Breaking News

16/08/2019

యదేఛ్ఛగా గ్లైఫోసెట్‌ విక్రయాలు

నల్గొండ, ఆగస్టు 16, (way2newstv.in)
నల్గొండ జిల్లాలో గ్లైఫోసెట్‌ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా విత్తనాలు, పురుగు మందుల విక్రయ దుకాణాలు సుమారు 300 వరకు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటుండగా అత్యధిక శాతం దుకాణాల్లో నిషేధిత మందును రైతులకు అంటగడుతున్నారు. బత్తాయి తోటలకు ఎక్కువ మొత్తంలో అవసరమున్న రైతులకు కొండమల్లేపల్లి, దేవరకొండ, మాల్‌ నుంచి వ్యాపారులు సరఫరా చేస్తున్నారు. పది రోజుల కిందటి వరకు బహిరంగంగా అమ్మిన వ్యాపారులు ఇప్పుడు గుట్టుగా విక్రయిస్తున్నారు.సాగు రంగంలో విప్లవాత్మక మార్పుల పేరుతో కొన్ని పరిశ్రమలు మూల విత్తనంపై చేస్తున్న ప్రయోగాలు.. కలుపు నివారణకు అధిక మోతాదులో వినియోగిస్తున్న మందులు మానవాళికి పెనుముప్పులా పరిణమించాయి. ఇవేవీ తెలియని రైతులు కలుపు తీసే అవసరం ఉండదనే ఆలోచనతో దళారులను నమ్మి సాగు క్షేత్రాల్లో వారు సూచించిన కలుపు నివారణ మందులు వాడుతున్నారు. కేన్సర్‌ కారకమని తేలడంతో అమెరికాలోనూ దీనిని నిషేధించారు. 
 28 ఏళ్ల తర్వాత ఎడమ కాల్వ నుంచి సాగు నీరు

రాష్ట్రంలో ఇప్పటికే దీనిపై తాత్కాలిక నిషేధం ఉంది. దీనిని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. అవగాహన కల్పించకపోవడంతో రైతులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. కలుపు తీయాలంటే కూలీల ఖర్చు అధికమవుతోందని పత్తి రైతులు ఈ మందును విరివిగా చల్లుతున్నారు. ఇది ఒకసారి చల్లితే అక్కడి మొక్కలు, కాయలపై దాని రసాయన అవశేషాలు 2 నుంచి 192 రోజుల వరకు ఉంటున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు.ఇదే వారి పాలిట శాపంగా మారుతోంది. కలుపు మొక్కల నివారణ పేరుతో అత్యంత విషపూరితమైన గ్లైఫోసెట్‌ మందును దళారులు రైతులకు విచ్చలవిడిగా అంటగడుతున్నా వ్యవసాయ అధికారులు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిషేధం మాటున గ్రామీణ ప్రాంత రైతులే లక్ష్యంగా ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే వారిపై పీడీ చట్టం ప్రయోగించి కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు చెప్పినా అధికారుల చెవికెక్కడం లేదు. దీని వాడకంతో పంటలు దెబ్బతిని, పర్యావరణానికి ముప్పు ఏర్పడటమే కాక రైతులకు క్యాన్సర్‌ వంటి రోగాలు సోకే ప్రమాదం ఉందని ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు నిర్ధరించగా తాజాగా అమెరికాలో కోర్టు వాస్తవమేనని ఓ కంపెనీకి రూ.2 వేల కోట్ల జరిమానా విధించింది. గ్లైఫోసెట్‌ వల్ల క్యాన్సర్‌ వ్యాధి సోకుతుందా లేదా అన్నది వెంటనే అధ్యయనం చేసి చెప్పాలని భారత వైద్య మండలిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మందును ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తి, బత్తాయి క్షేత్రాల్లో వినియోగిస్తుండటంతో లక్షలాది మంది రైతుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. నాంపల్లి మండలంలోని దుకాణాల్లో గ్లైఫోసెట్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తెలిసిన వారికి విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మండల పరిధిలోని కొంతమంది మాల్‌, కొండమల్లేపల్లి, దేవరకొండ, పట్టణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. తాజాగా ఒంటెద్దుగూడెం, గట్లమల్లేపల్లి, మహమ్మదాపురం, నెమిళ్లగూడెం రైతులు పత్తి, బత్తాయిలో కలుపు నివారణకు దీనిని వాడుతున్నారు. కలుపు మందు కొట్టినా ఏమీ కాదని వ్యాపారులు అంటగట్టారని రైతులు చెబుతున్నారు.

No comments:

Post a Comment