Breaking News

02/01/2020

కర్ణాటకలో యడ్డీకి 100 రోజుల పూర్తి

బెంగళూర్, జనవరి 2  (way2newstv.in)
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు వరసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంద రోజుల పాలనను పూర్తి చేశానని సంతృప్తి పడాలా? ఉప ఎన్నికల్లో గెలిచామని ఊపు మీద ఉండాలా? కానీ యడ్యూరప్పలో మాత్రం నైరాశ్యం అలుముకుంది. పూజలు, పునస్కారాలతోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. రానున్న కాలం కష్టాలు తెచ్చిపెడుతుందన్నది యడ్యూరప్పకు తెలియంది కాదు. అందుకే ఆయన స్వామీజీలకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటున్నారు. పీఠాల చుట్టూ తిరుగుతూ మొక్కులు మొక్కుకుంటున్నారు.ఉప ఎన్నికలలో విజయం సాధిస్తే ఇక తనకు తిరుగుండదని యడ్యూరప్ప భావించారు. అంతకు ముందు సంభవించిన వరదల వల్ల కన్నడనాట తీవ్ర నష్టం వాటిల్లినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేర సాయం అందలేదు. అయినా ఉప ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొని పదిహేను స్థానాల్లో పన్నెండు స్థానాలను గెలిపించుకుని వచ్చారు. 
కర్ణాటకలో యడ్డీకి 100 రోజుల పూర్తి

ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల నుంచి ప్రశంసలు తప్ప యడ్యూరప్పకు దక్కిందేమీ లేదు.దీనికి తోడు పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై నిరసనలు దేశమంతా జరగుతున్నాయి. కర్నాటకలో కూడా అల్లర్లు చెలరేగి ఇద్దరు పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. ఇది ఇప్పట్లో చల్లారేలా కన్పించడం లేదు. అవి తగ్గితే కాని అధిష్టానం నుంచి పిలుపు వచ్చేలా కన్పించడం లేదు. మరోవైపు పార్టీ నేతల నుంచి యడ్యూరప్పపై వత్తిడి వస్తోంది. మంత్రి వర్గ విస్తరణ చేపట్టి తమకు స్థానం కల్పించాలంటూ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీలో సీనియర్ నేతలు సయితం యడ్యూరప్పను నిత్యం కలసి గుర్తు చేస్తున్నారు.ప్రభుత్వం బలంగా ఉన్నప్పటికీ మంత్రి వర్గ విస్తరణ తర్వాత అసంతృప్తులు చెలరేగే అవకాశముందని ఇంటలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసుకున్న యడ్యూరప్ప ఈ విషయాన్ని కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన 11 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని యడ్యూరప్ప మాట ఇవ్వడంపై సీనియర్ నేతలు ససేమిరా అంటున్నారు. వీరిని ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నంచి విఫలమైన యడ్యూరప్ప సీనియర్ల విషయం అధిష్టానానికే వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోయినా, ఎవరిని తొలగించినా తలనొప్పులు తప్పవన్నది పార్టీ నేతల నుంచే విన్పిస్తున్న మాట.

No comments:

Post a Comment