Breaking News

27/12/2019

పేరుకే మంత్రులు... పెత్తనం ఆయనదే

హైద్రాబాద్, డిసెంబర్ 27, (way2newstv.in)
రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయలాంటిది ఆర్థికశాఖ. వివిధ శాఖలకు కేటాయింపులు, వాటి ఖర్చును ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం, అత్యవసర సమయాల్లో నిధులను విడుదల చేయటం, ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి.. అందుకనుగుణంగా డబ్బును సర్దుబాటు చేయటం తదితరాంశాలు ఆ శాఖ కనుసన్నల్లోనే కొనసాగుతుంటాయి.  2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ రూపకల్పనకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈనెల ఏడున ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ ఎస్‌కే జోషీతోపాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. 
పేరుకే మంత్రులు... పెత్తనం ఆయనదే

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజీఎస్టీ నిధులు విడుదల కాకపోవటం, కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాను గణనీయంగా తగ్గించటంపై ముఖ్య మంత్రి కూలంకుషంగా చర్చించారు. ఇలాంటి అంశాలన్నింటిపై తదుపరి నిర్వహించబోయే మంత్రివర్గ సమావేశంలో సమగ్రమైన నోట్‌ను అందించాలంటూ అధికారులను ఆదేశించారు. ఆర్థిక నియంత్రణను పాటించాలంటూ దిశా, నిర్దేశం చేశారు. అంతటి కీలకమైన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొనకపోవటం చర్చ నీయాంశమైంది. ఇంతటి ముఖ్యమైన ఈ శాఖ క్రమక్రమంగా తన ప్రాధా న్యతను కోల్పోయి.. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశానుసారమే పని చేస్తున్నదా..? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. వాస్తవ పరిస్థితులు కూడా ఇదే వాదనను రుజువు చేస్తున్నాయి. ఆర్థికశాఖకు ప్రత్యేక మంత్రి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయం లేకుండానే మిగతా వ్యవహాలన్నీ జరిగిపోతుండటం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్‌ ఆర్థికశాఖపై సమీక్ష చేయటంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు.. కానీ ఆ శాఖ మంత్రిని కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా..? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమ వుతున్నాయి. ఇదే సమయంలో విత్తశాఖ మంత్రిగా హరీశ్‌ ఇంతవరకూ ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించ లేదు. ఖైరతాబాద్‌లోని అర్థగణాంకశాఖ సంచాలకుల కార్యాలయంలో ఆయన కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ.. అవి కేవలం ప్రణాళికాశాఖకే పరిమితమవుతున్నాయి తప్ప వాటిలో ఆర్థికశాఖకు చెందినవి ఒక్కటీ ఉండటం లేదు.తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. నాలుగున్నరేండ్ల సమయంలో ఆయన ఐదు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. కానీ ఆ కాలంలో ఈటల కేవలం నిమిత్త మాత్రుడిగానే మిగిలి పోయారు. ఒకానొక సమయంలో బడ్జెట్‌ రూప కల్పనపై హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తుండగా.. ఈటల మాత్రం కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం జిల్లాల్లో ఉండిపోయారు. శాఖలకు నిధుల కేటాయింపులు, వాటిలో ఏయే అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి..? తదితరాంశాల్లో సీఎం ముద్రే కనిపించింది. గత డిసెంబరులో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. ఆ వెంటనే పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవటంతో ఆర్థికశాఖ కొద్ది నెలలపాటు సీఎం వద్దనే ఉండిపోయింది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా హరీశ్‌రావుకు ఆ శాఖను కేటాయించారు. అయితే సదరు శాఖకు మంత్రి మారినప్పటికీ... దాని పట్ల సీఎం వ్యవహరిస్తున్న తీరులో మార్పు రాలేదన్నది మాత్రం నిర్వివాదాంశం. హరీశ్‌ మంత్రి పదవి చేపట్టిన కొద్ది నెలలకే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఆ సందర్భంగా శాసనసభలో ఆయనే బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆరే.. శాసనసభలో బడ్జెట్‌ పద్దును చదవి వినిపించారు. హరీశ్‌కు మండలిలో ఆ అవకాశం దక్కింది.

No comments:

Post a Comment