకాల అక్రమ దందాలు చేసుకునేందుకు కార్మిక సంఘాన్ని స్థాపించిన కొత్తలో ఇదే ఉద్యోగులను వినియోగించుకుంటూ యూనియన్లు లైమ్‌లైట్‌లోకి వస్తాయి. కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం అంటూ జపించే కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు కార్మికులను, ఉద్యోగులను ప్రత్యక్షంగా దోచుకోవటం ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో చర్చనీయాంశంగా మారింది. కొంతకాలం క్రితం వరకు కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగి విధి నిర్వహణలో ఉన్నపుడే మృతి చెందాడు. ఆయన స్థానంలో ఆయన కుమారుడికి ఉద్యోగమిచ్చారు. దురదృష్టవశాత్తు అతను కూడా మృతి చెందాడు. ఆ ఉద్యోగి తల్లి ప్రస్తుతం భిక్షాటన చేస్తూ జీనవం గడుపుతోంది. అతని సోదరి లక్ష్మి వివాహం చేసుకోకుండా తల్లిని చూసుకుంటుంది. నిబంధనల ప్రకారం ఆమెకు ఇవ్వాల్సిన ఉద్యోగాన్ని ఇచ్చేందుకు అధికారులు, పలు కార్మికు సంఘాల నేతలు సాకులు చెబుతూ రెండేళ్లుగా ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు. అంతంతమాత్రం చదువుకుని జీహెచ్‌ఎంసీలో కమాటి, అటెండర్, కార్మికులుగా విధులు నిర్వర్తించి రిటైర్డు అయిన ఉద్యోగులు కొందరు నేతల చేతుల్లో మోసపోతున్నారు.

No comments:

Post a Comment