టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి
కుమారధార, పసుపుధార జలాశయాలను పరిశీలించిన ఛైర్మన్
తిరుమల డిసెంబర్ 27 (way2newstv.in)
తిరుమలలోని జలాశయాల్లో రాబోవు రెండు సంవత్సరాలు భక్తులకు సరిపడా నీరు అందుబాటులో ఉందని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని కుమారధార, పసుపుధార జలాశయాలను శుక్రవారం టిటిడి ఛైర్మన్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో తొలి సారిగా తిరుమలలోని డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండాయన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం జూలై నుండి విస్తారంగా వర్షాలు కురిశాయన్నారు. తద్వారా తిరుమలలోని కుమారధార, పసుపుధార, ఆకాశగంగ, పాపావినాశనం, తిరుపతిలోని కల్యాణి డ్యామ్‌లో జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయన్నారు.
తిరుమల జలాశయాల్లో రెండు సంవత్సరాలకు సరిపడా నీరు
ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నీటి నిల్వలు ఇంకా పెరుగుతాయన్నారు. వీటితో పాటు తిరుమలకు శాశ్వతంగా నీటి అవసరాలు తీర్చేందుకు రూ. 400 కోట్లతో బాలాజి రిజర్వాయర్ నీటిని వినియోగించుకునేందుకు టిటిడి బోర్డు తీర్మానించిందని తెలిపారు.తిరుమలకు విచ్చేసే భక్తులు జలప్రసాదం నీటిని స్వీకరించేందుకు మరింత సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాబోవు సంక్రాంతి నుండి తిరుమలలో ప్లాస్టిక్ బాటిళ్ళు, బ్యాగులు నిషేధించనున్నట్లు తెలిపారు.అదేవిధంగా శుక్రవారం ఉదయం జరిగిన హెచ్‌డిపిపి సమావేశంలో సనాతన ధర్మ ప్రచారానికి వేద పాఠశాలలు, వేద పారాయణంను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దళితవాడలలో ఆలయాలు నిర్మించడం, శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాల విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఎన్‌జివోల సహకారంతో తక్కువ ఖర్చుతో ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా చిన్నతనం నుండి విద్యార్థులకు సనాతన హైందవ ధర్మాన్ని తెలియజేయవచ్చన్నారు. శ్రీవారి వైభవోత్సవాలు దేశ వ్యాప్తంగా ఉన్న నగరాలు, జిల్లా కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు, టిటిడి ఆలయాలు ఉన్న ప్రాంతాలలో నిర్వహించేందుకు ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు.
No comments:
Post a Comment