ఆదిలాబాద్, డిసెంబర్ 18 (way2newstv.in):
వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న పేద ఆదివాసీ, గిరిజన రైతులు దశాబ్దాలుగా త్రీఫేజ్ కరెంట్ సౌకర్యం లేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గిరిజన కర్షకులకు వ్యవసాయ విద్యుత్తు సౌకర్యం కల్పించే పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో అర్హులైన గిరిజన రైతుల కోసం ఐటీడీఏకు రూ.3.71 కోట్ల నిధులు మంజూరు చేసింది. వీటి ద్వారా విద్యుత్తు పనులు చేపట్టి రైతుల కరెంట్ బాధలు తీర్చాలని నిర్ణయించారు. ఉచిత త్రీఫేజ్ విద్యుత్తు కనెక్షన్ల కోసం ఎంపికైన ఆదివాసీ గిరిజన రైతులకు త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించడంలో చేన్ల వరకు విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయడంతోపాటు తీగలు అమర్చడం, ముగ్గురు, నలుగురు రైతులు ఉంటే వారిని కలిపి 25 కేవీఏ,
గిరి రైతులకు కరెంట్ షాక్ (ఆదిలాబాద్)
అయిదు నుంచి పది మంది వరకు ఉంటే వారి కోసం 63 కేవీఏ, పది నుంచి వంద మంది రైతుల వరకు 100 కేవీఏ నియంత్రికలు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికోసం అవసరమైన నిధులు ఐటీడీఏ ద్వారా నేరుగా తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్)కు చెందిన అధికారులకు డీడీల రూపంలో చెల్లిస్తారు. గిరిజన రైతులకు చేయూతనిచ్చి ప్రోత్సహించాలన్న సర్కారు లక్ష్యం బాగానే ఉన్నా.. అమల్లో జాప్యమవుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ.3.71 కోట్లతో 799 మంది ఆదివాసీ, గిరిజన రైతులకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలి. ఇప్పటి వరకు 361 మందికి సౌకర్యం కల్పించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంకా 438 మందికి కరెంట్ వసతి కల్పించాల్సి ఉంది. ఇక జిల్లాల వారీగా ప్రగతిని పరిశీలిస్తే.. ఆదిలాబాద్ జిల్లాలో రూ.2.30 కోట్లతో 624 ఆదివాసీ గిరిజన రైతులకు విద్యుత్తు సౌకర్యం కల్పించాల్సి ఉండగా 239 మందికి మాత్రమే కల్పించారు. ఇంకా 385 మంది కర్షకులు కరెంట్ సౌకర్యానికి నోచుకోలేదు. నిర్మల్ జిల్లాలో రూ.35.84లక్షలతో 86 మంది అన్నదాతలను ఎంపిక చేయగా 53 మందికి విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా 33 మందికి ఇవ్వాల్సి ఉంది. మంచిర్యాల జిల్లాలో రూ.33.07 లక్షలతో 48 మంది రైతులకు ఇంకా 38 మందికి ఇచ్చారు. మరో పది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఇక కుమురం భీం జిల్లాలో రూ.7.26లక్షలతో 41 మందికి విద్యుత్తు సౌకర్యం కల్పించాల్సిఉండగా ఇంకా 31 మందికి ఇచ్చారు. ఇంకా 10 మందికి ఇవ్వాల్సి ఉంది.
No comments:
Post a Comment