హైద్రాబాద్, జనవరి 20 (way2newstv.in)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కౌన్సిలర్, కార్పొరేటర్ టికెట్లను డబ్బుకు విక్రయించుకున్నారని కొందరు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డికి చెందిన ఫోన్ కాల్ రికార్డులు బయటపెడుతూ టీఆర్ఎస్ నేతలు తమ అసహనాన్ని వెళ్లగక్కారు. తాజాగా మంత్రి అల్లుడు, కుమారుడితో టీఆర్ఎస్ నేత బొమ్మక్ మురళి అనే వ్యక్తి ఫోన్ సంభాషణ సంచలనం రేపుతోంది. ఇవి మంత్రిని మరింత కష్టాల్లోకి నెట్టేలా ఉన్నాయి.మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్, ఫిర్జాదీగూడ కార్పొరేషన్లలోని టీఆర్ఎస్ నేతల తీరు మంత్రిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి.
పీకల్లోతు కష్టాల్లో మంత్రి మల్లారెడ్డి
ఇక్కడి నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో విఫలమయ్యారని అంటున్నారు. ఈ స్థానంలో మొదటి నుంచి పార్టీలోనే ఉన్న నేత దయాకర్ రెడ్డిని కాదని.. మరో వ్యక్తికి మేయర్ అవకాశం ఇచ్చారు. దీంతో దయాకర్ రెడ్డి అసహనాన్ని గుర్తించి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆయన్ను పార్టీలో చేర్చుకొని బీఫాం ఇచ్చారు. పార్టీ మారిన విషయం తెలిసిన కాసేపటికే దయాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన మల్లారెడ్డి.. మళ్లీ దయాకర్ రెడ్డిని టీఆర్ఎస్‌లోకి లాక్కున్నారు.బోడుప్పల్ కార్పొరేషన్‌లో అయితే, నేతల అసహనం తార స్థాయికి చేరింది. ఉద్యమంలో పాల్గొన్న తమను కాదని ఎవరికో టికెట్ ఇవ్వడం సహించని రాపోలు రాములు అనే వ్యక్తి ఏకంగా మంత్రి మల్లారెడ్డి ఫోన్ రికార్డులనే బహిర్గత పరిచి సంచలం రేపాడు. తనవద్ద ఇంకా ఆధారాలున్నాయని, మంత్రి డబ్బులు డిమాండ్ చేసిన తాలూకూ రికార్డులను బయటపెడతానని రాపోలు రాములు తేల్చి చెప్పడం ఆ ఆడియో టేపుల్లో ఉంది.తాజాగా బోడుప్పల్ మేయర్ అభ్యర్థిగా ఉన్న సంజీవ్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డింగ్ ఆడియో టేపు బయటపడింది. అంతేకాక, ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన బొమ్మక్ మురళి.. మంత్రి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో మాట్లాడిన తాలూకు ఆడియో రికార్డింగ్ కూడా సంచలనం రేపుతోంది. బొమ్మక్ మురళి మర్రి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి, డబ్బు రెడీగా ఉందని, హ్యాండోవర్ చేయడం గురించి ఫోన్ చేసినట్లు చెప్పారు. ఆ వ్యవహారాలన్నీ భద్ర (మల్లారెడ్డి కుమారుడు) చూసుకుంటున్నాడని అతనికే ఫోన్ చేయాలని రాజశేఖర్ రెడ్డి మురళికి సమాధానం ఇచ్చాడు.తర్వాత వెంటనే బొమ్మక్ మురళి భద్రారెడ్డికి ఫోన్ చేశారు. డబ్బు రెడీగా ఉందని, ఇక్కడే ఉన్నట్లు చెప్పారు. అయితే, అవకాశం మరొకరిని వరించిందని, అది అధిష్ఠానం నిర్ణయమని భద్రారెడ్డి తేల్చి చెప్పేశారు. దీంతో నిరాశ చెందిన బొమ్మక్ మురళి మంత్రి తనకే ఆ అవకాశం ఇస్తానన్నారని నిరాశతో అన్నారు.తర్వాత, బొమ్మక్ మురళి మేయర్ అభ్యర్థి సంజీవ రెడ్డికి కూడా ఫోన్ చేశారు. రేటు గురించి మాట్లాడుకున్నారు. నాకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి మరో వ్యక్తి ఆ టికెట్ కొన్నారని, ఇక తనకు దక్కదని భద్రారెడ్డి చెప్పారని, మురళీ.. సంజీవరెడ్డికి చెప్తుండడం కాల్ రికార్డుల్లో బయటపడింది. సోషల్ మీడియాలో ఈ కాల్ రికార్డులన్నీ దుమారం రేపుతున్నాయి.
No comments:
Post a Comment